క్రిష్ణ

ఘనంగా ముగిసిన ఉత్సవాలు

విజయవాడ : గుణదల మేరీమాత ఉత్సవాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు పది లక్షలలోపు భక్తులు వచ్చి ఉంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు స్వైన్‌ఫ్లూ భయం వణికించినా, ముందస్తుగా వైద్యశాఖ చేసిన ఏర్పాట్లు వల్ల ఆ ప్రభావం లేకుండా అంతా ప్రశాంతంగా ముగిసింది. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒక డిసిపి, ఇద్దరు ఎసిపిలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలతో పాటు 300 మంది కానిస్టేబుల్స్‌, 200 మంది హోంగార్డులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఉచిత మంచినీటి సరఫరా, ఇతర సేవలందించాయి. వాటిల్లో యూనియన్‌ బ్యాంక్‌, భక్తులకు రెండు లక్షల వరకు మంచి నీటి ప్యాకెట్లు, మూడువేల మందికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసింది. వాటర్‌ ప్యాకెట్ల పంపిణీకి రెండు వాటర్‌ కూలర్లను బ్యాంక్‌ డిజిఎం కె.ఎల్‌.రాజు, విజయవాడ రీజియన్‌ సిఎం, ఆర్‌.ఒ. సి.రవీంద్రనాధ్‌, అయోధ్యనగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ పి.ఎల్‌.విద్యాధర్‌లు అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్‌ యాజమాన్యం, అధికారులకు ఫాదర్‌ చిన్నప్ప కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆర్‌.టి.సి.ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేసింది. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భక్తులకు మూడు రోజులు సేవలందించాయి. ఉత్సవాల్లో ప్రధానమైన దివ్యబలి పూజా కార్యక్రమాల్లో పలువురు గురువులతో పాటు నల్గొండ పీఠాధిపతులు గోవిందజోజి, ఏలూరు పీఠం వికార్‌ జనరల్‌ రెవ.మోన్సిజ్ఞోర్‌, తోట గాబ్రియేలు, కర్నూలు పీఠాధిపతులు పూల ఆంతోని, విశాఖ అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కతోలిక పీఠం అపోస్తలిక్‌ పాలనాధికారి బిషప్‌ గోవిందుజోజి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆయన భక్తులకు సందేశమిస్తూ, గుణదల మాతను శరణుకోరి వచ్చే వారికి కష్టాలు దరిచేరవన్నారు. దేవుడిచ్చిన జన్మను సాఫల్యం చేసుకోవాలన్నారు. మన మనస్సే దేవాలయం కావాలన్నారు. తిరునాళ్ళకు వచ్చిన భక్తులు హృదయ పరివర్తన పొంది వెళ్ళాలని కోరారు. అనంతరం పూజాపీఠంపై గోవిందుజోజి, మోన్‌సిజ్ఞోర్‌, పుణ్యక్షేత్రం రెక్టర్‌ ఫాదర్‌ మువ్వల ఎం.చిన్నప్ప, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్‌ మువ్వల ప్రసాద్‌, వందమందికిపైగా డయాసిస్‌ ఫాదర్స్‌ సమిష్టి దివ్యపూజాబలి సమర్పించారు. అనంతరం భక్తులకు దివ్యసత్ప్రసాదం అందజేశారు. కొండమధ్య గుహలో మాతను దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు