జాతీయం

క్రీస్తుని విశ్వసిస్తాం, క్రైస్తవ మతాన్ని అనుసరించం

ముంబై : మత ధ్రువీకరణ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఒత్తిడికి గురి చేయరాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వం సేకరించే సమాచారం, గుర్తింపు పత్రాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల్లో మతం అంశాన్ని తప్పనిసరి చేయొద్దని నిర్దేశించింది. మనది ప్రజాస్వామిక, లౌకిక దేశం. ఇక్కడ పుట్టినవారు మతాన్ని ప్రకటించుకోవడం తప్పనిసరి కాదు. మత ధ్రువీకరణను నిరాకరించే హక్కు, మతావలంబనను బహిరంగంగా తిరస్కరించే అధికారం ప్రతి పౌరుడికీ ఉంది అని జస్టిస్‌ అభయ్‌ వోకా, జస్టిస్‌ ఎఎస్‌ చందోర్కర్‌ల బెంచ్‌ వ్యాఖ్యానించింది. తమని 'మత రహిత శ్రేణి'గా పరిగణించాలంటూ 'గోస్పల్‌ చర్చి'కి చెందిన ముగ్గురు ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్‌ తీవ్రంగా స్పందించింది. స్వీయ వైఖరిని కలిగి ఉండే హక్కును తన పౌరులకు రాజ్యం ఇచ్చిందంటూ రాజ్యంగంలోని 25వ నిబంధనని బెంచ్‌ ఉటంకించింది. అంతేకాదు, తాము అవలంబిస్తున్న మతాన్ని ఏ కారణంతోనైనా పౌరులు త్యజించి.. ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకోవచ్చునని కూడా తెలిపింది. తమను 'మత రహిత శ్రేణి'గా గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని రంజిత్‌ మోహితే, కిశోర్‌ నజారే, సుభాష్‌ రణ్‌వాలే అనే ముగ్గురి వినతిని మహారాష్ట్ర ముద్రణ విభాగం తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం నుంచీ అదే సమాధానం వచ్చింది. దీనిపై పిటిషనర్లు బాంబే హైకోర్టుని ఆశ్రయించారు. మేం 'గోస్పల్‌ చర్చి ఆఫ్‌ గాడ్‌' సంబంధికులం. ఈ సంఘంలో నాలుగువేలమంది సభ్యులు ఉన్నారు. పేరుని బట్టి ఇదేదో క్రైస్తవ మత సంఘంలా కనిపిస్తుందిగానీ, మేం యేసుక్రీస్తుని విశ్వసిస్తాం. కానీ క్రైస్తవ మతాన్ని అనుసరించం. మేం ఏ మతానికి చెందం. ఈ విషయాన్ని ప్రకటించుకునే హక్కుని రాజ్యాంగం మాకు కల్పించింది' అని వారు వాదించగా, బెంచ్‌ సానుకూలంగా స్పందించింది.


 తాజా వీడియోలు 
తాజా వార్తలు