క్రిష్ణ

గన్నవరం పాస్టర్‌ అమెరికాలో అరెస్ట్‌

గన్నవరం : క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన పాస్టర్‌ వీరపనేని జాన్సన్‌చౌదరి అదృశ్యమైన సంఘటనకు సంబంధించిన మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆయనను అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు స్వయంగా జాన్సన్‌ జులై 21వ తేదీన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. జాన్‌ 3వ తేదీన క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన జాన్సన్‌ చౌదరి తిరిగి జులై 13వ తేదీన రాకపోవడంతో ఆయన భార్య సుభాషిణి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లాస్‌ ఏంజెల్స్‌ నుంచి లండన్‌ మీదుగా ఇక్కడికి రావాల్సిన జాన్సన్‌ అసలు విమానం ఎక్కలేదని రాష్ట్ర పోలీసుల విచారణలో తేలింది. ఆయన ఆచూకీ కోసం అమెరికాలో ఉంటున్న బంధువులు తానాలో ఫిర్యాదు కూడా చేశారు. కాగా జాన్సన్‌ జులై 21వ తేదీన తన భార్య సుభాషిణికి స్వయంగా ఫోన్‌చేసి లాస్‌ ఏంజెల్స్‌ పోలీసులు తనను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అనంతరం రిమాండ్‌కు పంపడంతో ఫోన్‌ కాంక్ట్‌లో లేనట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్‌కు గల కారణాలను కుటుంబ సభ్యులకు తెలుపలేదని విజయవాడ ఈస్ట్‌ జోన్‌ ఎసిపి భాస్కరరావు తెలిపారు. అక్కడి పోలీసుల నుంచి వచ్చే రిపోర్టు ఆధారంగా అరెస్ట్‌ కారణాలు తెలియాల్సి ఉంటుందన్నారు. ద హోలి గాడ్‌ మినిస్ట్రీస్‌ ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న జాన్సన్‌చౌదరి ఇక్కడ సేవా కార్యక్రమాల కోసం అమెరికాలోని క్రైస్తవ మత సంస్థ నుంచి వచ్చే ఫండ్స్‌ వినియోగంలో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదు మేరకు లాస్‌ ఏంజెల్స్‌ పోలీసులు ఆరెస్ట్‌ చేసినట్లు సమాచారం.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు