రంగారెడ్డి

మిస్టరీగా పాస్టర హత్య కేసు!

రంగారెడ్డి : హత్య కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు. వికారాబాద్ పట్టణంలోని చర్చిలో గత శుక్రవారం దుండగుల చేతిలో గాయపడి ఆస్పతిలో చికిత్స పొందుతూ పాస్టర్ సంజీవులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన క్రైస్తవ సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. ఈ కేసును ఛేదించేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు.. ఇది ప్రొఫెషనల్స్ పనేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆయనను హతమార్చిన వైనం.. వాడిన ఆయుధాలు.. పోలీసుల అనుమానాలను పెంచుతున్నాయి.  లోపలి గదిలోంచి భార్య బయటకు వచ్చేలోగానే కొంచెంకూడా అలికిడి కాకుండా పాస్టర్‌పై దాడి చేసి తప్పించుకోవడం చూస్తుంటే ఇది సుపారీ ముఠా పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యలో ముగ్గురు పాల్గొని ఉంటారని.. పాస్టర్ భార్య చూసిన ఓ నిందితుడి ఊహాచిత్రం రూపొందించి దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ కోణాల్లో విచారణ సాగిస్తున్న పోలీస్ యంత్రాంగం గతంలో పాస్టర్ పనిచేసిన చోట్ల శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తును సాగిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఆయన పనిచేసిన ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ప్రాంతానికి ఓ దర్యాప్తు బృందాన్ని పంపారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు