వాక్యసందేశముPost Date:2014-11-14//No:92

మీ ప్రార్ధన ఎలా ఉంది? ప్రార్ధన చాలా విశాలమైనది. ఆత్మీయ జీవితంలో విస్తృతమైనది. ప్రార్ధన వినీల ఆకాశాన్ని చేధించుకుని పరలోకమందున్న ప్రభువును చేరునంత తొందరగా ఏ స్పేస్‌షటిల్‌ పయనించలేదు! ప్రార్ధన చుట్టిరాని ప్రదేశం లేదు, చేయలేని కార్యం లేదు, అందుకే బైబిల్లో ప్రార్ధన యొక్క ప్రాముఖ్యత ప్రతిబింబిస్తుంది. విశ్వాసి ప్రార్ధన జీవితం ఘనంగా మరియు బలంగా ఉండాలి. ప్రార్ధన పఠించేది లేక పలికేది కాదు దానిని వ్యక్తిగతంగా అనుభవించాలి. చిన్న పిల్లల ప్రార్ధన పెద్దల ప్రార్ధనలో వ్యత్యాసం ఉంది. పిల్లల ప్రార్ధనలో లోతు ఉండదు (1 కొరింథీ 13:11). ప్రార్ధన జీవితంలో ఎదుగుదల, పరిపక్వత అత్యవసరం. ప్రార్ధనలో ప్రజలు వేరు వేరు స్థాయిలలో అనుభవాలు కలిగియుంటారు. అందరూ ఓడలో ఉన్నా అందరూ ఒకే అంతస్థులో లేరు! కొందరిది చీలమండ లోతు, కొందరిది మోకాళ్ళ లోతు, కొందరిది మొల లోతు, కొందరిది మునిగిపోయే లోతు అనుభవంగా ఉంటుంది (యెహెజ్కేలు 47:3-5).

మీ ప్రార్ధన జీవితాన్ని పెంచుకోవాలి, పటిష్టం చేసుకోవాలి, ఫలింపజేయాలి. 'నీ ప్రార్ధన దోనెను లోతునకు నడిపించుమని' ప్రభువు సెలవిచ్చిన తరువాత దానిని అంత సుళువుగా తీసుకోకూడదు. మీ ప్రార్ధన అనుభవంలో ఈ విషయాలు కలవా? పరిశీలించండి. లేకపోతే వెంటనే ప్రారంభించండి.

1) దీవెనల కొరకు ప్రార్ధించుట నుండి దీవించు దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి : కొందరి నోట 'దేవా, నన్ను దీవించు' అన్న మాటలు తప్ప మరేవి రావు! ఎంతసేపు దీవెనలపై ధ్యాసే తప్ప దీవించు దేవుని పై ససేమిరా మనస్సు ఉండదు. దీవెనలు కోరుట తప్పుకాదు. యాకోబు, యబ్బేజులు దీవెన కోరి దీవించబడ్డారు. అయితే వారు మొదట దీవెన కర్తను కాంక్షించారు. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆశీర్వాదాలు ఇస్తాడు. మనం వాటి కొరకు ప్రార్ధనలో అడగవచ్చని వాక్యం చెబుతోంది. కాని మన ప్రార్ధనలో అది ప్రధానమైన విషయం కాదు. కొందరు జలగల్లాగా 'ఇమ్ము, ఇమ్ము' అనే మొఱ్ఱ పెడుతుంటారు. వారికి ఆ వ్యక్తిపై శ్రద్ధలేదు ఆయన ఇచ్చే వస్తువులపైనే శ్రద్ధ. వారికి భగవంతుడు కాదు కావాల్సింది, ఆయన యొద్ద దొరికే బంగారం! దేవుని ప్రేమించక ఆయన ఇచ్చే యీవుల కొరకు పరితపించడం ఘోరం.

ప్రార్ధనలో ప్రభువుతో 'సహవాసం' మొదట, ఆ తరువాతే ప్రభువు 'సహాయం' ఉండాలి. ఆయన స్వాస్థ్యం కన్నా ఆయన సన్నిధిని కాంక్షించాలి. 'దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది (కీర్తన 42:1) '....జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది' (కీర్తన 84:2). 'ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగ లోకములోనిది ఏదియు నా కక్కరలేదు (కీర్తన 73:25). భక్తులు ప్రభువును కోరుకున్నారు ఆయన సన్నిధి కొరకు పరితపించారు. పౌలు ప్రభువు సహవాసం కొరకు తనకు లాభకరమైన వాటినన్నిటిని నష్టముగా పెంటగా ఎంచుకున్నాడు. వివేచన గలవారు విలువను గుర్తిస్తారు! దేవుడు నీ ఆత్మకు ప్రాణప్రియుడా? లేక నీ అవసరాల పంపిణిదారుడా? విద్యలో ప్రమోషన్‌, ఉద్యోగంలో ప్రమోషన్‌, వ్యాపారంలో ప్రమోషన్‌ లభించినట్లే ప్రార్ధనలో కూడా ప్రమోషన్‌ పొందాలి! భక్తుడైన జాన్‌ హైడ్‌ ప్రభువు సన్నిధిలో గంటల తరబడి నిద్రాహారాలు మరచి గడిపేవాడు.

2) శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రార్ధించుట నుండి ఆత్మసంబంధమైన విషయాల కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి : కొందరి ప్రార్ధనలో సమతుల్యత ఉండదు. వారి ప్రార్ధనా జీవితం ఒకవైపు ఒరిగిపోయి ఉంటుంది. ఎప్పుడూ శరీర అవసరతల కొరకే ప్రార్ధిస్తారు. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగం, విద్య, వీసా, వివాహం, వ్యాపారం, ప్రమోషన్‌, ట్రాన్స్‌ఫర్‌, బిడ్డలు మొదలగు వాటి కొరకే ప్రార్ధిస్తారు. ఆత్మీయ విషయాలను పూర్తిగా విస్మరిస్తారు. భూసంబంధమైన వాటి మీదే మనస్సు పెడతారు. పరసంబంధమైన వాటిని ఏ మాత్రం మనస్కరించరు (కొలస్సీ 3:1-2, ఫిలిప్పీ 3:19). శరీర సంబంధమైన విషయాలు అశాశ్వతమైనవి. ఆత్మ సంబంధమైన విషయాలు శాశ్వతమైనవి. ప్రభువు నేర్పిన ప్రార్ధనలో వీటి ప్రాధాన్యత కనబడుతుంది. 'మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము' అన్న విన్నపము 'నీ నామము పరిశుద్ధ పరచబడుగాక; నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక' అనువాటి తరువాత ఉన్నది. దేవుని మహిమ మన అవసరాలకు పైగా ఉండాలి.

దేవుని హృదయం ఎరిగినవారు, ఆలోచన కలిగి ప్రార్ధనలో తమ మనవులను తెలుపుతారు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకొమ్మని సెలవిచ్చినప్పుడు రాజైన సొలొమోను వివేకముగల హృదయమును దయచేయుమని కోరుకున్నాడు. ఆ కోరిక దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉండినందున ఆయన అతనిని బహుగా ఆశీర్వదించెను (1 రాజులు 3:5-14). ఆత్మఫలము కొరకు, క్రీస్తు పోలిక కొరకు, ఆత్మవరముల కొరకు, ఆత్మీయజ్ఞానము కొరకు, మనుష్యుల ఆత్మల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, హృదయశుద్ధి కొరకు, ఆత్మీయ విషయాల కొరకు ప్రార్ధించాలి. భక్తుడైన రాబర్ట్‌ మర్రే మక్షీన్‌ పరిశుద్ధతను ఎంతో ప్రేమించాడు, దాని కొరకు ఎంతో ప్రార్ధించాడు.
మీ
3. ఆచారబద్ధంగా ప్రార్ధించుట నుండి ఆత్మీయంగా ప్రార్ధించునట్లు ఎదగాలి : పరిసయ్యులు ప్రార్ధనలో ప్రవీణులు, పలురకాల ప్రార్ధనలు చేస్తూ ప్రజల్లో పేరు గడించారు. వారి ప్రార్ధనలు ఆచారబద్ధముగా ఉండేవే కానీ ఆత్మీయముగా ఉండేవి కావు. దేవుడు వారి ప్రార్ధనలను అంగీకరించలేదు (లూకా 18:9-14). ప్రార్ధన వారికి ఆచారమే కానీ ఆనందము కాదు. భక్తితో వారు ప్రార్ధించలేదు భుక్తి కొరకు, పేరు ప్రతిష్టల కొరకు (మనుష్యులకు కనబడవలెనని) ప్రార్ధించారు. ప్రార్ధన జీవితంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆత్మీయత నుండి మనం ఆచారంలోనికి కూరుకుపోతాం. ప్రార్ధన ఆత్మకు సంబంధించినది. అది అలవాటుగానో, ఆచారంగానో లేక యాంత్రికంగానో మారిపోకూడదు. ప్రార్ధన హృదయంలో పుట్టాలి. అక్కడనుండి పెల్లుబికి ప్రభువు సన్నిధికి చేరాలి. అలా ప్రవహించే ప్రార్ధన చాలా ప్రభావితమైనది. పెదవులతో ప్రార్ధిస్తూ హృదయం దూరంగా ఉండడం వేషధారణ! చాలా మందికి ముఖస్తుతి అలవాటైపోయింది మనస్సుస్తుతి కాదు. అర్ధం లేకుండా ప్రార్ధన చేయడం వ్యర్ధమే. సంఘాల్లో కూడ పుస్తకాల్లో నుండి వారం వెంబడి వారం ప్రార్ధనలు చదువుతారు. ఆ ప్రార్ధనల్లో మాటలు ఉండవచ్చునేమో గాని మనస్సు ఉండదు.

4. స్వంతము కొరకే ప్రార్ధించుట నుండి ఇతరుల కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి : పవిత్రమైన ప్రార్ధనలో కూడా స్వార్ధం ఉండగలదు. అనేకులు ప్రార్ధనలో తమ కొరకే ప్రార్ధిస్తారు కాని ఇతరుల కొరకు ప్రార్ధించరు. 'సాలీడ్లు తమ కొరకే పని చేసుకుంటాయి. అయితే తేనెటీగలు ఇతరుల మేలు కొరకు పనిచేస్తాయి!' నిజమైన ప్రార్ధన హృదయాన్ని విశాలపరచి, దానిని ఇతరుల కొరకు భారముతో నింపుతుంది. ఇతరుల కొరకు హృదయంలో స్థానాన్ని కల్పిస్తుంది. ఇతరుల కొరకు ప్రార్ధించుట వలన గొప్ప ఆశీర్వాదం లభిస్తుంది. యోబు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేయగా రెండింతలు దీవెన పొందాడు. ఇతరుల కొరకు ప్రార్ధించుటలో రెండింతల ఫలం దొరుకుతుంది. ప్రార్ధింపబడిన వారితో పాటు ప్రార్ధించిన వారికి ఆశీర్వాదం ఉంది. అసంఖ్యాకమైన క్రైస్తవులు స్వార్ధపూరిత ప్రార్ధనలు చేస్తారు. వారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్ధిస్తారు కానీ ఇతరులను గూర్చి ఏ మాత్రం లక్ష్యముంచారు. చందమామ దాతృత్వం గలది, దాని అందమంతా దాని ఇచ్చే గుణంలోనే ఉంది. ఒకవేళ చందమామ సూర్యుని నుండి పొందిన వెలుగును మనతో పంచుకోకుండా తనలోనే దాచుకుంటే, అప్పుడేం జరుగుతుంది? చందమామ ప్రకాశించడం మానేస్తుంది. అది ప్రకాశించడం మానిన మరుక్షణమే దాని అందాన్ని కోల్పోతుంది. ఒక వజ్రం యొక్క సౌందర్యం, దాని ప్రకాశం అంతా అది పొందిన వెలుగును ప్రతిబింబించుటలోనే ఉంది. చందమామ వెలగడం మానేస్తే ఆకాశంలో ఒక పెద్ద నల్లని వికృత గోళంలా ఉంటుంది. మనం ఎవరిని పోలి ఉందాము - దేవుని ఆకాశములో నల్లని వికృత గోళంలానా లేక వెలిగే చందమామలానా?

5. శ్రమల నుండి తప్పించుకొనుటకై ప్రార్ధించుట నుండి వాటిని అధిగమించే శక్తి కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి : మానవునిది తప్పించుకునే స్వభావం. జీవితంలో అసలు శ్రమ, కష్టం, ఒత్తిడిని ఇష్టపడడు. వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. విశ్వాసులు శ్రమల చేతనే శ్రేష్టులుగా మార్చబడతారు, శక్తిని పొందుతారు, శుద్ధీకరించబడతారు. వాటిని నివారించమని ప్రార్ధించుట సబబు కాదు. ఆ శ్రమలను ఎదుర్కొని, అధిగమించే శక్తిని ప్రసాదించమని దేవుని కోరుకోవాలి. గెత్సెమనే తోటలో తన మహాశ్రమకు మునుపు ప్రభువు ముమ్మారు ఆ గిన్నెను తన నుండి తొలగించమని కోరినా తరువాత తన తండ్రి చిత్తమునకు లోబడుటకు దూత చేత బలపరిచబడ్డాడు. అక్కడ ఆయన మనకు ప్రతినిధిగా ఒక మాదిరిని చూపాడు. పౌలు తన శ్రమ విషయమై ముమ్మారు ప్రభువును ప్రార్ధించినా, 'నా కృప నీకు చాలును' అని దేవుడు హామీ ఇచ్చాడు. కష్టంలోనే కృపను అనుభవించగలము. 'సుళువైన జీవితాల కొరకు ప్రార్ధించవద్దు. బలమైన వ్యక్తిగా ఉండుటకై ప్రార్ధించాలి. మీ శక్తికి సరిపడ పనుల కొరకు ప్రార్ధించవద్దు. కాని ఈ పనులకు సరిపడ శక్తికై ప్రార్ధించండి' అని అనేవాడు ఫిలిప్స్‌ బ్రూక్స్‌. శ్రమలే లేకుండా చేయమని ప్రార్ధించుట దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ప్రార్ధించుటే. 'లోకములో మీకు శ్రమ కలుగును' అన్న ప్రభువు మాటలు ఎలా మరువగలం? అయితే ఆయన చేత బలపర్చబడి వాటిని జయించాలి.

6. మీ చిత్తానుసారముగా ప్రార్ధించుట నుండి దేవుని చిత్తానుసారముగా ప్రార్ధించునట్లు ఎదగాలి : ప్రార్ధన ద్వారా దేవుని మార్చుట కాదు మనం మార్చబడాలి. ప్రార్ధనలో మన చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వక దేవుని చిత్తానికి పూర్తిగా లోబడాలి. కొందరు దేవునికి ఆయన ఏం చేయాలో, ఎలా చేయాలో చెబుతారు! వారి ఇష్టం నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దేవుని 'వేడుకోవాలి' కానీ 'వాడుకోకూడదు'. 'నీ చిత్తం నెరవేరునుగాక' అంటూనే మన చిత్తం నెరవేర్పు కొరకు ప్రయాసపడడం పాపం. క్రైస్తవునిలో ప్రార్ధన చేసే మొదటి పని అతడిని మార్చడం. అతడు తన ప్రార్ధన గదిలోనికి గర్వం, స్వార్ధం, అసూయ, కోపం, ఇష్టపాపంతో వెళ్ళినా అతడు నిజముగా, నింపాదిగా ప్రార్ధించిన తరువాత వినయం, నిస్వార్ధం, ప్రేమ, సాత్వికత, క్షమాపణలతో బయటకు వస్తాడు. ప్రార్ధన గది వెలుపల పేరు ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు, సుఖభోగాలు అన్ని ముఖ్యమైనవిగా కనబడతాయి. కాని ప్రార్ధన గదిలో మానవ విలువలన్ని వ్యర్ధమైపోతాయి. దేవునికి మన శీలము, గుణము, విధేయతే ముఖ్యం. అక్కడ దేవుని చిత్తం పాలిస్తుంది. ఆయన చిత్తము మంచిది, పరిపూర్ణమైనది, మేలుకరమైనది. అనేకుల ప్రార్ధన విఫలమై పోవుటకు కారణం ఆయన చిత్తానుసారముగా ప్రార్ధించకపోవడమే! 'ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము' (1 యోహాను 5:4-15).

7) మామూలు ప్రార్ధనల నుండి ఆత్మీయ పోరాట ప్రార్ధనలు చేయునట్లు ఎదగాలి : క్రైస్తవ జీవితం ఒక పోరాటం. మన నివాసం యుద్ధభూమి. మన స్థావరం శత్రువు మూక మధ్యన ఉంది. మన పోరాటం శరీరానుసారమైనది కాదు అది ఆత్మానుసారమైనది. దుష్టునితో మరియు వాని శక్తులతో ప్రార్ధనలో పోరాడాలి. ప్రార్ధన ద్వారానే మనం జయించగలము. అయితే ఆత్మీయ పోరాటం చేసే విశ్వాసులు చాలా తక్కువ. సర్వాంగ కవచము ధరించి నిత్యము ప్రార్ధనలో అపవాదితో పోరాటం జరగాలి. ప్రార్ధన ద్వారానే వానిని ఎదురించి, వాని ఆటలు కట్టించగలం. 'ప్రార్ధన ఆత్మకు కవచం, దేవునికి యాగం, మరియు సాతానుకు కొరడా!' అన్నాడో భక్తుడు. ఈ దినాల్లో తోకముడుచుకు పరిగెత్తే వారే ఎక్కువ కనబడుతున్నారు కాని ప్రార్ధన కొరడా ఝుళిపించి సాతానును పరిగెత్తించే వారు తక్కువ.

పాలబుడ్డి ప్రార్ధనలను వీడి పోరాట ప్రార్ధనలకు మనం ఎదగాలి. ఉరుగ్వే మరియు బ్రెజిల్‌ ఇరుగు పొరుగు దేశాలు. ఆ సరిహద్దులో ఒక వ్యక్తి కరపత్రాలు పంచుతున్నాడు. కేవలం రెండు దేశాలకు మధ్య ఒక రోడ్డు వాటిని వేరు చేస్తోంది. ఉరుగ్వే వైపు వారు కరపత్రాలను చిరునవ్వుతో తీసుకున్నారు. కాని బ్రెజిల్‌వైపు వారు వాటిని కోపంతో చించి వేసారు. కారణం ఉరుగ్వేలో ఆత్మీయ పోరాటం జరుగుతోంది. అక్కడ విశ్వాసులు ప్రార్ధనలో సాతానుపై విజయం సాధించారు. చక్కటి ఫలితం దక్కింది. బ్రెజిల్‌లో ఆ పరిస్థితి లేదు. అమాలేకీయులపై యెహోషువ జయం సాధించుటకు మోషే ప్రార్ధన కారణం (నిర్గమకాండం 17). సాతానుకు బెదరక, అదరక, పవిత్ర జీవితం కలిగి, ప్రభువును హత్తుకుని, వానిని ప్రార్ధనాయూధం ద్వారా హతమార్చండి! ప్రార్ధనలో ఆత్మీయ పోరాటం జయాన్నిస్తుంది.

'ప్రియులారా, ఎక్కువ ప్రార్ధన చేయకుండా మీరు పరలోకానికి వెళ్ళవచ్చు. రోజు కేవలం ఒక్క నిమిషం మీరు ప్రార్ధించినా దేవుడు మిమ్మును ప్రేమిస్తాడు. అయితే ఆ ప్రార్ధనలకు, 'భళా నమ్మకమైన మంచి దాసుడా' అనే ప్రశంస మీరు వినరు. సాతాను స్థావరమున్న స్థలములలో అటువంటి ప్రార్ధనలతో మీరు సమృద్ధిగల జీవం కలిగి ఉండలేరు. నూతన నిబంధనలలో పౌలు ప్రార్ధనలను చదవండి. మీరు అలా ప్రార్ధించగలరా? ఆలోచించండి' అని వ్రాసాడో భక్తుడు. నేటి నుండే మీ ప్రార్ధన జీవితం సరి చేసుకుని, సమర్ధవంతమైన ప్రార్ధన అనుభవంతో ప్రభువు రాక కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రార్ధనాత్మను దయ చేయును గాక! -

 పి.ఉపేందర్‌