యవ్వనస్తులుPost Date:2014-07-18//No:23

స్నేహితుల వత్తిడియవ్వనజ్వాల

 స్నేహితులతో లేక తమ తోటివారితో కలసి వారు చేసే పనులు, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు సేవించడం, అమ్మాయిలను ఏడిపించడం, వివాహానికి ముందు అవాంఛితమైన లైంగిక సంబంధాలను కలిగి ఉండటం సులభమే కాని, వాటిని ఏకాకిగా ప్రతిఘటించడం, వత్తిడిని తట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఎవరైనా ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తే తక్కిన వారందరు 'పరవాలేదు ప్రయత్నించు, నీవే ఇష్టపడతావు' అంటారు. దీనికి దాసోహం అయినప్పుడెల్లా దేవుడు మనలో పెట్టిన ప్రత్యేకతను కోల్పోతాం. కొంత కాలానికి ఆ పాపం పట్ల సున్నితత్వాన్ని కోల్పోయి, ఆ పనులు చేయటానికి కారణాలు హేతువుతో సహా వివరించటానికి ప్రయత్నిస్తాము.

'నీ మనస్సులోని ఒక స్వరం నీవెందుకు ఆ పాపం చేయటానికి పురోగమించావో కారణాలు వివరిస్తుంది', అదే శోధన అంటాడు ఓ భక్తుడు. మన విలక్షణతను, శీలతను పోగొట్టుకోవటమే కాదు, ఆత్మ గౌరవాన్ని సైతం కోల్పోతాం. దీని వలన అపరాధ భావనకు లోనయ్యి, దాన్నుండి తప్పించుకునే ప్రయత్నంలో అబద్ధాలు చెప్పటం జరుగుతుంది. ఈ ఒత్తిడి నుండి పారిపోవటానికి ఊసరవెల్లి వలె రంగులు మారుస్తారు.

అయితే ఈ ఒత్తిడి తట్టుకోవడం ఎలా? స్నేహితుల నుండి పారిపోవాలా? వారితోపాటు పోటీపడాలా? దానిలోనే కొనసాగాలా?

దీనికి సంబంధించి దేవుని వాక్యంలో మంచి మాటలున్నాయి. 'మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో, పరీక్షించి తెలిసికొని.... రూపాంతరము పొందుడి' (రోమా 12:2).

స్నేహితుల ప్రభావం, విలువలు, ఇష్టాలకు అనుగుణంగా కాక దేవునికిష్టమైన రీతిలో ఈ ప్రభావాన్ని మనం అయిదు విధాలుగా ప్రతి ఘటించవచ్చు.

(1) ఆశించు : క్రీస్తును కలిగిన జీవితం పూలగుచ్చాలమయం అనేది యువతరం మదిలో ఉన్న అపోహ. ఈ లోకంలో జీవించేంత వరకు ప్రతి వ్యక్తి ఏదో రూపంలో ఒత్తిడి ఎదుర్కోవడం సహజం. సమస్యల నుండి ఎవరమూ తప్పించుకోలేం. 'లోకంలో మీకు శ్రమ కలుగును' అని క్రీస్తే స్వయంగా శిష్యులతో చెప్పాడు. 'నేను లోకమును జయించియున్నాను' అని మీరు సంతోషించడం కూడా చెప్పాడాయన (యోహాను 16:33).

(2) వత్తిడిని ఎదుర్కో : దీని కేంద్రం మన మనస్సే. మన మీద మన అభిప్రాయాలు, శోధనలకు, వాటి ప్రభావానికి లోనవ్వాలనే ఆలోచన అన్నీ మనస్సులోనే ప్రారంభమవుతాయి. కాబట్టి ప్రతిఘటించటానికి సైతం మనస్సునే వాడాలి. స్నేహితుల ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే నిజంగా 'ఇది నాకు అవసరమా?' అనే ప్రశ్న తరచుగా వేసుకోవాలి.

మంచి స్నేహితులుంటే ఇలా ఎదుర్కొనడం అంత కష్టం కాదు. స్నేహితుల నుండి మంచి ప్రభావం కూడా మనకు కలుగుతుంది. కలిసి కట్టుగా దీనిని ఎదిరించగలం. వాస్తవానికి మనిషి స్వశక్తితో దీనిని అధిగమించలేడు. దీనికి దేవుని సహాయం అత్యవసరం. 'దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు' (1 కొరింథీ 10:13). ఆయనెప్పుడూ సిద్ధమే. ఎదుర్కోవటానికి నీకు ఇష్టం ఉందా? అనేదే ప్రశ్న.

(3) ప్రతిచర్య చూపు : శోధనను కొన్నిసార్లు మెరుగైనవాటితో భర్తీ చేయటం ద్వారా కూడా జయించగలం. మన జీవితాన్ని దుర్భరంగా చేసిన వారిపట్ల కోపంతో రగిలిపోతాం. అయితే వారి తప్పుల్ని ఎంచి, మన బలహీనతను గుర్తు చేసుకొని కృశించిపోయే బదులు 'మన ఆలోచనలు సత్యమైన, మంచివైన, మాన్యమైన వాటి మీద ఉంచటం ఎంతైనా క్షేమకరం (ఫిలిప్పీ 4:8). అపొస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పుడు కోపం, ద్వేషం, చెడు ఆలోచనలు ఆలోచించే అవకాశం ఎంతైనా ఉంది. కాని అతడెప్పుడూ పాజిటివ్‌ దృక్పధాన్నే వ్యక్తం చేశాడు.

(4) తప్పించుకో : మన స్నేహితుల్లో ఎవరైతే మనల్ని శోధనలకు ప్రేరేపిస్తున్నారో వారినుండి తప్పించుకోవటం ఎంతైనా శ్రేయస్కరం. వారున్న ప్రదేశాలకు వెళ్ళకూడదు. పరిస్థితుల నుండి తప్పించుకోవాలి. కొంతమంది ప్రత్యేకమైన ఇబ్బందులు కల్పించి పాపానికి పురిగొల్పుతారు. అటువంటి వారి సాన్నిహిత్యాన్ని తెంచివేయాలి.

(5) ఒప్పుకో : అనేకసార్లు అది తప్పని తెలిసి కూడా చేస్తాం. అటువంటి చర్యలకు నిష్కృతి ఉందా? ప్రభువులో తప్పక ఉంది.

'మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును (1 యోహాను 1:7).- మంజులా లాజరస్‌
స్నేహితుల