యవ్వనస్తులుPost Date:2014-06-06//No:17

యవ్వనజ్వాలనీవైతే ఏం చేస్తావు?

అది ఓ చల్లని సాయంత్రం... రోజంతా తన ప్రతాపాన్ని చూపి మరలా రేపు కలుద్దాములే అంటూ సూర్యుడు తన గూడుకు చేరుకుంటున్న వేళ... ప్రకృతంత సేదతీరుతున్న సమయం. జీవరాశులంతా పరవశించుచున్న వేళ. ప్రతీ ఒక్కరూ వారి ఆనందాన్ని ఆయా స్థలాల్లో అనుభవిస్తున్న ప్రశాంత సమయం. పబ్లిక్‌ గార్డెన్స్‌, పార్కులు కిటకిటలాడుతున్న వేళ.

సూరజ్‌ కూడ ఆ రోజంతా ఉద్యోగ బడలికతో నింపబడి అప్పుడే ఇంటికి చేరుకొని తన తల్లి ప్రేమతో పెట్టే ఆ గోరుముద్దలు తిని స్నానపానాదులు ముగించుకొని, ఆ అందమైన సాయంత్రాన్ని తన అలవాటు ప్రకారం దేవుని మందిరములో గడపడానికి వెళ్లిపోయాడు. ఇస్సాకు వలె ప్రతి సాయంత్రం సూరజ్‌కున్న ప్రాముఖ్యమైన పనేమిటంటే దైవసేవకుని యొద్దకు వెళ్ళి వారితో కొంత సమయం గడిపి, ప్రార్ధించుకొని, చేయగలిగినంత పరిచర్య చేసి, అవకాశముంటే పాస్టర్‌ గారితో పాటు ప్రార్ధనా కూడికలకు హాజరై ఇంటికి రావడమే !

పిన్నలనేమి, పెద్దలనేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును (కీర్తన 115:13) ప్రకారం దేవుని యెడల అతడు కలిగియున్న భయభక్తులను బట్టి, యదార్ధతను బట్టి సూరజ్‌ అంచెలంచెలుగా అభివృద్ధి చెందసాగాడు. చిన్న వయస్సులోనే ఓ ప్రముఖ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా ఉద్యోగాన్ని సంపాదించాడు. తండ్రిని చిన్న వయస్సులోనే పోగొట్టుకొనినను తల్లిని, చెల్లిని ఎంతో ప్రేమగా ఆదరిస్తూ, దేవుని సేవలో అనేక విషయాలయందు సహకరిస్తూ తిమోతి వలె యౌవనమును బట్టి ఎవరును తనను తృణీకరించకుండా.. ఎదిగిన మొక్కవలె ఫలిస్తూ అనేకులకు దీవెనకరముగా, ప్రభువుకు మహిమకరముగా జీవించసాగాడు. ప్రతీ ఒక్కరితో పరిశుద్ధతను, సమాధానమును కలిగి జీవిస్తూ అనతికాలములోనే ఆ కళాశాలలో ప్రతీ ఒక్కరు అభిమానమును చూరగొన్నాడు. అందరి యోగక్షేమాలు విచారిస్తూ, సమయం దొరికిన కొద్ది సత్కార్యాలు చేస్తూ, అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. నేటి కాలంలో ఇటువంటి యౌవనులెంత అవసరమో కదా !

అయితే వేటగాని కన్నులు తన రాయి దెబ్బ తిని చచ్చిపడిపోయిన పక్షి మీద కన్నా ఎగిరే పక్షి మీద వుంటాయన్నట్లు అపవాది దృష్టి కూడా నశించిపోయిన ప్రజల మీద కాకుండా ప్రభువు కొరకు

జీవించాలనుకున్న వారిమీదనే వుంటుంది. వీరిని ఆత్మీయంగా దుర్భరస్థితికి చేర్చాలనీ... అందమైన జీవిత తోటను పాడుచేయాలని, దేవుని రాజ్యవ్యాప్తికై వీరు వేస్తున్న బాటను వక్రీకరింపచేయాలని ప్రయత్నిస్తుంటాడు.

ఆత్మీయానందముతో సాగిపోతున్న సూరజ్‌ జీవిత నావను శోధన అనే పెనుగాలిని పంపి నడి సముద్రములో ముంచేయాలనుకున్నాడు అపవాది. గమ్యానికి చేరకుండా దారి మళ్ళించి అతలాకుతలం చేయాలనుకున్నాడు. పరిశుద్ధతనే ధ్యేయంగా చేసుకొని బ్రతుకుతున్న సూరజ్‌ జీవితములో ఓ భయంకర పరీక్ష ఎదురైంది.

ఉషోదయకాంతులీనుతున్న ఆ మధురమైన ప్రాతఃకాల సమయంలో ప్రార్ధనా పూర్వకంగా ఇంటి నుండి బయలుదేరిన సూరజ్‌కు కాలేజ్‌ గేట్‌ వద్ద చిరునవ్వుతో ఓ అందమైన యువతి ప్రత్యక్షమైంది. గుడ్‌మార్నింగ్‌ సార్‌, ఐయామ్‌ సుమ.. నేనిదే కాలేజ్‌లో బి.డి.ఎస్‌.ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను... మీరంటే నాకు చాలా యిష్టం అంటూ దగ్గరగా వచ్చింది. గుడ్‌మార్నింగ్‌ మా... అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చి గబగబా తన క్యాబిన్‌లోకి వెళ్లిపోయాడు సూరజ్‌. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ నుంచే సాతాను తన కుతంత్రానికి శ్రీకారం చుట్టాడు. మరుసటి ఉదయం అదే స్థలంలో అదే అమ్మాయి సూరజ్‌ని మరలా పలకరించింది. ఇక కాలేజ్‌ సమయాల్లో కూడా ఆ వెర్రి స్త్రీ సూరజ్‌ను వెంటాడేది. ఆమె ఆ పట్టణములో ఓ ప్రముఖ వ్యాపారస్తుని కుమార్తె. డబ్బుకు కొదువలేదు. విచ్చలవిడి జీవితంతో దేవుని భయం లేకుండా తన వేషభాషలతో సూరజ్‌ని ఆకట్టుకోవాలని చూసేది. ఏ స్త్రీ వైపు కూడా కన్నెత్తి చూడని సూరజ్‌కు ఈ స్త్రీ పోరాటమయిపోయింది. చాలా కలవరానికి గురయ్యాడు. సాతాను యౌవనుల కొరకు ఉపయోగిస్తున్న శరీరాశ, నేత్రాశ అనునవి ఎంత పదునైన, ప్రభావవంతమైన ఆయుధాలో గ్రహించి అవాక్కయ్యాడు. సెల్‌ఫోన్‌కు అసభ్యకరమైన ఎస్మెమ్మెస్‌లు పంపేది. సూరజ్‌ ఆత్మీయ జీవితానికి చాలా అభ్యంతరకరంగా మారిపోయింది. మొదట్లో అంతగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు గానీ రానురాను ఈ సమస్య మరింత తీవ్రతరమైంది. అయితే కన్నీటితో ప్రభువు చెంతకు చేరాడు. అయ్యా ! 'ఈ శోధనను ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించు. జారకుండా నా పాదాలు స్థిరపరచుము. యోసేపుకిచ్చిన ఆత్మ బలమును నాకిమ్ము' అని ప్రార్ధించాడు.

సుమ అను ఈ అమ్మాయి రోజురోజుకి సూరజ్‌ మీద దురభిప్రాయాన్ని అధికం చేసుకుంటూ చదువును నిర్లక్ష్యం చేయసాగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతుంటే ఓ రోజు ఈమె దగ్గర ఆగి... కన్నీటితో ఆమెకు సూరజ్‌ యేసుప్రభువును గురించిన కొన్ని మాటలు చెప్పాడు. ప్రభువులో వున్న పవిత్రతను ఆమెకు పరిచయం చేశాడు. నేను నీవనుకున్నట్లు ఈ లోకసంబంధమైన వ్యక్తిని కాను. నేను యేసుక్రీస్తు ప్రేమను నరనరాల్లో నింపుకున్న వ్యక్తిని. అపవిత్రమైన ప్రేమలో జీవించేవాడిని కాదమ్మా ! నేను కూడా నిన్ను ప్రేమిస్తాను ఓ సొంత అన్నగా ! దయచేసి నీవు కూడా ఆ ప్రేమమూర్తి అయిన యేసయ్యను నీ హృదయంలో చేర్చుకో ! లోకాశలపై జయం పొందగలవు. క్షణమాత్రం వుండే ఈ యౌవనేచ్ఛల నుండి నిన్ను నీవు కాపాడుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రభువు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. మంచి భాగస్వామిని దేవుడు నీకిస్తాడు. నిన్ను తన బిడ్డగా మార్చుకొని తన పరిశుద్ధమైన రాజ్యంలో నిన్ను కూడా చేర్చుకుంటాడు. నేను నీ కొరకు ప్రార్ధిస్తానని చెప్పి పరలోక పరిశుద్ధుల గణమంతా కోటానుకోట్ల దేవదూతల సమూహమంతా సూరజ్‌ని చూచి కరతాళ ధ్వనులు చేయుచుండగా తన రెండు కన్నులు పైకెత్తి విజయానందముతో ప్రభువుకు చేతులు జోడించి నమస్కరించి వెనుతిరిగాడు సూరజ్‌ ! నివ్వెరపోవడం ఆమె వంతయ్యింది.

ప్రియ తమ్ముడూ, చెల్లీ !
యవ్వనజ్వాలనీవైతే