తాజా వార్తలు

850 ఏళ్ల పురాతన చర్చిలో భారీ అగ్ని ప్రమాదం

850 ఏళ్ల పురాతన చర్చిలో భారీ అగ్ని ప్రమాదం
మంటల్లో   ‘సింబల్‌ ఆఫ్‌ ప్యారిస్‌’
ప్రమాదంపై  ప్రపంచ నేతల  దిగ్భ్రాంతి


 ఫ్రాన్స్ రాజధాని పారిస్‌‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం  ప్రపంచవ్యాప్తంగా ఆందోళన  పుట్టించింది.  850 సంవత్సరాల అతిపురాతనమైన  నోట్రే డామే కేథడ్రల్‌ చర్చిలో  సోమవారం  సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది. చర్చిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు కొద్ది నిమిషాల వ్యవధిలోనే చర్చిని చుట్టుముట్టాయి. దాదాపు 400 మంది  అగ్నిమాపక సిబ్బందిని  మోహరించారంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు అధికారులు  విచారిస్తున్నారు. అనేక అమూల్య కళాఖండాలు,  చారిత్రక  చిహ్నాలను  భద్రపరిచారు. ఈ ఘటనలో  సిబ్బంది ఒకరు గాయపడ్డారనీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. 

400 ఫైరింజన్లు

నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు. దాదాపు 400 ఫైరింజన్ల సాయంతో అగ్నికీలలను అదుపులోకి చేసే ప్రయత్నం చేశారు. చర్చి చుట్టుపక్కల నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

12వ శతాబ్దపు నాటి కట్టడం

12వ శతాబ్దానికి చెందిన పురాతన కట్టడమైన నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ప్యారిస్‌లో చారిత్రాత్మకమైన ప్రదేశమైన ఈ చర్చిని సందర్శించేందుకు ఏటా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకలు తరలివస్తుంటారు. నోట్రే డామే చర్చి అగ్నికి ఆహుతి కావడంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేకరోన్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

నోట్రే డామే ఘటనపై స్పందించిన ట్రంప్

నోట్రే డామే కేథడ్రిల్ చర్చి అగ్నికి ఆహుతవడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని గొప్ప వారసత్వ సంపదల్లో ఒకటైన చర్చి మంటల్లో కాలిపోవడం బాధ కలిగించిందని అన్నారు. ప్రజల జీవన విధానం, సంస్కృతిలో భాగమైన నోట్రే డామే చర్చి ఆనవాళ్లు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నానన్నారు ట్రంప్.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు