జాతీయం

అమ్మ లేదు... అమ్మ ప్రేమ ఉంది!

జపాన్‌ : బిడ్డపై తల్లికి ఉండే మమకారానికి ప్రత్యక్ష నిదర్శనమిది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉద్వేగభరితమైన సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఒకరి నుంచి ఒకరికి, వందలు వేలుగా, వేలు లక్షలుగా చేరుతోంది.

ఈ ఏడాది మార్చిలో జపాన్‌లో తీవ్రమైన భూకంపం సంభవించింది. రక్షక బృందాలు శిధిలాలను తొలగిస్తున్నప్పుడు మట్టి పెళ్లల మధ్య ఒక మహిళ కనిపించింది! ఆమె బ్రతికి ఉండవచ్చుననే ఆశతో వారు కొన్ని గంటలపాటు కష్టపడి జాగ్రత్తగా ఆమె దేహాన్ని వెలికి తీయగలిగాయి కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంది. ఆమె చేతుల మధ్య, గుండెకు ఆన్చుకుని ఒక దుప్పటి ఉంది. దాన్ని పట్టించుకోకుండా ఆ మృతదేహాన్ని అలాగే వదిలేసి మరో ఇంటి శిధిలాలను శోధించడానికి వీరు అక్కడ నుంచి ముందుకు కదిలారు. అయితే వారి మనసులను ఏదో సందేహం వెనక్కి పట్టి లాగింది. వెంటనే తిరిగి వచ్చి, ఆమె చేతులను విడదీసి దుప్పటిని మెల్లిగా తెరిచి చూసారు. అందులో.... ఓ బిడ్డ! మూణ్నెళ్ళ వయసున్న ముక్కుపచ్చలారని పసిబిడ్డ, ప్రాణం లేని తల్లి దేహం ఆసరాగా ప్రాణం నిలుపుకున్న బిడ్డ నిశ్చింతగా నిద్రపోతోంది. సమాచారం అందుకుని హుటాహుటిన అక్కడికి వచ్చిన వైద్యుడు ఆ పసికందును పరీక్షించి ఎక్కడా గాయాలు లేవని, ప్రాణాపాయం లేదని తేల్చడంతో అక్కడి వారంతా సంతోషంతో నిట్టూర్చారు. అదే సమయంలో దుప్పటి పొరల్లో కనిపించిన సెల్‌ఫోన్‌పై వారి దృష్టి పడింది. దాన్ని తీసి చూశారు. అందులో ఒక సంక్షిప్త సందేశం ! 'కన్నా... నువ్వు బతుకుతావు. అంతేకాదు బ్రతికినన్నాళ్ళూ ఈ అమ్మకి నువ్వంటే ఎంతిష్టమో గుర్తుంచుకుంటావు'..... అంటూ బిడ్డకు వీడ్కోలు ఇస్తున్నట్లుగా ఆ తల్లి ఇచ్చిన సందేశం.... అక్కడి రాళ్ళను కూడా కరిగించేంత హృద్యంగా ఉంది. రెస్క్యూటీమ్‌ సభ్యులు కంట తడి పెట్టారు. అమ్మ ఏ లోకాన ఉన్నా బిడ్డల క్షేమమే కోరుకుంటుంది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు