యవ్వనస్తులుPost Date:2014-05-09//No:12

యవ్వనజ్వాల మూడు ముళ్ల ప్రార్ధన

పరిపరి అర్ధించటమే ప్రార్ధన. మనిషి తనకు అసాధ్యమైనవి పొందడానికే దైవప్రార్ధనలు చేస్తుంటాడు. చాలా మంది ప్రార్ధనలో ఆర్ద్రత ఉండదు. కోరేవాటిని పొందే అర్హతా వారికి ఉండదు. ఒక అంధవిశ్వాసంతో, యాంత్రికంగా నిత్యం ప్రార్ధన చేస్తుంటారు. వారి పెట్టుబడి కేవలం కొద్దిసేపు కళ్లుమూసుక్కూచోవటమే కాబట్టి, ప్రార్ధన ఫలించలేదనే విచారమూ ఉండదు. చేయగా చేయగా ఎప్పుడో ఒకసారి తమ ప్రార్ధన ఫలించకపోతుందా అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి దేవుడు మన మనసులో మెదిలే అతి చిన్న ఆలోచన సైతం అదే క్షణంలో గమనిస్తాడు. మరి సుదీర్ఘంగా చేసే ప్రార్ధనలు ఎందుకు పట్టించుకోవటం లేదు? అవి నిస్వార్ధంగా లేవు కాబట్టి.

ఒక నగర సమీపంలో దట్టమైన అడవులుండేవి. వాటిలో అనేకమంది ఆటవిక జాతుల వాళ్లు నివసిస్తుండేవారు. జంతువుల వేట వారికి ప్రధాన వ్యాపకం. అడవిలో దొరికే కొన్ని వనమూలికలు సేకరించి, ఆ నగరంలో అమ్ముతూ తిరిగి వచ్చేటప్పుడు అక్కడ నుంచి తమకు దుస్తులు, వెండి నగలు వంటివి తెచ్చుకునేవాళ్లు.

ఆ నగరంలో రాజు అనే ఘన వైద్యుడుండేవాడు. ఆయన వైద్యాచార్యుడు కూడా కావటం వల్ల, అనేకమంది ఆయన వద్ద శిష్యులుగా చేరేవారు. ఔషధాల మొక్కల్నీ, వనమూలికల్నీ సహజ వాతావరణంలో గుర్తించేందుకు విద్యార్ధుల్ని తనవెంట, సమీపంలోని అడవులకు తీసుకువెళ్తుండేవాడు రాజు.

అలా వెళ్ళినప్పుడు అక్కడ నివసించే ఆటవిక జాతుల వారికి వైద్యపరీక్షలు జరిపి, వాళ్లు వాడుకోవాల్సిన ఔషధమొక్కలు, వనమూలికల గురించి వివరిస్తుండేవాడు రాజు. అది ఆయన విద్యార్ధులకి సైతం ఉపయుక్తంగా ఉండేది. ఆటవిక జాతులవారు రాజు పట్ల అమిత గౌరవాదరాలు చూపేవారు. ఆ జాతి నాయకులు, తమ ప్రాంతాలకు రాజు వచ్చినప్పుడు అడవి జంతువుల నుంచి రక్షణగా ఆయనతో ఉండేవారు.

గోమాంగ్‌ అనే కోయ నాయకుడి కొడుకు చిన్నగోమాంగ్‌కి రాజు దగ్గర శిష్యరికం చేయాలనే ఆశ కలిగింది. తండ్రితో చెప్పగా, అతడా విషయం రాజుకి చెప్పి, దయతో అంగీకరించమని కోరాడు. మొదట కాస్త ఆశ్చర్యపోయినా, అంగీకరించాడు. చిన్నగోమాంగ్‌కి ఆకాశం అందుకున్నంత సంతోషం కలిగింది. రాజుతో పాటు ఆ నగరానికి వెళ్లి, విద్యాలయంలో చేరాడు.

ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి, తిరిగి నిద్రపోయేముందు రాజు అందరిచేత ప్రార్ధన చేయించేవాడు. చిన్నగోమాంగ్‌కి సంస్కృతం రానందువల్ల ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకుని తేలిక భాషల్లో మూడు మాటల్లో ప్రార్ధన చెప్పాడు.

'దేవుడా! ఈరోజు నావల్ల ఎవరికీ అపకారం జరగకూడదు. ఎలాంటి స్వార్ధం లేకుండా నా విద్య ఇతరులకు ఉపయోగపడాలి. పగటిపూట నేను చేసిన తప్పులు రేపు మళ్లీ చేయకూడదు' - ఈ మూడు మాటల్ని వింటూ, ఒక తాడుకి మూడు ముళ్లువేసి మెళ్లో కట్టుకున్నాడు చిన్నగోమాంగ్‌. అవేమిటని అడిగితే 'గురువు గారూ! ఈ మూడు ముళ్లు నా కంఠాన్ని ఎప్పుడూ తాకుతుంటాయి. ప్రాణం పోయేదాకా మీరు చెప్పిన ప్రార్ధనే చేస్తాను. అలాగే నడుచుకుంటాను' అన్నాడు. రాజు ఆనందభరితుడై చిన్నగోమాంగ్‌ని ఆలింగనం చేసుకుని 'నాయనా! దేవుడు నీలాంటి నిర్మల భక్తుని ప్రార్ధన తక్షణం అనుగ్రహిస్తాడు. నువ్వు గొప్ప వైద్యుడివి అవుతావు' అని ఆశీర్వదించాడు. రాజు చెప్పినట్లే చిన్నగోమాంగ్‌ గొప్ప వైద్యుడు కాగలిగాడు. అందుకు తన మూడు ముడుల ప్రార్ధనే కారణమని అందరితో వినయంగా చెప్పుకొనేవాడు. జీవితాంతమూ అదే విధంగా ప్రార్ధన చేస్తూ తన కుమారులక్కూడా అదే నేర్పాడు. ఆ విధంగా ప్రార్ధన సిద్దిని అతడే గాక, అతని వంశస్థులూ పొందగలిగారు.
యవ్వనజ్వాల