హైదరాబాద్

సి.ఎం.కు దళిత క్రిస్టియన్ల కృతజ్ఞతలు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు మునుపెన్నడూ జరగలేదని తెలంగాణ క్రైస్తవ సేన వ్యవస్థాపక అధ్యకక్షుడు నాగళ్ళ పోచయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కె.చంథ్రేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దళిత క్రైస్తవుల కృతజ్ఞతలు తెలుపుతూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగళ్ళ పోచయ్య మాట్లాడుతూ ఇంతకాలం దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకుగా మాత్రమే అన్ని పార్టీలు భావించాయని, కానీ నేడు టి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి రూ.12 కోట్లతో భవనాన్ని నిర్మించడం, 3 ఎకరాల భూమి పథకం వర్తింపచేయడం శుభపరిణామం అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని దళిత క్రైస్తవులకు వర్తింపచేయడం, చర్చి నిర్మాణంలో కలెక్టరు అనుమతికి బదులు మండల అధికారి, గ్రామ సర్పంచ్‌ల ద్వారా నిర్మించుకోవచ్చు అని, పాస్టర్‌లకు పెళ్ళిళ్ళు చేయడానికి అనుమతులివ్వడంపై ముఖ్యమంత్రిని కలిసి అభినందించారు. తెలంగాణ పార్లమెంట్‌ సభ్యుల ద్వారా దళిత క్రైస్తవుల బిల్లు పార్లమెంటులో పెట్టించి, చట్టబద్దత కల్పించినప్పుడు మాత్రమే దళిత క్రైస్తవులకు నిజమైన న్యాయం జరుగుతుందని అన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయపరమైన రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎం.వి.జాన్సన్‌, బిషప్‌ శామ్యూల్‌, కె.రూబెన్‌, కె.డానియెల్‌, ఎ.జైపాల్‌, బి.లోకాస్‌, విజయ్‌రెడ్డి, గజ్జెల నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు