యవ్వనస్తులుPost Date:2014-06-20//No:19

యవ్వన జ్వాలఅమ్మ మాట'ఎందుకని తన ప్రవర్తన ఇంత ఘోరంగా మారిపోతుంది. చెప్పిన మాట వినడం లేదు. అసలు పట్టించుకోదుగా! ఏమిటి? ఏమి బాగోలేదు? దానికి సమాప్తమెక్కడ?'

పేపర్‌ చదువుతూ మరో ప్రపంచంలోనున్న తండ్రితో, లిల్లీ తల్లి ఏకరువు పెట్టింది, కానీ ఆయన ఎక్కడున్నాడో?

లిల్లీ కాలేజీ నుండి వచ్చి చాలాసేపయ్యింది. ఇందిరతో ఒక గంటసేపుగా బాతాఖానీ పెట్టింది. ఇప్పుడల్లా వారి ముచ్చట ముగిసేల లేదు, విచ్చలవిడిగా నవ్వే అల్లరి నవ్వు వింటుంటే తల్లికి వళ్లు మండిపోతుంది.

'అంతటికి మీరే కారణం చిన్న పిల్ల, ఆడపిల్ల అని మరి ముద్దు చేస్తున్నారు'.

'పాపం చిన్నపిల్ల, తన ఫ్రెండ్‌తో, ఆడపిల్లతో మాట్లాడుతోంది, దానికెందుకు అంత విసుగు'.

తండ్రి మాటలు మరీ వేడెక్కించాయి. పుండుపై కారం చల్లినట్లుంది.

'మీరలా ముద్దు చేస్తూ వుండండి. ఖండించకండి. ఆడపిల్లలతో మాట్లాడ్డం తప్పు లేదు సరే! కాలేజినుండి వచ్చి ఎంత సేపయ్యింది. ఎంతసేపు ముచ్చట్లు! కొంచెంసేపు బైబిలు చదివితే ఎంత బాగుంటుంది! అదే నేను చెప్పేది'.

లిల్లీ తల్లి తనలో తానే గొణుగుకొంటూ డైనింగ్‌ టేబుల్‌ మీద భోజనం పెట్టింది. ఫోన్‌ పెట్టేశాక లిల్లీ కనిపెట్టింది అమ్మ నాన్నకు ఫిర్యాదులు చేస్తుందని.

'లిల్లీ అయ్యిందమ్మా? ఇంకా సంగీతతో మాట్లాడలేదా?' తల్లి మాటలు రెచ్చగొట్టాయి.

'ఏంటమ్మా! అంత కోపం! ఏం తప్పు చేశానని! మా క్లాస్‌కు వచ్చి చూడు, చాలామంది అమ్మాయిలు సెల్‌ఫోన్లు పెట్టుకొని వాళ్ళ బాయ్‌ఫ్రెండ్స్‌తో ముచ్చటాడుతున్నారు. నాకు సెల్‌ఫోన్‌ లేదట, నా ఫ్రెండ్సందరూ ఎగతాళి చేస్తున్నారు, ముసలి దాన్నట అందరూ అంటున్నారు.

'లిల్లీ వారెలా వుంటే ఏమిటమ్మా? నువ్వు అందరిలా వుండకూడదమ్మా? నువ్వు తప్పు చేశావనడం లేదు, స్నేహానికి, వారితో ముచ్చటకు ఒక హద్దుంది. స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకొనే ఆ సమయంలో దేవుని స్మరించు. నీకు దీవెన కలుగుతుంది'.

అమ్మ మాటలు లిల్లీని మరీ బాధించాయి. తల్లి మాటను ఖాతరు చెయ్యలేదు.

పరీక్షలయ్యాయి, అందరికీ ఒకటే ప్రశ్న. వారు ఇంకా చదవాలా? లేదా పెళ్ళి చేసికొని స్థిరపడాలా? ఏదైనా ఉద్యోగం చేసుకోవాలా? ఇందిర ప్లాన్‌ ఏమంటే ఉద్యోగం చెయ్యాలనే, అంతకుముందు ఢిల్లీ వెళ్లి అంకుల్‌ ఇంట్లో కంప్యూటర్‌ కోర్స్‌లో చేరాలని.

'నాకేమి తోచడం లేదు. ఏమి చెయ్యాలో ఏమిటో?' సందేహంగా చెబుతోంది లిల్లీ. లిల్లీ మాటల్లో విషయానికి ప్రాధాన్యత కనబడలేదు. తన ధ్యాస ఒక్కటే. రెండు నెలలు ఇందిర సహవాసం లేకుండా ఎలా? ఇందిర వుంటే షాపింగ్‌, పార్క్‌లు అంటూ తిరగవచ్చు. కానీ ఇందిర ఆ విషయాలు పట్టించుకోకపోయేసరికి ఎంతగానో నిరుత్సాహపడింది.

'ఇందిర నువ్వు లేకుండా నాకు చాలా కష్టం.'

'లిల్లీ ఏమి చెయ్యమంటావు? నా భవిష్యత్‌ నేను చూచుకోవాలిగా రెండు నెలలయ్యాక అప్పుడు చూద్దాం.'

ఆ మాటలు లిల్లీని మరీ కృంగదీశాయి.

'ఇందిర నీకు సెల్‌ఫోన్‌ వుందికదా! నాతో మాట్లాడు ప్లీజ్‌.'

'నాకు టైం వుంటే మాట్లాడ్తా, సరేనా.'

రెండు వారాలు గడిచిపోయాయి. ఒక్కసారి కూడా ఫోన్‌ చెయ్యలేదు. లిల్లీ రెండుసార్లు ఫోన్‌ చేసినా మామూలుగా ఫోన్‌ మాట్లాడి ఫోన్‌ పెట్టేసింది.

ఇందిర ఇంక రెండు వారాల్లో వస్తుందనగా, లిల్లీ ఒకరోజు మెట్లుమీద నుండి జారిపడి కాలు విరిగింది.

ఇందిర వచ్చి నాతో మాట్లాడితే ఎంత బాగుండు, లిల్లీ మనసు ఉవ్విళ్లూరుతోంది.

ఇందిర ఢిల్లీ నుండి వచ్చింది కానీ ఏ సమాచారం తెలీలేదు, మూడోరోజున ఫోన్‌ చేసింది.

'లిల్లీ, ఎలా వున్నావు?'

'నీకు శుభవార్త, సింగ్‌పూర్‌లో ఉద్యోగం వచ్చింది, పాస్‌పోర్ట్‌ కూడా సిద్ధంగా వున్నాయి.' ఇందిర మాటల్లో ఉత్సాహం తెలుస్తుంది.

'ఏంటి నీర్సంగా వున్నావు! నాకు ఉద్యోగం రావడం నీకిష్టం లేదా?'

'సంతోషంగా వుంది. వంట్లో నీర్సంగా వుంది, మెట్లమీదనుండి జారిపడి కాలు విరిగింది. ఇప్పుడు నడవలేను.'

'అలాగా, నేను బిజీగా వున్నాను, సింగపూర్‌ వెళ్లాలి కదా! వచ్చేవారం లోపు చాలా వస్తువులు కొనాలి, ఖాళీ వున్నపుడు వచ్చి చూస్తా, లేకపోతే లేదు.'

లిల్లీ ప్రత్యుత్తరం వినకుండానే ఇందిర ఫోన్‌ పెట్టేసింది. లిల్లీ కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. అప్పుడు అర్ధమైంది. తాను ప్రేమించినంతగా ఇందిర తనను ప్రేమించలేదు. ఇది స్నేహమేనా? నాకు వంట్లో బాగో లేకపోతే కనీసం 5 నిమిషాలు గడపలేదా? ఒక్కమాట ప్రేమగా మాట్లాడలేకపోయింది. మనిషి ప్రేమ అంతే! మనస్సులో గాభరా.

'ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు'.

లిల్లీ తమ్ముడు ప్రక్క గదిలోనుండి పియానో ప్రాక్టీస్‌ చేస్తూ ఆ పాట వాయిస్తున్నాడు. ఆ మాటలు వినగానే తన కళ్లు చెరువులయ్యాయి.

'రక్షకా నీవే నా ఆశ్రయం' అనుకొంది మనస్సులో. అమ్మ మాట ఎంత నిజం కదా! యేసుక్రీస్తు గొప్ప మిత్రుడు, ఆయనకు సాటి లేదు.

మనుష్యుల ప్రేమ కోరుతూ ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించాను. లిల్లీ అవమానంతో సిగ్గుపడింది. వెంటనే ప్రభువుకు సమర్పించుకొని హృదయంలోకఆహ్వానించింది.

'ప్రభువా, నువ్వు నా ఫ్రెండ్‌, నా జీవితాంతం నీతో స్నేహం చేస్తాను. నీ కోసమే బ్రదుకుతాను.'

యౌవన సోదరీ, నీ హృదయం దేనిని వెదుకుతోంది? మీ స్నేహితులెవరు, యేసా? వేరెవరైనా మనుష్యులా? లిల్లీ మోస పోయినట్టు మీరు మోసపోకండి. మీ సృష్టికర్తను బాల్య దినములలోనే జ్ఞాపకం చేసుకోండి. - అమూల్య ముత్యం
యవ్వన