జాతీయం

వెల్లువలా విదేశీ విరాళాలు

- సింహభాగం క్రైస్తవ మిషనరీలకే - స్వచ్ఛంద సంస్థలకు విరాళాలపై సుప్రీంలో పిటిషన్‌- తెలంగాణకు సుప్రీం నోటీసులు - సిబిఐకి ఎన్‌జివొ ల లెక్కలు చెప్పాలని ఆదేశంన్యూఢిల్లీ : ప్రతి ఏటా విదేశాల నుంచి విరాళాల రూపంలో భారత్‌కు భారీగా నిధులు వస్తుంటాయి. వీటిలో 90 శాతానికి పైగా క్రైస్తవ మిషనరీలకే వెళ్తుండటం గమనార్హం. విదేశాల నుంచి అధిక మొత్తంలో నిధులు పొందుతున్న రాష్ట్రాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో ఉండేది. క్రైస్తవ మిషనరీలు, స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న విరాళాలు, ఆయా సంస్థలు పాటించాల్సిన నిబంధనలపై శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటులో పలువురు సభ్యులు ప్రశ్నించగా, కేంద్ర హోం శాఖ ఈ మేరకు సమాచారాన్ని అందించింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.100,82,09,53,640 (100 బిలియన్లు పైగా), 2012-13 ఆర్థిక సంవత్సరంలో రూ.95,49,32,53,954 (95 బిలియన్లు పైగా), 2013-14 ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ 15వ తేదీ వరకు రూ.31,66,59,76,705 (31 బిలియన్లు పైగా) భారత్‌కు వచ్చాయి. ప్రతి ఏటా దాదాపు 160కి పైగా దేశాలకు చెందిన సంస్థలు, వ్యక్తులు ఈ నిధులను వివిధ రాష్ట్రాల్లోని స్వచ్ఛంద సంస్థలకు పంపిస్తున్నారు. ఇలా విదేశాల నుంచి వస్తున్న నిధుల వివరాలను స్వచ్ఛంద సంస్థలు హోం శాఖకు వెల్లడించాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనల ప్రకారం విదేశీ విరాళాల వివరాలు అందించని 1441 సంస్థలకు హోం శాఖ నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థలకు విరాళాల వివరాలను పరిశీలించామని, అక్రమాలు గుర్తిస్తే సిబిఐ లేదా రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపిస్తున్నామని హోం శాఖ తెలిపింది. విదేశాల నుంచి వస్తున్న విరాళాల్లో 95 శాతానికి పైగా నిధులు క్రైస్తవ మిషనరీలకు వెళుతున్నాయి. 2010-11 నుంచి 2012-13 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని క్రైస్తవ మిషనరీలకు అందిన విరాళాల్లో 95 శాతానికి పైగా నిధులు విదేశాల నుంచి వచ్చినవే. ఎపిలోని 2,728 క్రైస్తవ సంస్థలకు విదేశాల నుంచి 2010-11లో రూ.11,83,65,19,189 (11 బిలియన్లు పైగా), 2011-12లో 2531 సంస్థలకు రూ.12,58,52,26,171 నిధులు, 2012-13లో 2012 క్రైస్తవ సంస్థలకు రూ.11,57,86,53,444లు అందాయి. విదేశీ నిధులు పొందుతున్న రాష్ట్రాల్లో 2012-13 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలోను, అంతకు ముందు ఢిల్లీ, తమిళనాడుల తర్వాత మూడో స్థానంలోను ఉంది. దేశంలో ఎక్కువ నిధులు పొందుతున్న క్రైస్తవ సంస్థల్లో అనంతపురానికి చెందిన రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ మూడో స్థానంలో ఉంది. ఈ సంస్థకు 2012-13 సంవత్సరంలో రూ.190 కోట్లకు పైగానే నిధులు విదేశాల నుంచి వచ్చాయి. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఎన్‌జివొల అంశంపై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థలు తమ ఆదాయ, ఖర్చుల వివరాలు సమర్పించాయా? లేదా? అనే విషయం సిబిఐకి ఎందుకు తెలియజేయలేదో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దత్తుతో కూడిన ధర్మాసనం సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్నా హజారే నాయకత్వంలోని 'హింద్‌ స్వరాజ్‌ ట్రస్ట్‌'తో సహా దేశంలోని కొన్ని ఎన్‌జీవోలు నిధులు దుర్వినియోగం చేస్తున్నాయని 2011లో ఎంఎల్‌ శర్మ అనే లాయర్‌, సుప్రీంకోర్టులో ఒక పిల్‌ దాఖలు చేశారు. దాంతో ఆయా ప్రాంతాల్లో నమోదైన ఎన్‌జివొ సంస్థల, ఆదాయ లెక్కల వివరాలు సేకరించి ఆ వివరాలను సిబిఐకి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. (జనవరి 6వ తేదీన ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన న్యూస్‌)


 తాజా వీడియోలు 
తాజా వార్తలు