జాతీయం

ఢిల్లీలో మరో చర్చిపై దాడి

ఢిల్లీ : ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో మరో చర్చి విధ్వంసానికి గురైంది. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉన్న సెయింట్‌ ఆల్ఫోన్సా చర్చిలోకి ఆదివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి విధ్వంసం సృష్టించారు. నగరంలో గత నవంబర్‌ నుంచి చర్చిలపై దాడి జరగడం ఇది ఐదోసారి. దుండగులు ఆల్ఫోన్సా చర్చి ప్రధాన ద్వారాలని బద్దలుకొట్టి లోనికి వెళ్ళారని, పలు పూజా వస్తువులను ధ్వంసం చేసారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై చోరి కేసు నమోదు చేశామన్నారు. చర్చి సమీపంలోని సిసి కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది విద్వేషపూరిత దాడి అని క్రైస్తవులు మండిపడుతున్నారు. ఢిల్లీలో కొన్ని నెలలుగా ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయని, ఇది తమ చర్చిని అపవిత్రం చేయడానికి జరిపిన దాడి అని ఆల్ఫోన్సా చర్చి మతాధికారి ఫాదర్‌ విన్సెంట్‌ సాల్వతోర్‌ ఆరోపించారు. దిల్షాద్‌ గార్డెన్‌, వికాస్‌పురి, జసోలాల్లో ఇలాంటి దాడులు జరిగాయన్నారు. కాగా తాజా ఉదంతంపై నివేదిక అందజేయాలని కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. నగరంలోని మత స్థలాల భద్రతకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని గత ఆరు నెలల్లో ఇలాంటి దాడుల్లో చేసిన అరెస్టులు, ఇతర వివరాలు కూడా ఇవ్వాలంది. మత స్థలాలకు ముఖ్యంగా మైనారిటీల ప్రార్ధన మందిరాల సమీపంలో అదనపు భద్రతా సిబ్బందిని నియమించి భద్రత పెంచాలని ఆదేశించింది. ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు కేంద్ర హోంశాఖ అధికారులను కలిసి మాట్లాడారు.  


 తాజా వీడియోలు 




తాజా వార్తలు