యవ్వనస్తులుPost Date:2014-06-03//No:16

సినిమాలు చూడటం తప్పా ?ప్రశ్న : అన్నా, నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. సినిమాలంటే నాకు చాలా ఇష్టం. దేవుని పిల్లలు సినిమాలు చూడకూడదని, అవి పాపముగానే పరిగణించబడతాయని పాస్టర్లు చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం. సినిమాలు చూసినంత మాత్రాన పాపము చేసినట్టేనా?

జవాబు : తమ్ముడూ, అనేకమంది హృదయాలలో సందేహముగా ఉన్న ప్రశ్న అడిగావు. నీవు అడిగిన ప్రశ్నకు క్లుప్తంగా సమాధానం చెబుతాను.

1. సినిమాలు పాపమా ? 

ఎ) సినిమా అనేది నటనతో నిండి ఉంటుంది. నటన అనగా వేషధారణ. నటులను మొదట్లో వేషగాళ్లు అనేవారు. దేవునికి నటన అనగా వేషధారణ అంటే ఇష్టం ఉండదు. దేవునికిష్టం లేనిది పాపము కాదా? వేషధారణ, నటనతో నిండి ఉన్న సినిమా పాపము కాదా? ఈ లోకపు నటన గతించుచున్నది (1 కొరింథీ 7:31) 

బి) సినిమాలో శృంగార సన్నివేశాలుంటాయి. శృంగారం అనేది భార్యాభర్తల మధ్య రహస్య ప్రక్రియగా ఉండాలనేది దేవుని చిత్తం. కానీ సినిమా ఆ రహస్య ప్రక్రియలను బహిరంగముగా అనేకమందికి చూపి వ్యభిచారపు ఆలోచనలను మనుష్యులలో రేకెత్తిస్తుంది. ఎంతోమంది చిన్న బిడ్డలు, యవ్వనస్థులు, పెండ్లి అయినవారు, కొంతమంది వృద్ధులు కూడా సినిమాలలోని శృంగార సన్నివేశాలను చూసి కామతప్తులుగా, జారత్వకులుగా, వ్యభిచారులుగా నాశనమయిపోతున్నారు. ఈ రహస్య ప్రక్రియను బహిరంగముగా చూపడం, అనేకమంది వ్యభిచారులుగా తయారవ్వడం దేవునికిష్టం లేనిది. దేవునికిష్టం లేనది పాపము కాదా? శృంగార సన్నివేశాలను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చూపించే సినిమా పాపము కాదా?  

సి) సినిమాలో హింసాత్మక దృశ్యాలు, పోరాట సన్నివేశాలు ఉంటాయి. ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడం, కొట్టడం, చంపడం ఇటువంటివన్నీ సినిమాలో కనబడతాయి. అన్యాయం చేసిన వాడిని కొట్టవచ్చు, తన్నవచ్చు, చంపవచ్చు అని సినిమా బోధిస్తుంది. కానీ ఇది యేసయ్యకు వ్యతిరేకం. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని చెప్పిన యేసయ్య తన్ను హింసించినవారిని క్షమించాడు. మనుష్యులు ఫలించాలని, విస్తరించాలని, ప్రేమ కలిగి జీవించాలని దేవుని సంకల్పం. కానీ సినిమాల ప్రభావంతో అనేకమంది రౌడీలుగా, గూండాలుగా, ఇతరులను హింసించేవారిగా, నరహంతకులుగా మారుతున్నారు. హింసించిన వారిని క్షమించే యేసయ్యకు హింసను ప్రేరేపించేవి, వాటి వలన మనుష్యులు ప్రేమలేనివారుగా తయారుకావడం ఇష్టం లేదు. దేవునికిష్టం లేనిది పాపము కాదా? దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించే సన్నివేశాలున్న సినిమా పాపము కాదా?డి)సినిమాలో యవ్వనస్తుల ప్రేమ సన్నివేశాలుంటాయి. యవ్వనస్తుల మధ్య ఉండే ప్రేమ తప్పు కాదని, ఆ ప్రేమ దైవమని, వారు ప్రేమించి పెళ్ళి చేసుకోవచ్చని సినిమా బోధిస్తుంది. కానీ ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు (విలాప 3:27) అని వాక్యం సెలవిస్తుంది. యవ్వనస్తులు దేవుని కాడి మోయాలని, దుష్టుని జయించాలని, పాపానికి దూరంగా పారిపోవాలని, పెండ్లికి ముందు పాపము చేయకూడదని దేవుని కోరికయై యున్నది. కానీ సినిమాలు చూస్తున్న యవ్వన బిడ్డలు ప్రేమ తప్పుకాదని, ప్రేమే దైవమని ప్రేమలోపడి పెండ్లికి ముందు దేవుని కిష్టం లేని పాపం చేస్తూ దుష్టునికి లొంగిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ శాపపు కాడిని మోస్తున్నారు. భవిష్యత్తులు పాడుచేసుకుంటున్నారు. దేవుని కాడి మోయకుండా శాపపు కాడిని మోయిస్తున్న ప్రేమ సన్నివేవాలు చూపడం దేవుని కిష్టం లేదు. దేవుని కిష్టం లేనిది పాపం కాదా? దేవుని కోరికకు వ్యతిరేకంగా యవ్వనస్తుల మధ్య ఉండే కామపు ప్రేమను చూపించే సినిమా పాపము కాదా? 

ఇ) సినిమాలలో స్త్రీలను అర్ధనగ్నంగా చూపించే సన్నివేశాలుంటాయి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును (మత్త 5:28) అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే స్త్రీని చెడ్డగా చూస్తారో వారు వ్యభిచారం చేసినట్టేనని ఈ మాటలలోని ఆంతర్యం. సినిమా చూస్తున్న పురుషులు ఆ సినిమాలో అర్ధనగ్నంగా కనబడుతున్న స్త్రీలను చూడకుండా ఉండగలరా? సినిమా చూస్తున్న పురుషుడు ఆ స్త్రీలను చెడ్డగా చూసి వాక్య ప్రకారం ఎన్ని వ్యభిచారాలు చేస్తున్నారో లెక్కపెట్టలేము. ఆ హీరోయిన్లనే ఊహించుకుంటూ, వారి కొరకు కలలు కంటూ ఎంతోమంది దేవునికి ఆలయమైన హృదయాన్ని పాడుచేసుకుంటున్నారు. అర్ధనగ్నంగా చూపించే స్త్రీల సన్నివేశాలు వాటిని చూసి వ్యభిచార నిలయాలుగా మారిపోతున్న హృదయాలు దేవునికి బాధ కలిగించేవి. దేవునికి బాధ కలిగించేవి పాపాలు కాదా? అనేకమంది హృదయాలను సాతాను నిలయాలుగా మార్చుటకు కారణమైన అర్ధనగ్న స్త్రీల సన్నివేశాలు చూపించే సినిమా పాపము కాదా? 

ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన విషయాలు కళ్ళ ముందుకు వస్తాయి. దేవునికి ఇష్టం లేనివి ఆయనకు బాధ కలిగించేవి వాక్య వ్యతిరేకమైనవి సినిమాలలో కనబడుతూ ఉంటే దేవుని పిల్లలు ఎలా సినిమాలను చూడగలరు? సినిమాలు దేవునికి బాధ కలిగించేవిగా ఉన్నప్పుడు వాటిని చూస్తున్నవారు కూడా దేవునికి బాధ కలిగిస్తున్నారు అని అర్ధం చేసుకోవాలి. 

ప్రియ తమ్ముడా, ఇంతవరకూ సినిమాలు పాపమా? కాదా? అనే విషయాలను క్లుప్తంగా నీ ముందుంచాను. నువ్వు దేవుని కుమారుడవైతే ఆయనకు ఇష్టం లేనిది నీకూ ఇష్టం ఉండకూడదు. ఆయనను బాధపెట్టేదానికి నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు దేవుని కుమారుడవో కాదో నిర్ణయించుకో. దేవుని కుమారుడిని అనుకుంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపుచూడు. నిన్ను ఆయన దీవిస్తాడు.   - బ్రదర్‌ ప్రేమరాజు 
సినిమాలు