యవ్వనస్తులుPost Date:2013-10-04//No:4

కోపము ,అసూయ ,గర్వం ,సోమరితనముకోపం అనేది పసిపిల్ల మొదలుకొని వృద్ధుని వరకు అందరు కలిగియుండే సహజ లక్షణం. కోపం ఆత్మీయ అభివృద్ధికి చాలా పెద్ద ఆటంకమే ఎందుకనగా ముంగోపి అధిక దుష్క్రియలు చేయును. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనుకొనే వ్యక్తి సత్క్రియలు చేస్తాడు. ముక్కు మీద కోపం గలిగిన విశ్వాసి యొక్క తలంపులు దుష్టమైనవిగా ఉంటాయి మరియు అతని క్రియలు కూడా కీడు కల్పించేవిగా ఉంటాయి. అందుకే కోపము మానుము. ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసనపడకుము. అది కీడునకే కారణము. ఒకవేళ సరిదిద్దే క్రమంలో కోపపడవలసి వస్తే కోపపడుడి కాని పాపం చేయకుడి. మీ కోపం సూర్యుడు అస్థమించు వరకు నిలిచియుండకూడదు.
            ఆది తల్లితండ్రులైన ఆదాము హవ్వలు యొక్క కుమారులు:కయీను మరియు హేబెలు. కయీను భూమిని సేద్యపరుచువాడు. హేబెలు గొర్రెల కాపరి. కొంతకాలమైన తరువాత కయీను పొలపుపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడ తన మందలో తొలిచూలున పుట్టినవాటిలో క్రొవ్వినవాటిని కొన్ని తెచ్చెను. దేవుడు మనము తెచ్చే అర్పణల కంటే మన హృదయాలను అధికంగా లక్ష్యపెడతాడు. మన హృదయాలు ఆయన మాటలను లక్ష్యం చేయకుండ దుష్టంగా ప్రవర్తించినంతకాలం మన అర్పణలు ఆయనకు ఆమోదయోగ్యమైనవి కావు. అందుకే కాబోలు దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్యపెట్టలేదు; హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు.
            కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనును చూచి- నీకు ఆగ్రహమేల? ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి? నీవు సత్క్రియ చేసినయెడల సంతోషముగా నుందువు గదా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని యేలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతని చంపెను.కయీను తాను చేసినది యెవ్వరు (తన తల్లిదండ్రులు) చూడలేదులే అని అనుకొనియుండవచ్చును. కాని తాను చేసిన పనిని దేవుడు చూశాడు. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయన అన్నిటిని యెరిగనవాడై యున్నాడు. కాబట్టి యెహోవా- నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు- నేనెరుగను; నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. దుష్టుడు మరియు వాని సంబంధీకులందరు చేసిన అతిక్రమాలను ఒప్పుకొనరు సరికదా మతి భ్రమించిన సమాధానాలు చెబుతారు. అప్పుడాయన- నీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తముయొక్క స్వరము నేలలొనుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు; నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకియ్యదు; నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అయ్యో! కయీను కోపంతో చేసిన పని అతను భరించలేనంత శిక్షకు దారితీసినది.
            దీనినిబట్టి చూస్తే ప్రియపాఠకా! మనము కోపము విడిచిపెట్టుట మన ఆత్మీయ జీవితాలకు ఉత్తమం. లేకపోతే మనకు దేవునికి మధ్య సంబంధం నశించిపోగలదు. ఒకవేళ కోపపడవలసి వస్తే అది అర్ధవంతముగా ఉంటూ ఇతరులను బాగుచేయగలిగెదిగా ఉంటే ఎంతో శ్రేయస్కరం.

అసూయ అనగా ఎదుటి వ్యక్తి యొక్క గొప్ప స్థితిని చూసి ఓర్చుకొనలేకపోవుట.ఎదుటి వ్యక్తి యొక్క గొప్ప స్థితికి మనం కూడా చేరాలనుకొని మంచి ప్రయత్నం చేయటంలొ తప్పు లేదు కాని ఆ వ్యక్తి మీద అసూయతో బురద జల్లుట మరియు ఆ స్థితి నుండి పడగొట్టాలని ప్రయత్నించుట మనలను ఆత్మీయంగా గొప్ప స్థితికి తీసుకొని వెళ్ళదు కాని ఆత్మీయంగా దిగజారుస్తుంది.
            బాలుడైన దావీదు దేవుని యందలి విశ్వాసమును ఆధారము చేసుకొని ఆజానుబాహుడైన గొల్యాతును జయించి ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలో నుండి తంబురలతోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు -"" సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు (శత్రువులను) హతముచేసిరనిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని- వారు దావీదుకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప ఎమి అతడు తీసికొనగలడు అనుకొనెను. కాబట్టి నాటనుండి సౌలు (దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి) దావీదుమీద విషపుచూపు (అసూయకు ప్రారంభం) నిలిపెను(1సమూ 18:6-9). ఆ తరువాత అవకాశం చిక్కినప్పుడెల్ల దావీదును చంపుటకు (అసూయ విచక్షణను కోల్పోయేలా చేసి ఏ పనైన చేయిస్తుంది) ప్రయత్నించాడు. దేవుడు చూస్తూ ఊరుకొంటాడా? దావీదుకు రాజ్యమును అప్పగించి సౌలును యుద్ధములొ శత్రువుల చేతికి అప్పగించాడు. అసూయ కలిగి ప్రవర్తించుట వలన సౌలు తన ఆత్మీయ జీవితాన్ని తానే చేతులారా నాశనం చెసికొన్నాడు.
            దీనిని బట్టి చూస్తే ప్రియ పాఠకా!అసూయ అనేది కేన్సర్ వంటిదని స్పష్టమగుచున్నది.కాబట్టి మనకు ఏ వ్యక్తి మీద అసూయ కలుగుచున్నదో ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మన హృదయములను దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకొంటూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకనగా అసూయ అనేది ఎదుటి వ్యక్తి కంటే అసూయ కలిగియున్న వ్యక్తినే నాశనం చేస్తుంది.

కోపము
గర్వము : ప్రతి పని చేయుటకు సామర్ద్యము మరియు ఙ్ఞానము ఇచ్చినది దేవుడే. కార్యము పూర్తి కాగానే ఆయనను మరచి తనని తాను గొప్ప చేసుకొంటూ (మనసులో మరియు బయట) ప్రవర్తించే విధానమే గర్వాన్ని సూచిస్తున్నది. ఈ గర్వము ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఒకప్పుడు దేవుని స్తుతించి మనసున గర్వించినందుకు లూసిఫర్ అనే దేవదూత తన పరలోకపు స్థానాన్ని కొల్పోలేదా. భూమి మీదకు త్రోయబడి అనగా తాను నాశనమైనదే కాకుండా, భవిష్యత్తులొ తాను ఉండబోయే నరకంలోకి అనేకులు వచ్చునట్లు వారి వారి జీవితాలను నాశనం చేయట్లేదా.
            దేవుని నివాసమగు ఆలయములో ఉన్న ఉపకరణములు దేవుని పని నిమిత్తమే వాడబడాలి. బెల్షస్సరు అనే రాజు తన అధిపతులకు, తన రాణులకు మరియు తన ఉపపత్నులకు విందు యేర్పాటు చేశాడు. తన అధికార బలంతో గర్వించి దేవుని నివాసమగు ఆలయములో ఉన్న ఉపకరణములను తెప్పించి వాటిలొ ద్రాక్షారసం పోయించి త్రాగాడు. గర్వం ఎదుటి వ్యక్తి యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయునంతగా కన్నులకు గ్రుడ్డితనం కలుగ చేస్తుంది కాబోలు. బెల్షస్సరు యొక్క గర్వం ఫలితంగా అతడు ఆ రోజు రాత్రే హతుడయ్యాడు (దానియేలు 5వ అధ్యాయం).
            దీనిని బట్టి చూస్తే ప్రియ పాఠకా!గర్వమనేది దేవునితో మనకు గల సంబంధానికి పెద్ద ఆటంకముగా కనబడుతున్నది. కాబట్టి ఇప్పుడు మనమున్న స్థితిని బట్టి దేవుని స్తుతిద్దాం. మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినను గర్వపడక మనల్ని మనం తగ్గించుకొంటూ మన స్థితికి కారణమైన దేవునిని హెచ్చిద్దాం. తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును.

సోమరితనం అనగా చేయవలసిన పనిని చేయకుండా వాయిదా వేయటం లేక మధ్యలోనే ఆపివేయటం. చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే, ఇంకా కొంచెంసేపు కునుకు తీద్దాం వంటి భావనలు సోమరితనాన్ని సూచిస్తున్నాయి. ప్రతి విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో అనుదినం చేయవలసినవి: ప్రార్ధన చేయుట (క్రీస్తుతో మాట్లాడుట), బైబిల్ చదివి దేవుని మాటలను తన జీవితానికి అన్వయించుకొనుట (క్రీస్తు మాటలు ఆచరించుట) మరియు తాను ఘనపరుస్తూ క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయుట. ఒక విశ్వాసి ఇవేమి చేయకుండా వేరే పనులలో నిమగ్నమై ఉన్నా లేక వీటిని ఆసక్తిగా కాక ఒకవేళ మ్రొక్కుబడిగా చేసినా తన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడనే లేక శక్తిలేని భక్తి చేస్తున్నాడనే చెప్పాలి.   
       యుద్ధము జరుగుచున్నప్పుడు రాజు యుద్ధమునకు వెళ్ళాలి.యుద్ధమునకు వెళ్ళవలసిన దావీదు వెళ్ళకుండ బద్ధకించి తన మిద్దె మీద నుండి స్నానం చేస్తున్న ఊరియా భార్య అయిన బత్షెబని చూసి, ఆమెని పిలిపించి, ఆమెతో శయనించాడు. అంత మాత్రమే కాదు, ఊరియా కొట్టబడి హతమగునట్లు యుద్ధము మోపుగా జరుగుచున్నచోట అతనిని ఉంచమని యోవాబుకి ఉత్తరం వ్రాశాడు. తన పధకం ప్రకారం ఊరియా హతమవ్వగానే అతని భార్యని తన భార్యగ చేసుకొన్నాడు. తన అత్మీయ జీవితంలొ ఒక మచ్చ తెచ్చుకొన్నాడు. దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు(2సమూ 11వ అధ్యాయం).      
      దీనిని బట్టి చూస్తే ప్రియ పాఠకా! ఒకవేళ ఈ సోమరితనమనే ఆటంకం వచ్చిందని గుర్తించినట్లయితే వాక్యపు వెలుగులో సరిచేసుకొని క్రీస్తుకి మొదటి ప్రాధాన్యత ఇవ్వటం ఉత్తమం మరియు మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుట ఆశీర్వాదకరం.

Pradeep Kumar