క్రిష్ణ

క్రైస్తవ సంస్థల సేవలు అపూర్వం - ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌

విజయవాడ : పేదలకు క్రైస్తవ సంస్థలు అందిస్తున్న సేవలు అపూర్వమని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు జలీల్‌ఖాన్‌ అన్నారు. తారాపేట సెయింట్‌ పీటర్స్‌ కెథడ్రల్‌ (ఆర్‌సీఎమ్‌) చర్చి ఆవరణలోని మెత్రేసన ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేద మహిళలకు 25 కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం చర్చి ఆవరణలో నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన జలీల్‌ఖాన్‌ మాట్లాడుతూ మహిళల సాధికారతకు ఈ విధమైన కుట్టుమిషన్‌ శిక్షణ, పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తతం చేయాలని ఆయన సూచించారు. నగర పాలక సంస్థ వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌లీడర్‌ బండి నాగేంద్రపుణ్యశీల మాట్లాడుతూ మహిళలు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగడానికి పాటుపడాలన్నారు. మెత్రేసన సేవలు అభినందనీయమన్నారు. చర్చి ఫాదర్‌ రెవ.ఫాదర్‌ లాము జయరాజు మాట్లాడుతూ క్రైస్తవ ప్రముఖుడు స్వర్గీయ ఫాదర్‌ మర్రెడ్డి ఆధ్వర్యంలో మెత్రేసన సంస్థను స్థాపించడం జరిగిందన్నారు. ఏడాదికి 50 చొప్పున ఆరు మాసాల శిక్షణనిచ్చి బ్యాచ్‌కు 25 చొప్పున కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక కార్పొరేటర్‌ షేక్‌ ఆసీఫ్‌ మాట్లాడుతూ ఆరు మాసాల పాటు కుట్టు శిక్షణను అందించి ఆ తరువాత మిషన్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ కె.సింహరాయులు, వైఎస్సార్‌ సీపీ నగర అధికార ప్రతినిధి దాసీ జయప్రకాష్‌కెనడీ, నాయకులు  జోషి తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు