రాష్ట్రీయం

యువతులను రేప్‌ చేసిన చర్చి ఫాదర్‌

చెన్నై : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి 30 మంది యువతులపై అత్యాచారానికి పాల్పడిన చర్చి ఫాదర్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫాదర్‌ వల్ల గర్భం దాల్చిన ఓ యువతి పెళ్లాడమని పట్టుబట్టడంతో ఆమెను హత్య చేశాడు. తాజాగా ఫాదర్‌ మాటలకు మోసపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... తిరునల్వేలి జిల్లాకు చెందిన మిలన్‌ సింగ్‌ (46) రామనాధపురం సాయల్‌కుడి గ్రామ చర్చి ఫాదర్‌గా ఉన్నాడు. ఆరు నెలలకు ముందు పాళయంకోటకు చెందిన కాంతిమతి (30) అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మిలన్‌ సింగ్‌ ఆమె వద్ద నుండి సుమారు ఐదు లక్షల రూపాయలు, బంగారు నగలు తీసుకుని మోసగించాడు. పది రోజుల క్రితం ఆ యువతికి ఉద్యోగం వచ్చింది రమ్మంటూ ఆమెను కారులో తీసుకెళ్లాడు. అనంతరం వెళుతోన్న కారు నుంచి ఆమెను రోడ్డుపైకి తోసేశాడు. దీంతో కాంతిమతి జరిగిన విషయాన్ని శంకరన్‌ కోయిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మిలన్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. విచారణలో భాగంలో ఫాదర్‌ 30 మంది యువతులకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడైంది. దీంతోపాటు శంకరన్‌కోయిల్‌ జెసిడి నగర్‌కు చెందిన అన్బుసెల్వం (24) అనే యువతి మిలన్‌సింగ్‌ వల్ల గర్భందాల్చి తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో, ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి నిర్ధాక్షిణ్యంగా సజీవదహనం చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల విచారణలో తిరునల్వేలి, పాళయంకోట తదితర ప్రాంతాల్లో 30 మంది యువతులపై తాను అత్యాచారం జరిపినట్లు అంగీకరించాడు. ఇదిలా ఉంటే ఫాదర్‌ అత్యాచారాల వెనుక అతని భార్య పాత్ర ఉండటంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు