యవ్వనస్తులుPost Date:2015-01-16//No:40

పౌరుషంతో ప్రసంగంఅవిభాజ్య సోవియట్‌ రష్యా సామ్రాజ్యమును కమ్యూనిస్టు శక్తులు శాపిస్తున్న చీకటి కాలములో నిజమైన క్రైస్తవుల రక్తాన్ని వరదవలె పారబోశారు. నామకార్ధ క్రైస్తవ సంఘాలకు మాత్రమే కమ్యూనిస్ట్‌ సమాజంలో స్థానముండేది. ఒకసారి కమ్యూనిస్టు ప్రభుత్వం రష్యాలోని క్రైస్తవ శాఖలన్నిటికి ఒక ఐక్యసభ ఏర్పాటు చేశారు. ఆయా డినామినేషన్‌లకు, శాఖలకు చెందిన 4000 మంది పాస్టర్లు, బిషప్‌లు అందులో పాల్గొన్నారు. ఈ 4000 మంది మత నాయకులు 'జోసఫ్‌ స్టాన్లీ'ని గౌరవించాలని, అతను అక్కడ లేకపోయినా అతనిని సభాధ్యకక్షుడిగా నియమించారు. జోసఫ్‌ స్టానీ దేవుడు లేడని చెప్పే ప్రపంచ క్రైస్తవ నాస్థికా సంఘానికి అధ్యకక్షుడు, వేలాదిమంది క్రైస్తవులను హతమార్చిన నరహంతకుడు. తాడు తెగిన బిషప్‌లు, పాస్టర్లు లేచి 'కమ్యూనిజం, క్రైస్తవ్యం ఈ రెండు సిద్ధాంతములు కలిసి ముందుకు సాగవచ్చని తప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు. ఆ రష్యా జాతీయ పాస్టర్స్‌ కాన్ఫరెన్సులో ఉన్న 'రిచర్డ్స్‌ ఉర్మ్‌ బ్రాండ్‌' భార్య తన భర్తతో 'రిచర్డ్స్‌, క్రీస్తు మీదకు వస్తున్న ఈ అవమానం తుడిచి వేయడానికి లేచి నిలువు, వీళ్ళు క్రీస్తు ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు' అన్నది. ఉర్మ్‌ బ్రాండ్‌ తన భార్యతో 'ఇప్పుడు లేచి మాట్లాడితే నీవు నీ భర్తను కోల్పోవలసి ఉంటుంది' అన్నాడు. అందుకామె 'నా భర్త పిరికివాడుగా వుండటం కంటే క్రీస్తు కొరకు నిలబడినందున లేకుండుటయే మేలు అన్నది' అంతే రిచర్డ్స్‌ ఉర్మ్‌ బ్రాండ్‌ లేచి నిలబడి క్రీస్తే ఈ లోక సమస్యలకు సమాధానం, క్రీస్తు తప్ప లోకానికి వేరే గతి లేదని ఎలుగెత్తి పౌరుషంతో ప్రసంగించాడు. ఆ దినమున కమ్యూనిస్ట్‌ పార్లమెంటు నుండి ఆయన చేసిన సాహసోపేతమైన సందేశం రేడియో ద్వారా రష్యాదేశం అంతా విన్నారు. కమ్యూనిస్టులు రిచర్డ్స్‌ను నిర్బంధంలోనికి తీసుకున్నారు. 3 సం||లు ఏకాకిగా ఒక చెరసాలలో బంధించి ప్రతిరోజు చిత్రహింసలు పెట్టారు. ఆ తరువాత అతను మిగిలిన రహస్య క్రైస్తవులతో పాటు 11 సం||లు నరకవేదనలు ఆ చెరసాలలో అనుభవించాడు. తన 14 సం||ల చెరసాల హింసలు గురించి ఉర్మ్‌ బ్రాండ్‌ చెప్పే మాటలు 'నా శరీరములో గాయంలేని స్థలం ఏమి లేదు, నా మూడు ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. ఆరు ఎముకలు ఫ్రాక్చర్‌ అయ్యాయి, శరీరంలో మూడు పెద్ద రంధ్రాలు, చిన్న రంధ్రాలకు లెక్కలేదు.'

క్రొత్త చిత్ర హింసలు : ప్రియులారా! కమ్యూనిస్ట్‌ సైనికులు చెరసాలలో రహస్య క్రైస్తవులను పెట్టని చిత్రహింస ఏది లేదు. అదివారం తమ మూత్రము, పెంట రెండు పాత్రలలో పోసి 'ఇవి మీ క్రీస్తు శరీరము, రక్తము తిని త్రాగండి అని తిని త్రాగే వరకు అతి భయంకరంగా హింసించేవారు. ఏ క్రొత్త రకమైన చిత్రహింస కనిపెట్టినా అది మొదట క్రైస్తవుల మీదే ప్రయోగించేవారు. ఉర్మ్‌ బ్రాండ్‌ భార్య కూడా ఆ రోజు నుండి టార్గెట్‌ చేయబడి, చెరసాలలో బంధింపబడి చిత్రహింసలు అనుభవించినది. తల్లిదండ్రులు ఇద్దరూ క్రీస్తు కొరకు జైలు పాలు కావడంతో ఉర్మ్‌బ్రాండ్‌ ఒకే బిడ్డ అనాధగా రష్యా రోడ్లపై పెరగాల్సి వచ్చింది. 'మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనవాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట వానిని ఒప్పుకుంటాను' మత్తయి 10:32 అన్న క్రీస్తు మాటలకై, దేవుడే లేడనే ముసుగులో, సిద్ధాంతములో నరకాగ్నిగి వెళ్తున్న రష్యా ప్రజలందరికి 'క్రీస్తే పరలోకానికి మార్గం' అంటూ రిచర్డ్స్‌ చేసిన ఒక ప్రసంగానికి ఆయన 14 సం||లు ప్రతిరోజు రక్తం కార్చవలసి వచ్చింది. 14 సం|| చెరసాల తరువాత జైలు నుండి విడుదలైన రిచర్డ్స్‌... రష్యాలో ఆత్మలకై, సేవకై పరితపిస్తూ 2001 సం|| ఫిబ్రవరి 17వ తారీఖున ప్రభువు యొక్క సన్నిధానమునకు చేరాడు. రష్యాలో రిచర్డ్స్‌, భార్య వంటి సమర్పణ గలిగిన విశ్వాసురాళ్ళను కమ్యూనిస్ట్‌, సైనికులు పెట్టే హింసలలో మానభంగం అన్నది మొదటిమెట్టు మాత్రమే. రష్యాలో నిజమైన క్రైస్తవుల రక్తాన్ని, శరీరం కృశించిపోతున్న పంటి బిగువునా బాధభరిస్తూ వారు కార్చిన కన్నీటిని, రక్తాన్ని చూసిన దేవుడు కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఆ దేశంలో నుండి 1992 సం||లో పునాదులతో సహా పెకిలించి వేశాడు. ఒకప్పటి అవిభాజ్యపు సోవియట్‌ రష్యా నేడు చిన్న రాజ్యాలుగా, దేశాలుగా చీలిపోయి ఆ దేశాలన్నీ ఇప్పుడు సువార్తతో నింపబడుతున్నాయి. ఒకప్పుడు 'దేవుడు లేడు' అని చెప్పే ఆ ప్రజలు ఈరోజు ఆకలితో దేవుని వాక్యాన్ని వింటూ దేవుని శక్తిని అనుభవిస్తున్నారు.

నా ప్రియమైన సహోదరీ! సహోదరులారా! రష్యా రహస్య క్రైస్తవులు, రిచర్డ్స్‌, ఎదుర్కొన్న శ్రమలు నీవెదుర్కోవలసి వస్తే క్రీస్తు కొరకు నిలబడతావా? పిరికి పందలా పారిపోతావా? ఒక్కసారి ఆలోచించు... అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు 1 థెస్స 3:4

- పాస్టర్‌ పి.పాల్‌రాజ్‌ 
పౌరుషంతో