యవ్వనస్తులుPost Date:2014-10-04//No:35

గడచిన తరుణంసబ్‌ కలెక్టర్‌ రవిచంద్రగారి కూతురు మాలిని ఉజ్జీవ కూటాలలో పాల్గొనటం అదే ప్రధమం. మాలినికిగాని, ఆమె యింటిలోని వారికిగాని, దేవుడన్నా, ఈ ఉజ్జీవకూటాలన్నా, పెద్ద చెప్పుకోతగ్గ శ్రద్ధ ఏమీలేదు. అయినా లెక్కకు మించిన కార్యక్రమాలు వారివి. ఊర్లో ఏ బహిరంగ సభ జరిగినా, లేక నృత్య సంగీత ప్రదర్శనలు, సినిమా శతదిన మహోత్సవాలు, సినీతారల సన్మానాలు, విందులు వినోదాలు, ఏం జరిగినా యింటివారంతా రవిచంద్రగారితోపాటు, హాజరయ్యేవారు. ఊర్లోవుండే ప్రముఖ వ్యక్తులంతా అక్కడ తటస్థపడుతుంటారు. కావలసినంత కాలక్షేపం. యిప్పుడు ఈ ఉజ్జీవ కూటాలు, తమ ఇంటి ముందున్న ఖాళీస్థలంలో జరుగుతున్నాయ్‌. రోజూ వేలాది ప్రజలొచ్చి వింటున్నారు. 'ఇంత మందిని ఇలా ఆకర్షించే ఆ దైవిక శక్తి ఎట్టిదో? చూద్దాం!' అని. ఏదో కుతూహలం కొద్ది బయలుదేరింది మాలిని. తాటాకులతో వేసిన పెద్ద పందిరిక్రింద ఈత చాపలు పర్చుకొని స్త్రీలు పురుషులు బారులు తీరి కూర్చునియున్నారు. క్రింద కూర్చోటం తనకలవాటు లేదు ఐనా ఎలాగోలాగ ఒక స్తంభాన్ని ఆనుకొని కూర్చొంది.

ఆనాటి దైవపాఠం మార్కు సువార్త 5:25-34 లోనిది. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడిన ఒక స్త్రీ, చివరకు క్రీస్తును గూర్చివిని, ఆయన వస్త్రపు చెంగును ముడితే స్వస్థత దొరుకుతుందని విశ్వసించి, వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టి, స్వస్థపడింది. యితరుల కంటికి మరుగైన ఆమె వ్యాధి, దాని తీవ్రత, క్రీస్తునందు ఆమెకున్న ఆ దృఢ విశ్వాసం వల్ల ఆ వ్యాధి నుండి విముక్తి పొందింది. ఈ సంఘటనను ఆ దైవసేవకుడు రసవత్తరంగ వర్ణిస్తూ ప్రసంగిస్తున్నాడు. అంతా మంత్రముగ్ధులై నిశ్శబ్దంగా వింటున్నారు.

'ఆ స్త్రీ కన్నా ఘోరమైన స్థితిలో నీవు లేవా?' ఉన్నట్టుండి ఆయన తన చేయిచాచి చూపుడు వ్రేళ్ళను తన వైపే చూపుతూ తీవ్రంగా అంటున్నాడు.

'నువ్వు దొంగవు' అన్నాడతను. మాలిని ఒక్కసారి అదిరిపడింది. తానొకసారి అమ్మ కనుక్కోదులే అని సొరుగునుండి ఒక పది రూపాయలు తీసుకొని తన స్నేహితులతో సినిమాకు వెళ్ళింది. అది అమ్మకు తెలియనేలేదు గాని ఈయనకెలా తెలిసింది చెప్మా?

'ప్రేమ అనే పవిత్రమైన మాటతో నీవు మోహపు లేఖలు వ్రాస్తున్నావు'. మళ్లీ గద్దించినట్టు అన్నాడతను. మాలిని నుదుట చెమటపట్టింది. గొంతు తడి ఆరిపోయింది. ఎవరెవరు వింటున్నారో అని గుండె దడదడ లాడింది. ఔను - వారం రోజుల క్రితమే మోహన్‌కొక ప్రేమ లేఖ వ్రాసింది 'కొంపదీసి మోహన్‌ ఈ కూటమునకు రాలేదుకదా!' బెదురు చూపులతో వెనుకకు తిగిరి అటు ఇటు చూసింది. మోహన్‌ రానేవచ్చాడు. ఏదో తీవ్రంగ ఆలోచిస్తు తనవైపే చూస్తున్నాడు. భయంతోను సిగ్గుతోను మాలిని ముఖం క్రిందకు వాలింది. బోధకుడు చెప్తున్న బోధను మరచి కొంతసేపు తన ఆలోచనలు మోహన్‌ చుట్టు తిరిగాయి.

ఆ రోజు తను మోహన్‌తో కలిసి క్రిస్టిన్‌కెల్లి నృత్యం చూడ్డానికి రిట్స్‌ హోటల్‌కు వెళ్లింది. అక్కడ ఉన్న వాతావరణం తన్ను మైమరపింపచేసింది. అందరు జంటలు జంటలుగా ఆంగ్లేయ నృత్యం చేస్తుంటే తను మోహన్‌తో కలిసి రెండడుగులు వేసింది. అతను తన నడుంచుట్టు చేతులు వేసాడు. తాను అతని చెయ్యి పట్టుకొని చిలిపిగా అతని కళ్ళల్లోకి చూస్తు నిలబడిపోయింది.

'ఛీ! ఛీ! ఈ దైవ సన్నిధిలో కూడ తాను పాడు ఆలోచనలను ఆలోచిస్తుంది. తనేమీ ఆ బోధకుడు చెప్పింది వినటంలేదు. ఏం చెప్తున్నాడతను?' ఈ సారి బోధకుడు చెప్తున్న మాటలతో మాలినికి మూర్ఛ వచ్చినంత పని అయింది. 'అపవిత్ర స్థలాలకు వెళ్ళటంచేత నీ కాళ్లు, చెడుచూపులచేత నీ కళ్ళు, దుష్ట తలంపులతో నీ నడినెత్తి పాడైపోయాయి. ఇక నీ వ్యాధిని దాచిపెట్టడానికి ప్రయత్నించకు. ప్రయత్నిస్తే అది అధికమౌతుంది. నీవు స్వస్థత పొందగోరితే ప్రభువు దగ్గరకు రా. మాలిని హృదయం చిగురుటాకులా కంపిస్తున్నది. తానెవ్వరికి తెలియదనుకొని చేసిన కార్యాల్ని, తలంచిన తలంపుల్ని, ఈయన వేదిక ఎక్కి చాటిస్తున్నాడు. దైవికశక్తి అంటే ఇదే కాబోలు. తాను చేసిన పాపాలు ఒక్కటొక్కటే తన కళ్ళెదుట కదలిపోతున్నాయ్‌. తన హృదయంలో పెను తుఫాను చెలరేగింది. ఎంత బలవంతంగా ఆపుకోవాలన్నా ఆగకుండ కళ్ళనుండి కన్నీరు ప్రవహిస్తోంది. ఆ పెద్ద గుంపులో ఇంకా చాలామంది తన పరిస్థితిలోనే ఉన్నారు.

'నీ పాప వ్యాధి నుండి విముక్తి పొందాలనుకుంటున్నావా? పశ్చాత్తాపంతో నీ పాపాల్ని ఒప్పుకొని విశ్వాసంతో క్రీస్తు యొద్దకు రా. పాపుల్ని వెదకి రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనొక్కడే నీ పాపాల్ని క్షమించడానికి అధికారం గలవాడు' అని నిదానంగా గంభీరంగా పలుకుతున్నాడా బోధకుడు. ఉండుండి ఏడ్పులు, నిట్టూర్పులు వినవస్తున్నాయి. ఎవ్వరెవ్వరి హృదయాల్ని ఆ పరిశుధ్ధాత్మ తాకిందో వారొక్కరొక్కరే లేచి ముందుకు వెళ్ళుతున్నారు. మాలిని ఇంట్లో పనిచేసే తోటమాలి భీమేశు, అతని భార్య నీలాలు, వంట మనిషి రత్తి, రెవెన్యు ఇన్‌స్పెక్టర్‌ మనోహరంగారు వీరంతా ఆ గుంపులోనే ఉన్నారు.

'ఎవ్వరైతేనేం? దేవుని సన్నిధిలో అంతా ఒక్కటే. తానీనాడు తన పాత జీవితానికి స్వస్థి చెప్పేస్తుంది. ముందుకు పోయి వారితో నిలబడి యేసు ప్రభువును తన రక్షకుడుగా బహిరంగంగా స్వీకరిస్తుంది' మాలిని దిగ్గున లేచి ఒక్కడుగు ముందుకు వేసింది. అంతలోనే, 'ఏ మాలినీ, ఆగు' అని ఎవ్వరో అధికారం వెళ్ళగ్రక్కే కంఠంతో అరుస్తుంటే స్థాణువులా ఆగిపోయింది. బలమైన చేయొకటి ఆమె బాహువుల మీద పడి ఆమెను వెనుకకు నెట్టింది. మాలిని విస్తుపోయి వెనక్కు తిరిగి చూచింది. తన నూరు కేజీల దేహం కోపంతో ఊగిపోతుంటే కలెక్టర్‌ రవిచంద్రగారు మాలిని చెయ్యి పుచ్చుకొని బైటికి బరబర ఈడ్చుకొని వచ్చారు. మతి పోయిన దానిలాగ మాలిని మౌనంగా తండ్రిని వెంబడించింది. దారిలో ఎవ్వరూ మాట్లాడలేదు. ఇంటికి చేరిన వెంటనే రవిచంద్రగారు కూతురివైపు తీక్షణంగా చూస్తు, 'నువ్వేమీ పళ్ళూడిన ముసలిదానివి కావు. ఇంకొకసారి ఏడుస్తు, ఆ రత్తి, నీలా
గడచిన