యవ్వనస్తులుPost Date:2014-05-02//No:11

యవ్వనజ్వాల రాజసేవకై యువతరం

బబులోను రాజైన నెబుకద్నెజరు క్రీ.పూ.605 లో యూదా రాజైన యెహోయాకీమును ఓడించి యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు. తిరిగి వెళ్తూ యెరూషలేము మందిరంలోని శ్రేష్టమైన వస్తువులను తనతో పట్టుకువెళ్ళాడు. వాటిని తన దేవతల ఖజానాలో ఉంచాడు. శ్రేష్టమైన వస్తువులతో పాటు రాజు మరోపని చేశాడు. తన వద్ద ఉద్యోగులకు అధికారియైన అష్పెనజును ఇశ్రాయేలీయులలో శ్రేష్టమైన యువకులను తన ఆస్థానంలో పని చేయడానికి ఎంపిక చేయమని ఆదేశించాడు. వారిని రాజ కుటుంబాల నుండి, ఉన్నతమైన కుటుంబాల నుండి తీసుకోవాల్సి ఉంటుంది. మరో అర్హత ఏమిటంటే వారికి ఎలాంటి శారీరక లోపమూ ఉండరాదు. అందంగా ఉండాలి. సకల విద్య ప్రవీణతా, జ్ఞానమూ కలిగి తత్త్వజ్ఞానం తెలిసినవారై ఉండాలి (దానియేలు 1:3,4).

ఉన్నవారిలో శ్రేష్టులు

ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నెబుకద్నెజరు యెరూషలేములో అన్నిటినీ, అందరినీ నాశనం చేయలేదు. ఇశ్రాయేలీయులకు సంబంధించిన వాటన్నిటినీ తృణీకరించలేదు. ఇశ్రాయేలు దేశంలో తనకు ప్రయోజనకరంగా ఉండే వస్తువుల కొరకూ, వ్యక్తుల కొరకూ అతడూ చూశాడు. విలువైన వస్తువులను తీసుకువెళ్లాడు. తనవద్ద ఉన్న అధికారి ద్వారా శ్రేష్టమైన యువకులను గుర్తించాడు. వారు రాజసేవకు యోగ్యులు కావడానికి ఒక ప్రణాళిక సమయం నిర్ధారించి శిక్షణ నిప్పించాడు.

ఎంపిక ప్రక్రియలో నెబుకద్నెజరు అనేక యోగ్యతలను పేర్కొన్నాడు. అతడు ద్వితీయ శ్రేణికి సంబంధించిన వ్యక్తులను అంగీకరించడు అని దీని అర్ధం. మధ్యరకం వ్యక్తులు, నాసిరకం పనులు ఏ పనిలోనైనా నాణ్యతనూ, ఉత్కృష్టతనూ దిగజారుస్తాయి. నెబుకద్నెజరుకు తన భవనం అత్యంత ప్రాముఖ్యమైన స్థలం అనీ, అది ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే స్థలం అనీ రాజు ప్రణాళికలు అమలు జరిపే స్థలం అనీ బాగా తెలుసు.

పెట్టుబడి

ఇశ్రాయేలులో యువకులు అనేకులు ఉన్నారు. అయితే రాజు నిర్ణయించిన యోగ్యతలు కలిగి ఉన్న దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యాలు ఎంపిక అయ్యారు. ప్రధాన అధికారి వారిలోని సామర్ధ్యాలను గుర్తించాడు. వారికి కఠినమైన శిక్షణ నిచ్చాడు. మూడు సంవత్సరాలు శిక్షణ కొనసాగింది. ఈ శిక్షణ వారిలోని నైపుణ్యాన్ని ద్విగుణీకృతం చేసింది. వారిలో దాగి ఉన్న సామర్థ్యం బయటకు వచ్చింది.

వారి శిక్షణా కార్యక్రమంలో బబులోనీయుల భాష, సాహిత్యాలను నేర్చుకోవడం ఒక భాగం. ఇది కాకుండా వీరు రాజు భుజించే ప్రత్యేకమైన, శ్రేష్టమైన ఆహారాన్ని భుజించాలి. ఈ యువకుల శిక్షణ కొరకు నెబుకద్నెజరు పెద్ద మొత్తం చెల్లించాడు. రాజుకు కావల్సిందల్లా ఈ యువకులలో నైపుణ్యత, ఉత్కృష్టత. దానికి ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.

సమీకృత సామర్థ్యం

నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుడు కాకపోయినా ఈ హెబ్రీ యువకులు దేశానికి చేసే సేవను ముందే వీక్షించగలిగాడు. తన భవనానికున్న ప్రాముఖ్యతను బట్టి అందులో పనిచేయగలిగిన చలనశీలురైన యువకులు జ్ఞానమూ, తెలివితేటలూ, నేర్చుకునే సామర్ధ్యమూ కలిగినవారై ఉండాలని వాంఛించాడు. నెబుకద్నెజరు ఈ యువకుల్ని గుర్తించి ఉపయోగించుకున్నట్లుగా ఇశ్రాయేలు రాజు వీరిని ఉపయోగించుకోలేక పోయాడన్నది దాగని సత్యం. మనం కూడా కొన్నిసార్లు మనతో ఉన్న యువకుల్ని సరియైన రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. అయితే వారు మనను వీడి బయటకు వెళ్ళినప్పుడు వారి తలాంతుల్ని చూసి ఆశ్చర్యపోతుంటాం.

ఒక అన్యుడైన రాజు తన సేవ చేసేవారిలో ఇన్ని యోగ్యతల కోసం చూస్తుంటే రాజులకు రాజైన మన ప్రభువు తన సేవకులలో ఇంకెన్ని యోగ్యతల కొరకు చూస్తాడో కదా. యువతలోని శక్తిని మనం గుర్తించాల్సిన సమయం ఇది. దేవుని రాజ్య విస్తరణలో వారి పాత్రను గుర్తించాల్సిన సమయం ఇది.

తల్లిదండ్రులమైన మనం మన పిల్లలపై ఎంతో ఖర్చు పెడతాం. పెద్ద జీతాలు వారు సంపాదించేలా దిద్దాలనుకుంటాం. వారికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడాలని మనం కోరుకోవడం సహజమే. అయితే రాజు సేవ కొరకు మనం వారిపై ఏ మాత్రం ఖర్చు చేస్తున్నాం? దేవుడు మన యువకుల తలాంతులను వాడుకోవాలని కోరుకుంటున్నాడు. వారి నైపుణ్యతలనూ, వరాలనూ దేవుడు కోరుకుంటున్నాడు. నేటి యువతలో దాగి ఉన్న ఎన్నో సామర్ధ్యాలతోపాటు ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. అత్యంత తీవ్రమైన సృజనాత్మకత వీరిలో ఉంది. అలాగే అధిక అస్థిరత్వమూ ఉంది. అయితే మన దేశ రక్షణ కొరకూ, దేవుని మహిమ కొరకూ యువతలోని లోపాలను అధిగమింపజేసి ప్రయోజనకరంగా మార్చవచ్చు. వారిని గుర్తించి గౌరవిద్దాం. పదే పదే ప్రోత్సహిద్దాం. సున్నితంగా నేర్పించి దేవుని సేవకై వారిని ప్రభావవంతంగా ఉపయోగిద్దాం. వారు దేవునికి కావాలి. - రెవ.ఐ.కె.అబ్రహాం
యవ్వనజ్వాల