యవ్వనస్తులుPost Date:2014-08-01//No:25

యవ్వన జ్వాల ఎల్లో రిబ్బన్‌రైలు వేగంగా పరుగెడుతోంది తన ఎదురుగా కూర్చుని లోలోపల ఏడుస్తున్న ఓ నిండు యవ్వనుని తదేకంగా చూసారు ఓ పాదిరిగారు. ఉండబట్టలేక అడిగేసారు. ఏమి నాయనా ఎందుకేడుస్తున్నావ్‌? అయ్యా అడిగారు కాబట్టి నా కథ చెబుతాను వింటారా? చెప్పు అంటు ప్రక్కన కూర్చున్నారు పాదిరిగారు.

సార్‌ పది సంవత్సరాల క్రితం మా అమ్మనాన్నలకు చెప్పకుండా యింటిలో నుంచి పారిపోయాను, ఎక్కడెక్కడ తిరిగానో, ఏం తిన్నానో తలంచుకుంటే అది ఓ నరకం. ఈ మధ్య అమ్మ మీద బెంగపడ్డాను. ప్రతిరాత్రి కలలో అమ్మే కన్పిస్తుంది నిద్దట్లో ఏడ్చేస్తున్నాను. అందుచేత ఈ మధ్య మా అమ్మకో ఉత్తరం వ్రాసాను. అమ్మా నీమీద బెంగ తిరిగింది రావాలని నిన్ను చూడాలని ఉంది, ఫలానరోజు, ఫలాన ట్రైన్‌లో బయలుదేరుతున్నాను. రైలు మన యింటి మీదుగ ఉన్న పట్టాలపై వెళ్తుంది. మనయింటి పెరట్లో ఓ చిన్న దానిమ్మ చెట్టు ఉండేది కదా ఈ పాటికది కాయలుకాచి ఉంటుంది. మీరు నన్ను క్షమించి ప్రేమిస్తున్నారనే దానికి గురుతుగా ఓ దానిమ్మ కాయకు ఒక పసుపు రిబ్బను కట్టండి దానిని చూచి వెంటనే స్టేషనులో దిగి యింటికి వచ్చేస్తాను. పసుపు రిబ్బను కనబడకపోతే, అమ్మా జీవితంలో నుంచే దిగిపోతాను అని వ్రాసానండి. పాదిరిగారు అడ్డుపడి మరి భయమెందుకయ్యా తప్పక మీఅమ్మ రిబ్బను కట్టి ఉంటుంది. లేదు సార్‌ మానాయన చాలా కోపిష్టి. మా అమ్మ మంచిదే గాని మా అమ్మ రిబ్బను కట్టమని బ్రతిమిలాడి ఉంటుంది గాని మా నాయన కట్టడండి అంటూ ఏడ్వడం ఆరంభించాడు అబ్బాయి. అతని తలనిమిరి బాబు ఏడ్వకు నీవు కూర్చో నేను చూస్తాను అంటూ సముదాయించి ఆయన కిటికీలో నుంచి చూడ్డం మొదలెట్టారు.

దాదాపు రైలు ఆ అబ్బాయి యింటికి చేరువకు వచ్చేసింది. ఒక్కసారిగా గట్టిగా అరిచారు పాదిరిగారు నాయనా చూడవయ్యా పసుపురంగు రిబ్బను కట్టాడయ్యా దానిమ్మ కాయకు మీ తండ్రి అనగానే అమాంతంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగాడు ఆ అబ్బాయి భోరున ఏడ్చేశాడు వెంటనే, అర్ధం కాలేదు పాదిరిగారికి ఆ ఏడుపెందుకో అని.

అయ్యా చూడండి రైలు వేగంగా వెళ్తుంది గనుక దానిమ్మ కాయకు రిబ్బను కడితే వేగంగా వెళ్లే రైలులో నుండి నాకొడుకు చూడలేడనుకొని, చూడండి సార్‌ కాయ కాయకు ఎన్నో రిబ్బన్లు కట్టాడు మానాయన అంటూ మౌనంగా ఏడవడం కొనసాగించాడు ఆ అబ్బాయి. పాదిరిగారు కళ్లు చెమ్మగిల్లాయి. పాదిరిగారు కళ్లు తుడుచుకుంటుంటే ఆయన వైపు చూసి సార్‌ అంతే కాదండి వేగంగా వెళ్లే రైల్లో నుండి చూస్తున్నప్పుడు రిబ్బన్లు కనబడవేమోనని దానిమ్మ చెట్టు క్రింద నిల్చొని నా కొరకు ఎదురుచూస్తున్నారు నా తల్లిదండ్రులు అని చెప్పాడు.

ఈ కధలోని తండ్రి కంటే మించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి కధ ఆయన సిలువకు అద్దం పడుతుంది. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు దానిమ్మచెట్టుకు రిబ్బనులా కాదు, యేసుప్రభువే సిలువ మ్రానుకు తన్ను తాను అంటగొట్టబడి సిలువలో బలికాబడ్డాడు.

ఆ ప్రేమను మీరెరుగుదురా? ఎరిగితే ఆలస్యం దేనికి తక్షణమే ప్రయాణం కట్టండి. - రెవ.జి.ఎస్‌.వి.
యవ్వన