యవ్వనస్తులుPost Date:2014-07-25//No:24

యవ్వనజ్వాలయౌవనుడా! కాడిమోయి!

'యౌవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణాధారము కలుగునేమోయని, అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను.' (విలాపవాక్యములు 3:27-30)

ఒక మనుష్యుని జీవితములో యౌవన థ బహు అపాయకరమైనది. ఒక వ్యక్తి తన యౌవన కాలములో విచ్చలవిడిగా జీవించినచో, దాని ప్రతిఫలాన్ని వాని బ్రతుకంతా అనుభవించును. యౌవన కాలములో కాడి మోయుట నరునికి మేలని దేవుని వాక్యము సెలవిస్తున్నది. నేడనేకమంది యౌవనస్థులు కాడికి అలవాటుపడని కోడెదూడవలె తిరుగుబాటు చేయుచున్నారు (యిర్మీయా 31:18). యౌవన థలో పెద్దలకు లోబడుట, బాధ్యతలు తీసుకొనుట, కష్టపడి పనిచేయుట వంటి కార్యములకు అనేకులు ఇష్టపడుట లేదు.

ఒక కోడెదూడ చిన్నప్పటి నుండి గంతులు వేయుచు తన ఇష్టానుసారముగా ఎదిగిన తరువాత యుక్త వయస్సులో దాని యజమాని దానికి కాడి కట్టి, పొలము దున్నుటకో, బండి లాగుటకో ఉపయోగించినపుడు; ఆ కోడె భారమును మోయుటకు ఇష్టము లేక తిరుగబడినట్లే, ఈనాటి యౌవనస్థులు ఉన్నారు. ఒక వ్యక్తి తన యౌవనాన్ని దేవుని చేతులకు అప్పగించి లోబడినప్పుడు అతని ద్వారా గొప్ప కార్యములు జరుగును. జార్జిముల్లర్‌ అను ఒక యౌవనస్థుడు తన 18వ ఏట దేవుని కాడి క్రిందకు వచ్చినందున, అతడు అనేకవేల అనాధలకు తండ్రిగాను, అనేకవేల ఆత్మలను రక్షించు ఆత్మల జాలరిగాను దేవునిచేత వాడబడెను.

యౌవన థలో మనకు బలము, జ్ఞానము, ఆరోగ్యము వంటి అన్ని విధములైన ఆశీర్వాదములు సమృద్ధిగా ఉండును. అయితే, నీవు వాటిని విచ్చలవిడిగా వాడినచో అవి త్వరలోనే ఖర్చయిపోయి, నీవు గొప్ప దరిద్రతలో మిగిలెదవు. కొన్ని సంవత్సరముల క్రితం గోదావరి నదిలోని విస్తారమైన నీరు వృధాగా సముద్రములో కలిసిపోవుట చూచిన కాటన్‌ దొర ఆ నదికి ఆనకట్ట కట్టించెను. ఆనకట్ట కట్టుట ద్వారా వృధా అయిపోవుచున్న ఆ నీటిని నిల్వచేసి, అనేకవేల ఎకరాల పొలమునకు ఆ నీటిని సరఫరా చేయుట ద్వారా ఈనాటికిని ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలంగా వర్ధిల్లి విస్తారమైన పంటలను యిచ్చుచున్నవి.

అలాగే ఈనాడు యౌవనకాలపు తెలివి, బలము లోకాశల కొరకు, పాపేచ్ఛల కొరకు వ్యర్ధమైపోకుండా; నీవు యేసుక్రీస్తుకు లోబడి, నీ బ్రతుకును కట్టుబాటులోనికి తెచ్చుకొన్న యెడల దేవుడు నీకిచ్చిన ఈవులను అనేక వేలమందికి ఆశీర్వాదకరముగా వాడుకోగలవు!

ఒక యౌవనస్థుడు ఒంటరిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి, ఆయన చెప్పు సంగతులు వినునట్లు మౌనముగా కూర్చుండుట నేర్చుకొనవలెను. బైబిలులో నూరంతలుగా దీవెన పొందిన ఇస్సాకు పొలములో ఒంటరిగా ధ్యానించుట నేర్చుకొనెను (ఆదికాండము 24:63). దేవునికి బహు ప్రియుడైన దానియేలు దినమునకు ముమ్మారు మేడగదిలో దేవునికి ప్రార్ధించుట నేర్చుకొనెను (దానియేలు 6:10).

యౌవనుడు నిరీక్షణాధారము కలుగునేమోయని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను (విలాప వాక్యములు 2:29,30). అంటే ఒక వ్యక్తి బూడిదెలో తన ముఖము పెట్టుకొంటే అతడు కదలకుండా, మెదలకుండా జాగ్రత్తగా ఉండవలెను. అతడు ఏ మాత్రము కదిలినా, మెదిలినా బూడిదే అతని నాసికా రంధ్రములలోనికి, నోటిలోనికి పోవును. అట్లే యౌవనుడు ఈ పాప లోకంలో బహు జాగ్రత్తగా తన హృదయశుద్ధిని కాపాడుకొనుచు ఉండవలెను.

అతడు తన్ను కొట్టువానికి చెంప త్రిప్పవలెను. ఇది యౌవన థలో బహు కష్టమైనప్పటికి, యౌవన థలో ఒక వ్యక్తి అణిగియుండుట, లోబడుట నేర్చుకొనినప్పుడు అతని జీవితము ఆశీర్వాదకరముగా ఉండును. మన ప్రభువైన యేసు ఈ లోకములో జీవించినపుడు తన యౌవన కాలమంతా అనగా ఇంచుమించు 30 సంవత్సరములు ఆయన తల్లిదండ్రులకు లోబడి, ఒక సామాన్య మానవుని వలె వడ్రంగి పనిచేస్తూ, తన్ను తాను దాచుకొని మనకు మాదిరిగా యుండెను. ఆ తరువాత ఆయన మూడున్నర సంవత్సరములలో చేసిన సేవ, సిలువయాగము అద్భుతమైనవి!

నా వ్యక్తిగత జీవితములో నేను నా 18వ ఏట ప్రభువుకు నా హృదయమిచ్చితిని. నాకు ముప్పది సంవత్సరములు వచ్చువరకు దేవుని బలిష్టమైన చేతుల క్రింద అణిగియుండి; బైబిలు స్కూలులోను, పరిచర్యలోను, మోకాళ్ళ ప్రార్ధనలోను నా జీవితమును గడిపితిని. ఆ తరువాత ప్రభువు నాకు అనేక వాగ్దానములను యిచ్చి, నన్ను సువార్త పనిలో ఉంచి ఆయన నామ మహిమార్ధమై వాడుకొనుచున్నాడు.

కాబట్టి ప్రియ సోదరుడా! సోదరీ! నీ యౌవన కాలాన్ని దేవునికి సమర్పించు! దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కుడవై యుండుము! - యన్‌.జయపాల్‌
యవ్వనజ్వాలయౌవనుడా!