జాతీయం

అమ్మాయికి మిస్డ్‌కాల్‌ ఇచ్చారో....

బీహార్‌ : మహిళలకో, టీనేజీ అమ్మాయిలకో ఏ మగాడైనా దురుద్దేశంతో తన మొబైల్‌ నుంచి మిస్డ్‌కాల్‌ ఇస్తే ఇక అతగాని పని అయిపోయినట్టే.. బీహార్‌ పోలీసులు వాళ్ళమీద కేసు పెట్టి జైలుకు పంపుతారు. ఐపిసిలోని 354-బి సెక్షన్‌ ప్రకారం.. తనకు అందిన మిస్డ్‌కాల్‌ గురించి ఏ అమ్మాయి అయినా పోలీసులకు ఫిర్యాదు చేసిన పక్షంలో ఆ కాల్‌ ఇచ్చిన వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయవచ్చునని బీహార్‌ సిఐడి ఐజి అరవింద్‌ పాండే తెలిపారు. ఇందులో రెండు అంశాలున్నాయి. కాల్‌ చేసిన వ్యక్తి పురుషుడై ఉండాలి.. దురుద్దేశంతో మిస్డ్‌కాల్‌ ఇచ్చాడని తేలాలి అని ఆయన వివరించారు. ఈ కాల్‌ గురించి తమ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులందరికీ సర్క్యులర్‌ పంపామన్నారు. మేల్‌ కాలర్స్‌ నుంచి ఇలాంటి కాల్స్‌ వస్తే తమను రక్షించడానికి చట్టం ఉందనే విషయాన్ని యువతులు మరచి పోరాదన్నారు. మహిళలపై నేరాలను అదుపు చేయడానికి సంబంధించిన చట్టాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీసు బృందాలు చైతన్య శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఉమెన్స్‌ హాస్టళ్ళలో చాలామంది టీనేజర్లు ఇతర జిల్లాలకు చెందినవారు చేరుతుంటారు. హఠాత్తుగా తమ కుటుంబ సభ్యుల నుంచి తమకు స్వేచ్ఛ లభించిందన్న ఉత్సాహంలో వాళ్ళు తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడుతుంటారు అని పోలీసులు అంటున్నారు.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు