ప్రకృతి కన్నెర్ర చేసింది

ఇస్లామాబాద్/కరాచీ : ఇటీవల ఒక చర్చిలో ఉగ్రవాద దాడితో రక్తమోడిన పాకిస్థాన్‌పై తాజాగా ప్రకృతి కన్నెర్ర చేసింది. బెలూచిస్థాన్ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం పాకిస్థాన్‌లోని సంభవించిన భూకంపంలో మరణించినవారి సంఖ్య బుధవారంనాటికి 217కు చేరింది. పాక్-ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతం బెలుచిస్థాన్‌లో మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భారీ భూకాంపం సంభవించింది. తీవ్రత ఎక్కువగా ఉండడం వల్లా అనేక ఇళ్లు, షాపులు కుప్పకూలిపోవడంతో వాటి కింద చిక్కుకోని అనేక మంది మరణించారు. ఇంకా సిధిలాలకింద ఎందరో చిక్కుకుపోవడంతో ప్రభుత్వం సైనిక ధళాలను రంగంలోకి దింపి సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఈ ధుర్ఘటనలో దాదాపు 350 మంది గాయపడినట్లు సమాచారం. వీరికి ప్రభుత్వం మౌళిక సధుపాయాలు ఏర్పాటు చేసి ఆహారాన్ని అందజేస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. బెలూచిస్థాన్‌లోని అవారన్ జిల్లాలో ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లు భూకంప పునర్నిర్మాణ, పునరావాస సంస్థ (ఈఆర్ఆర్ఏ) అధికారి బ్రిగ్ వాజిత్ అక్తర్ తెలిపారు. ఈ ప్రకృతి విపత్తులో చిన్నారులు, మహిళలతో సహా పలువురు గాయపడ్డారని, వారికి ఖుజ్దార్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

భూకంపం దాటికి అవారన్, ఖుజ్దార్ జిల్లాల్లో మట్టితో కట్టిన అనేక ఇళ్లు కుప్పకూలాయి. పరిసర ప్రాంతాలైన కరాచీ, హైదరాబాద్, తట్టా, ఖైర్‌పూర్, లార్కానా ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు వచ్చాయి. లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చినట్లు వార్తలొచ్చాయి. సుమారు నిమిషం పాటు వచ్చిన ఈ ప్రకంపనలతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. అవారన్‌లో పరిస్థితిపై సమీక్షించిన బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి అబ్దుల్ మాలిక్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో సహాయ చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. 300 మంది సైనికులను, సహాయ, వైద్య బృందాలను, ఒక హెలికాప్టర్‌ను ఘటనా స్థలికి పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కరాచీ, బెలూచిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన భూకంపంలోనూ 40 మందికిపైగా మరణించారు. తాజా వీడియోలు 
తాజా వార్తలు