జాతీయం

మతం పేరుతో చీలితే.. భారత్‌లో అభివృద్ధి అసాధ్యం

ఢిల్లీ : మూడు రోజుల పర్యటన ముగింపును అగ్రదేశాధినేత ఒబామా తనదైన శైలిలో ముగించారు. బి.జె.పి.నేతల హిందుత్వ వ్యాఖ్యలతో మోదీ సర్కారుపై పడిన మత ముద్రపై స్పందనా అన్నట్లుగా.. మత సామరస్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని అధికరణలతో సహా గుర్తు చేశారు. మత విశ్వాసాల పరంగా చీలిపోనంతవరకు భారత్‌ విజయం సాధిస్తూనే ఉంటుందంటూ సున్నితంగా చురకలంటించారు. దాంతో, అమెరికా అధ్యకక్షుడు ఒబామా, భారత ప్రధాని మోదీల మధ్య కుదిరిన కెమిస్ట్రీ.. మోదీ సర్కారుకు చివరకు చేదునే మిగిల్చింది. ఢిల్లీలోని సిరిఫోర్ట్‌ ఆడిటోరియంలో మంగళవారం ఒబామా ఎంపిక చేసిన 1500 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని మతాలూ ఒకే తోటలో విరిసిన కుసుమాలు.. ఒకే అద్భుత వృక్షానికి చెందిన వేర్వేరు శాఖలు అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. మతోన్మాదం దేశాభివృద్ధికి చేటు చేస్తుందని, నచ్చిన మతాన్ని అనుసరించే, కోరుకున్న విశ్వాసాన్ని ఆరాధించే హక్కు ప్రజలందరికీ ఉందని ఒబామా తేల్చి చెప్పారు. భారత్‌, అమెరికాల సారూప్యతలను, ఉజ్వలభరితం కానున్న ఇరుదేశాల సంబంధాలను, భారత్‌లోని నారీశక్తిని, యువత సామర్థ్యాన్ని, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా భారత్‌ పోషించాల్సిన పాత్రపై స్ఫూర్తిదాయక దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ఒత్తిడి, భయం, వివక్ష లేకుండా నచ్చిన మతవిశ్వాసాలను అనుసరించే హక్కు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఈ ప్రాథమిక హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ప్రభుత్వం పైనా, ప్రతీ పౌరుడి పైనా ఉంది. తమ మత విశ్వాసమే గొప్పదనుకునేవారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మత హింస, మతపరమైన అసహనం, మత ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మతపరమైన విభజన రేఖలు గీచి, మనల్ని విడదీయాలనుకునే వారి అన్ని ప్రయత్నాలను అడ్డుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్యాలైన మన రెండు దేశాలు కలిసికట్టుగా సాగితే.. ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మన రెండు దేశాలు మరింత అభివృద్ధి చెందుతాయి. చదువుకున్న మహిళల పిల్లలకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. అందువల్ల ప్రగతి దిశగా ముందుకెళ్లాలనుకుంటున్న అన్ని దేశాలు.. జనాభాలో సగమైన మహిళల శక్తి సామర్థ్యాలను విస్మరించరాదు. వైవిధ్యత వల్లనే వంటవాడి మనవడినైన నేను అమెరికా అధ్యకక్షుడినయ్యాను. టీ అమ్మిన మోదీ భారత ప్రధానయ్యారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు