యవ్వనస్తులుPost Date:2014-09-12//No:32

యౌవ్వన జ్వాలయౌవన విశ్వాసీ... జవాబు నీకే తెలుసు  ప్రియమైన యౌవన తమ్ముడు మరియు చెల్లి! క్రొత్తగా జన్మించిన బిడ్డ తన తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది. బిడ్డను పెంచడము ఒక పెద్ద సవాలే. అయినా తల్లిదండ్రులు దానిని గూర్చి అంతగా చిరాకుపడరు. ఎంతో సమయాన్ని తమ చంటి బిడ్డతో వారు గడుపుతారు.

తమ బిడ్డను గూర్చి వారు ఎంతో అతిశయ పడుతూవుంటారు. చిన్న వాని చిలిపి చేష్టలతో మురిసిపోతూ వుంటారు. అయితే ఆ బిడ్డ ఎదిగే కొలది, వారి ఆనందము క్రమేపి చిరాకుగా, చివరకు దుఃఖముగా మారి పోతుంది.

చిన్ననాటి యందు తమ తల్లి దండ్రుల ఆనందానికి కారణమైన బిడ్డలు, ఎదిగేకొలది వారి దుఃఖానికి కారణమై పోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులైతే, వారిని దుఃఖపరచే తమ బిడ్డలు చనిపోయినా మేలు, పీడ విరగడైపోతుందని అంటూ వుంటారు. అంటే, తమ బిడ్డలు వారిని ఎంతగా విసికించియుంటారో ఊహించండి.

మన తల్లిదండ్రులు మనకొరకు చేసిన మేళ్ళకి బదులు వారికి ఆనందాన్ని తప్ప మరేమి ఇవ్వగలము? బైబిలు సెలవిస్తుంది. 'నీ తల్లి దండ్రులను నీవు సంతోష పెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనంద పరచవలెను.' సామెతలు 23:25. ఓ యౌవనస్తుడా, యౌవనస్తురాలా! మరి నిన్ను కన్న వారికి నీవు ఆనందంగా యున్నావా లేక దుఃఖంగా యున్నావా? దీనికి జవాబు నీకే తెలుసు.

నీకు కేవలము ఉపయోగపడని ఒక నిర్జీవమైన వస్తువైతే, నీ తల్లిదండ్రులు నిన్ను చెత్త తొట్టిలో పారవేస్తారు, లేకపోతే ఎవరికైనా ఇచ్చివేస్తారు. కానీ, నీవు వారి రక్తమాంసములను పంచుకొని, నీ తల్లి ప్రసవ వేదనలో నీవు జన్మించావు గదా! మరి నిన్ను ఎట్లు పారవేయగలరు? లేక ఎట్లు ఇచ్చివేయగలరు?

నిన్ను వారు కని, సహించి, భరించి, కాచి, పెంచి, పెద్ద చేశారు. కాని ఇప్పుడైతే క్రీస్తు లేని నీ జీవితమును (స్వభావమును) చూచి వారు కక్కలేక మ్రింగలేక యున్నారా?

ప్రియ యౌవన సహోదరా, సహోదరీ! కన్నవారు ఎవరైనా తమ బిడ్డ నిష్ప్రయోజనముగా యుంటే చూచి ఆనందించగలరా? కన్న బిడ్డ చదవకుండా షికారులు తిరిగితే వారు ఆనందిస్తారా? వారు నీ తప్పును సరిదిద్దితే నీవు వారిపై మండి పడితే వారికి ఆనందమా? నీవు చెడ్డ స్నేహితులతో వీధులలో తిరుగుతూ వుంటే వారు ఆనందిస్తారా?

నీవు చెడ్డ సినిమాలు చూస్తూ, చెడ్డ పుస్తకాలు చదువుతూ, చెడ్డ మాటలాడితే వారు ఆనందిస్తారా? నీవు సిగరెట్టు, సారాయి, గంజాయి, పాన్‌పరాగ్‌, గుట్కా లేక వ్యభిచారములాంటి దురలవాట్లకు బానిసగా వుంటే వారు ఆనందించ గలరా? నీకు మంచి చెడు చెబితే 'నీవెవరవు నాకు చెప్పడానికి?' అని నీ కన్న తల్లిదండ్రులకు ఎదురు పలికితే వారు ఆనందించగలరా?

నీవు వారి ఇష్టానికి లొంగినదాని కంటె వారు నీ ఇష్టమునకు ఎన్ని మారులు దిగి వచ్చి వుంటారు? ఎన్ని మారులు నీవు వెళ్ళి 'అమ్మా! నాన్నా!, నన్ను క్షమించండి' అని చెప్పకుండ గర్వముతో, అహముతో వూగుతు వారితో మాటలాడకపోయినా వారే నీ యొద్దకు వచ్చి, నిన్ను పిలిచి, భోజనము పెట్టి, నిన్ను చేర్చుకొన్నారు? నీ సారీ కొరకు వారు ఎదురు చూడలేదే! నాన్న లోపలకు వస్తే కుమారుడు బయటికి వెళ్తాడు. నాన్న బయటికి వెళ్తే, కుమారుడు లోపలకు వస్తాడు. 'అమ్మా! నాన్నను నాతో పెట్టుకోవద్దని చెప్పు' అని నీవంటే, నీ తల్లి నిన్ను సమాధాన పరుస్తుంది. కుమార్తెకు తల్లంటే పడదు. అమ్మ ఓల్డ్‌ ఫ్యాషన్‌, పిల్లలు ఎంత గొప్పవాళ్ళయ్యారో!

  నీవు వారిని అవమాన పరచి, అగౌరవపరచినా, నీ బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు, క్రిస్ట్‌మస్‌ మరియు ఈస్టర్‌ పండుగలకు క్రొత్త బట్టలు కొనిచ్చారు. ఇంట్లో డబ్బు లేక పోయినా నీ ఎక్స్‌కర్షన్‌ కు డబ్బు కట్టి పాకెట్‌ మని ఇచ్చారు.

వారి వృద్ధాప్యమందు నీవు వారిని చూస్తావని వారు నిన్ను ఇంతవరకు పెంచలేదు.

పసితనములో నీ మలమూత్రములను తీసి, నిన్ను శుభ్రపరిచారు. మరివారి వృద్ధాప్యమందు వారు పడక పడితే, వారికి బెడ్‌పేన్‌ పెట్టడము నీకు అసహ్యమౌతుందా? బాత్‌ రూమ్‌లో నీళ్ళు సరిగ కొట్టకపోతే వారిని తిడతావు.

వృద్ధాప్యమందు వారు నీకు భయపడుతూ, వణికిపోతున్నారు. నీ హోదా గొప్పదా? ... నీ పదవి గొప్పదా? నీ పదవి పెద్దదయ్యే వారితో మాట్లాడటం మానివేశావా? మరి నీ చిన్నతనములో నీ నాన్న ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు నీవు నిద్రపోలేదే?

వారి వృద్ధాప్యమందు వారి మాటలు నీకు విసుకుపుట్టి 'చెప్పినదే పదే పదే చెప్పకు అమ్మా- నాన్న' అని అంటావే. మరి నీ చిన్న వయస్సులో నీ కబుర్లను వినకుండా వారి నీ నోరు మూయలేదే?

నీవు వారి వృద్ధాప్యమందు వారిని చూసుకోలేక నీవు నీ తోబుట్టువులు వంతులు వేసుకున్నారా? చివరకు వారిని వృద్ధులశరణాలయంలో వేస్తావని వారికి నీ చిన్న వయస్సులో తెలుసా?

ఎప్పుడైనా నీ తల్లిని ముద్దుపెట్టుకున్నావా? నీ తండ్రిని ఎప్పుడైనా కౌగలించుకున్నావా?

వారు కోరేది నీవు బాగా చదవాలనే కదా! అది నీకు మేలు. వారు కోరేదంతా నీవు మంచి అలవాట్లు, మర్యాదలు కలిగి ఉండాలనే కదా! అవి నీ విలువను పెంచుతాయి.

వారు కోరేదంతా నీవు బైబిలు చదివి, ప్రార్ధన చేసి, కుటుంబ ప్రార్ధనలో కూర్చోవాలని మరియు చర్చికి రావాలనేగదా! అవి నీ ఆత్మ రక్షణ మరియు నిత్య జీవము కొరకే కదా?

కష్టపడి చదువు. నమ్మకంగా ఉద్యోగం చేయి.

  దేవుని చిత్తమును నెరవేర్చు - నీ కన్నవారికి ఆనందాన్నివ్వు.

జ్ఞాపకము తెచ్చుకో! 'జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును. బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును'.సామె 10:1

ఇదే నీ పట్ల దేవుని చిత్తము.

చివరి మాట: తమ్ముడూ! చెల్లీ!... భవిష్యత్తులో నీకు కూడ ఒక కుటుంబము కల్గుతుంది. చరిత్ర పునరావృతమౌతుంది జాగ్రత్త... నీ తల్లిదండ్రులకు నీవేమిచ్చావో నీ బిడ్డలు కూడ నీకు అదే తిరిగి ఇస్తారు.

యువకుని ప్రార్ధన

యేసు ప్రభువా, నా తల్లి దండ్రులకు, పెద్దలకు నేను ఆనందాన్నివ్వలేదని మీ కృపగల సింహాసనము ముందు ఒప్పుకొనుచున్నాను. వారికి సంతోషాన్నివ్వాలని, మీకు మహిమకరంగా వుండ
యౌవ్వన