వాక్యసందేశముPost Date:2014-12-12//No:99

క్రిస్మస్‌ ట్రీక్రిస్మస్‌ పర్వదినాన్న అలంకరించుకునే అలంకరణలలో క్రిస్మస్‌ చెట్టు ఒకటి. ఈ క్రిస్మస్‌ చెట్టును గూర్చి రకరకాల పారంపర్య గాధలున్నాయి. వాటిలో ప్రాముఖ్యముగా మూడింటిని గూర్చి తెలుసుకుందాం.

- క్రీ.శ.8 వ శతాబ్దంలో సువార్త సేవ జరిగించుటకు జర్మనీకి వెళ్ళిన సెయింట్‌ బోనీఫస్‌ అక్కడ అడవిజాతుల వారు చెట్టు పండుగను జరుపుకోవడం చూశాడు. ఆ పండుగ సమయంలో ఆ ప్రజలు 'ఓక్‌ చెట్టుకు' నరబలి కూడా ఇచ్చేవారు. ఆ దురాచారాన్ని వారితో మాన్పించాలని ఆయన వారికి ఒక ఫర్‌ చెట్టును చూపించి దాని విశిష్టతను ఈ విధంగా వివరించాడు. 'ఈ చెట్టు అమ్ము ఆకారంలో ఉండి స్వర్గంవైపు చూపిస్తుంది అనగా క్రీస్తుప్రభువు వైపుకు చూపిస్తుంది. ఆయన మానవుల పాపాలను పరిహరించుటకు బలి అయ్యారు. అందువలన మీరు ఈ నరబలులు చేయడం అనవసరం ఇకనుంచి మీరు ఈ నరబలులు మానివేసి ఈ ఫర్‌ చెట్టును క్రీస్తు ప్రసాదించిన రక్షణకు గుర్తుగా భావించండి. ఈ చెట్టు కొమ్మలను మీ ఇళ్ళకు తీసుకొని వెళ్ళి అందంగా అలంకరించి ఆనందంగా పండుగ జరుపుకోండి' అని వారితో దైవజనుడు చెప్పాడు. అప్పటినుండి ఈ చెట్టును క్రిస్మస్‌ రోజున అలంకరించి పండుగ జరుపుకోవడం ఆరంభమైంది.

- పూర్వం క్రిస్మస్‌ సందర్భంగా జర్మనీలో చర్చి ప్రాంగణంలో ఆదాము హవ్వల కధలతో ప్రారంభించి క్రీస్తు జననం వరకు మానవ రక్షణ చరిత్రను ప్రదర్శించేవారు. ఆదాము-హవ్వల కధను ప్రదర్శించే సందర్భములో ఫర్‌చెట్టుకు యాపిల్‌ పండ్లను వ్రేలాడదీసేవారు. క్రీస్తు జననానికి చిహ్నంగా ఒక ఎత్తైన కొయ్య స్తంభం మీద ఒక జ్యోతిని వెలిగించేవారు. ఈ రెండింటినీ ప్రతీ ఇంటిలోనూ క్రిస్మస్‌ సందర్భంగా చేసేవారు. కాలక్రమేణా ఫర్‌ చెట్టుకు యాపిల్‌ పండ్లను అలంకరించడం మానేసి జ్యోతి మాత్రము చెట్టుమీద ఉంచడం ప్రారంభించారు. ఈ విధంగా క్రిస్మస్‌ సందర్భంగా ఫర్‌ చెట్టుకు గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది.

- క్రీ.శ.16 వ శతాబ్దంలో లూధరన్‌ చర్చ్‌ వ్యవస్థాపకుడైన మార్టిన్‌లూధర్‌ గారు డిసెంబర్‌లో వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఒక మొక్కని చూసారట. ఆకాశంలో నక్షత్రాలను చూసి ఈ మొక్కకు క్రొవ్వొత్తులు పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆ మొక్కను క్రొవ్వొత్తులతో అలంకరించారట. అది క్రిస్మస్‌ కాలం అవడంతో క్రిస్మస్‌ వాడుకలోకి వచ్చింది అదేవిధంగా క్రీ.శ.19వ శతాబ్దంలో విక్టోరియా మహారాణి కూడా క్రిస్మస్‌ ట్రీని ప్రాచుర్యంలోకి తెచ్చారు.

- క్రిస్మస్‌ చెట్లుగా ఈ క్రింది మొక్కలను ఎక్కువగా వాడతారు. 1) స్కాట్చ్‌, 2) పైన్‌, 3) డగ్లస్‌ఫర్‌, 4) ఫ్రాసర్‌ఫర్‌, 5) బాల్సమ్‌ఫర్‌, 6) వైట్‌పైన్‌

మన భారతదేశంలో ఫర్‌చెట్టు లేకపోవడం వల్ల దానితో దగ్గర పోలిక ఉన్న సరివి చెట్టును క్రిస్మస్‌ ట్రీగా వాడుకుంటున్నారు.

- జర్మనీలో క్రిస్మస్‌ ట్రీతో పాటు క్రిస్మస్‌ పిరమిడ్స్‌ని కూడా అలంకరిస్తారు. చెక్కతో చేయబడిన పిరమిడ్స్‌ను క్యాండిల్స్‌తోను, పచ్చని ఆకులతోనూ అలంకరిస్తారు.

- ప్రపంచంలో అతిపెద్ద క్రిస్మస్‌ ట్రీ విల్లింగ్టన్‌లోని హీల్లన్‌ పార్కులో ఉంది. 91 అడుగుల ఎత్తు ఉన్న ఈ చెట్టు 120 చదరపు అడుగుల ప్రదేశంలో విస్తరించి ఉంది. ప్రతీ క్రిస్మస్‌ దినాన్న ఆ వృక్షాన్ని బంగారు, వెండి ఆభరణములతో అపురూప వస్తువులతో రంగు రంగుల దీపాలతో అలంకరిస్తారు. ఈ అతిపెద్ద క్రిస్మస్‌ ట్రీని సందర్శించడానికి ప్రతీ సంవత్సరం లక్షలాదిగా దేశవిదేశాల నుండి తరలివస్తారు.

- ప్రొఫెసర్‌ 'చార్లెస్‌ ఫోలెన్‌' అను వ్యక్తి అమెరికా దేశమునందు 1832 వ సం||లో క్రిస్మస్‌ ట్రీని నిర్మించి, అలంకరించి మొట్టమొదటిసారిగా క్రిస్మస్‌ ట్రీ మీద క్యాండిల్‌ను వెలిగించాడు. దీనిని అలంకరించడానికి 16,450 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది.

క్రిస్మస్‌ ట్రీ విశేషాలు

- క్రిస్మస్‌ పండుగలో 'ఫర్‌చెట్టు'ను అలంకరించే ఆచారము క్రీ.శ.10వ శతాబ్దంలో జర్మనీలో ప్రారంభమైంది.

- ప్రపంచంలో అతిపెద్ద క్రిస్మస్‌ ట్రీ విల్లింగ్టన్‌లోని హీల్లన్‌ పార్కులో ఉంది.

- ప్రొఫెసర్‌ చార్లెస్‌ ఫోలెన్‌ 1832 వ సం||లో క్రిస్మస్‌ ట్రీని అలంకరించి దాని మీద క్యాండిల్‌ వెలిగించాడు.

- 1882 వ సంవత్సరంలో మొదటిసారిగా క్రిస్మస్‌ ట్రీని విద్యుత్‌ దీపాలతో అలంకరించే ఆచారాన్ని ప్రారంభించారు.

- ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్‌ ట్రీ అబుదాబిలోని ప్యాలస్‌ హోటల్‌లో ఉంది. దాని ఎత్తు 40 అడుగులు. దీని విలువ 1కోటి 10 లక్షల డాలర్లు. ఈ చెట్టును 181 వజ్రాలు, పగడాలు, కెంపులతో కలిపి దాని విలువ దాదాపు 40 కోట్లు.

- 1984 వ సం|| డిసెంబర్‌ 13వ తేదీన నేషనల్‌ క్రిస్మస్‌ ట్రీగా అమెరికాలో ఒక చెట్టు అమ్ముడైంది.

- ఐరోపాలో ఏడాదికి సగటున 60 మిలియన్ల క్రిస్మస్‌ ట్రీలను పెంచుతారు.

- క్రిస్మస్‌ ట్రీలను కొనుగోలు చేయడానికి అమెరికన్లు ఏటా 1.8 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా.

- దాదాపుగా ఒక లక్ష మంది ఉద్యోగులు క్రిస్మస్‌ ట్రీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు.

- 1,000,000 ఎకరాల భూమి ఈ క్రిస్మస్‌ ట్రీలను పెంచడానికి ఉపయోగిస్తున్నారు.

- ప్రతీ ఏటా 77 మిలియన్ల చెట్లను నాటుతారు. ప్రతీ ఎకరానికి 2,000 చెట్లను నాటుతారు.

 - క్రిస్మస్‌ నక్షత్రాలు సౌజన్యంతో
క్రిస్మస్‌