రాష్ట్రీయం

ఈ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం,క్రైస్తవ మైనారిటీ హక్కులకే తీవ్ర విఘాతం..

రాష్ట్రంలోని చర్చిలు, క్రైస్తవ మైనారిటీ ఆస్తుల పరిరక్షణ పేరిట ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వివిధ క్రైస్తవ శాఖలు, చర్చి సంస్థలన్నింటికీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏపి ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని, క్రైస్తవ మైనారిటీ హక్కులకే తీవ్ర విఘాతమని, వెంటనే చర్చి ఆస్తుల చట్టం ప్రతిపాదనను విరమించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ప్రధానకార్యదర్శి డాక్టర్ పి.సూర్యప్రకాష్, ఆర్చిబిషప్ ఆఫ్ హైదరాబాద్ తుమ్మాబాల, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీలు డాక్టర్ ఆంథోనిరాజ్ తుమ్మా, బి.దానం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం రామంతాపూర్‌లోని సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇది చర్చిలు, క్రైస్తవ శాఖల ప్రతిపాదన కాదని, కేవలం కొందరి స్వార్ధ ప్రయోజనాలకోసం దీన్ని లేవనెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిరక్షణ పేరుతో చర్చి ఆస్తులను తమ గుప్పెట్లను తీసుకోవాలనుకుంటున్న కొందరు తమ చేతుల్లోకి చర్చి ఆస్తులను వెళ్లకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని, తాము అడగని దానిని తమపై రుద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించడం తగదన్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం ఇదే చట్టాన్ని తీసుకురావాలని చేసిన ప్రయత్నాన్ని క్రైస్తవ సంఘం, ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల మానుకుందని గుర్తుచేశారు. ఎక్కడో కొన్ని చోట్ల జరిగిన అవాంఛనీయ సంఘటనలను సాకుగా తీసుకుని క్రైస్తవ సంఘం మొత్తంపై చట్టం ద్వారా కట్టడి చేయాలనుకోవడం అర్ధరహితమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల క్రైస్తవ శాఖల స్వేచ్ఛనే హరించడం అవుతుందని, సొంత ఆస్తులు స్వయంగా నిర్వహించుకునే వారి ప్రాధమిక హక్కులకే విరుద్ధంగా మారే ప్రమాదం ఉందన్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు