జాతీయం

పూరి తీరంలో ప్రపంచంలో అతిపెద్ద జీసస సైకతశిల్పి

ఒడిశాకు చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో అద్భుతం సృష్టించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జీసస్ ప్రతిమను రూపొందించారు. పూరి తీరంలో 35x75 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకోసం వెయ్యి టన్నుల రంగుల మిశ్రమంతో కూడిన ఇసుకను వాడారు. పట్నాయక్ 25 మంది శిష్యులతో కలసి మూడు రోజుల్లో తయారు చేశారు. జీసస్ తో పాటు మేరీ మాత, శాంతా క్లాజ్ తో కూడిన విగ్రహం అందర్నీ ఆకర్షిస్తోంది.
ఈ నెల 24 నుంచి జనవరి 1 వరకు జీసస్ ప్రతిమను భక్తుల సందర్శనార్థం ప్రదర్శించనున్నారు. జీసస్ విగ్రహాన్ని సందర్శించేందుకు క్రైస్తవ సోదరులు అమితాసక్తి చూపుతున్నారు. పట్నాయక్ ఇంతకుముందే ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించారు. తాజాగా అతిపెద్ద జీసస్ విగ్రహాన్ని గుర్తిస్తున్నట్టుగా లిమ్కా బుక్ రికార్డుల నిర్వాహకుల నుంచి ఆయనకు లేఖ అందింది.
తన కళతో ఇసుకరేణువులలో సరికొత్త వెలుగు నింపారు సుదర్శన్ పట్నాయక్(36). ఎవరి దగ్గరా శిష్యరికం చేయకుండా సాండ్ ఆర్టిస్ట్‌గా తనను తాను తీర్చిదిద్దుకొని అంతర్జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ‘సామాజిక చైతన్యానికి సైకతకళను వారధిగా చేసుకున్నాను’ అంటున్న పట్నాయక్‌తో ఇంటర్వ్యూ...
వెనక్కి తిరిగి చూసుకుంటే?
బాల్యం అత్యంత దుర్భరంగా గడిచింది. దీనికి కారణం పేదరికం. ఏమీ తోచక... పూరీ సాగర తీరంలో తిరుగాడేవాడిని. ఇసుకతో నాకు తోచిన విధంగా ఆకృతుల్ని మలచడం కాలక్షేపంగా మారింది. అప్పుడు కాలక్షేపం కోసం చేసిన పని ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెడుతుందని ఎప్పుడూ ఊహించలేదు.
మీ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన గురించి చెబుతారా?
1999 సంవత్సరం లండన్‌లో జరిగిన ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్ నా జీవితాన్ని కొత్తరకంగా మలుపు తిప్పింది. ఈ టోర్నమెంటులో సైకత ప్రదర్శనకు తొలి అవకాశం దక్కింది. నా కళకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది.
సైకతకళకు ఆదరణ ఎలా ఉంది?
ప్రపంచదేశాలు వేదికలు ఏర్పాటుచేసి యువకళాకారుల్ని ప్రోత్సహిస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో సైకతకళలో పోటీలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ సాండ్ ఆర్ట్ట్ కమిటీ ప్రపంచదేశాల్లో సైకత కళాకారుల్ని ఎంపికచేసి అంతర్జాతీయ ప్రదర్శనలకు వేదిక ఏర్పాటు చేస్తుంది. మనదేశంలో కళ, సాంస్కృతిక విభాగాలు నృత్య, సంగీత ఉత్సవాల్లో సైకత కళకు స్థానం కల్పిస్తున్నాయి.
మీ ఆశయం ఏమిటి?
సైకతకళ పట్ల విశేష ఆదరణ పెంపొందిచండం. దీనికోసం పలు ప్రాంతాల్లో విస్తారంగా పర్యటిస్తున్నాను. పలుచోట్ల వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాను. గత పదిహేనేళ్లుగా పూరీ సాగరతీరంలో సాండ్ ఆర్టు ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేసి బాలబాలికలు, యువతీయువకులకు సైకతకళలో శిక్షణ ఇస్తున్నాను. గురుకులం తరహాలో యువతరానికి కళలో శిక్షణ ఇస్తున్నాను. ఈ కళకు సంబంధించి ‘సాండ్ ఆర్ట్’ పుస్తకాన్ని ప్రచురించాను.
సైకతకళకు కావలసింది ఏమిటి?
సైకతకళకు నాంది సృజనాత్మకత. సృజనాత్మకత ఉన్నవాళ్లకు ఆకాశమే హద్దు. మరో విషయం ఏమిటంటే కళ అనేది వారసత్వం కాదు. వరం. అద్భుతమైన వరం. ఆ వరాన్ని కాపాడుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు.
ప్రతిష్టాత్మక సంస్థల అంబాసిడర్‌గా వ్యవహరించడం వ్యాపారశైలి కాదా?
ప్రాథమికదశలో ఆదరించిన నాల్కో సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా, ఒడిశా ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాను. ఒడిశా లలితా కళా అకాడెమీ కార్యవర్గ సభ్యునిగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ అవకాశాలు, హోదాలు ప్రాణానికి ప్రాణంగా స్వీకరించిన సైకతకళ ఆదరణ, విస్తరణకు ఉపయోగిస్తాను.
సైకత శిల్పకళలో కొత్తదనం గురించి చెప్పండి...
సృజనాత్మకత కోసం ఉరకలేసే ప్రపంచం నిత్యం కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంది. యానిమేషన్, కాన్వాస్, పెయింటింగ్ విభాగాల్లో సైకతకళ విస్తరిస్తుంది. ఈ రంగాల్లో కూడా రాణించడం ఓ చక్కటి అవకాశంగా భావిస్తున్నాను. ఒడిశా లలితకళా అకాడెమీ ప్రాంగణంలో ‘సాండ్ ఆర్ట్ ఫొటోస్ ఆన్ కాన్వాస్’ ఇతివృత్తంతో ఏర్పాటుచేసిన ప్రదర్శన ఔత్సాహిక కళాకారులు, కళాప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
మీకు వచ్చిన అవార్డులు...
అయిదుసార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. పలు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. 2012 సంవత్సరంలో బరంపురం విశ్వవిద్యాలయం గౌరవాత్మక డాక్టరేటుతో సత్కరించింది. గోదావరి అవార్డు (మహారాష్ట్ర), సరళ అవార్డు (ఒడిశా), నేషనల్ యూత్ అవార్డు (బీహారు) వంటి జాతీయ అవార్డులు లభించాయి.

- సుదర్శన్ పట్నాయక్, సైకతశిల్పి


 తాజా వీడియోలు 
తాజా వార్తలు