వాక్యసందేశముPost Date:2014-11-08//No:91

జవాబుదేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చూడటం లేదా? ఇంత బలత్కారం జరుగుతుంటే మౌనంగా ఎందుకు ఊరుకుంటున్నాడు? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు నేటి సమాజంలో ఎందరో అడుగుతున్న ప్రశ్నలివి. ప్రతి తరంలో ఇదే పరిస్థితి. మనుష్యులు, మనుష్యులు చేసిన వాటిని పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటారు గానీ, కాలం వెంట దేవుడు చేసిన కార్యాలను, చేస్తూ ఉన్న కార్యాలను పట్టించుకోకపోవటం ఎంతో విచిత్రం. నేను ఈ మాటలు వ్రాస్తుండగానే ఒక చెల్లి ఫోన్‌ చేసి 'అన్నా! నా విషయంలో దేవుడెందుకు మౌనంగా ఉంటున్నాడు' అని అడిగింది. అవమానింపబడేవాళ్లు, మోసగింపబడుతున్నవాళ్లు, అన్యాయం అయిపోతున్న వారందరి ఆక్రందనే ఇది. తమ వేదనలో ముసిరిన కృంగుదల, నిరాశమేఘాలు, కమ్మిన అసహాయపు దుఃఖాశ్రువులు, జరిగిన, జరుగుతున్న దేవుని కార్యాలను మన అంతరంగానికి మరుగుచేస్తాయి.

షిలోహులో ఆరోజు పరిస్థితి ఇదే. మందిరానికి వచ్చేవారి అంతరంగం అయోమయంపాలై యాజకుని పిల్లలు చేస్తున్న ఆగడాలు ఇదేమిటి? దేవుని ప్రజలను బలత్కారం చేస్తూ, వారే పాపంలోకి నెట్టేస్తుంటే దేవుడేం చేస్తున్నాడు? అర్పణలు బలవంతంగా తమ ఇష్టానుసారం, మృగాలవలే దోచుకుంటుంటే దేవుడెందుకు చూస్తూ వీళ్లను ఏమీ చెయ్యకుండా ఊరుకుంటున్నాడు? ఏలీ మౌనంగా మిన్నకుండిపోతే, దేవుడూ మౌనంగా ఉండిపోతాడా? ఆకాను పాపం, కోరహు తిరస్కారం, మిర్యాము, అహరోనుల తిరుగుబాటుపై వెంటనే శిక్ష విధించిన దేవుని రోషం తగ్గిపోయిందా? న్యాయాధిపతి మౌనంగా, పట్టీపట్టనట్టుగా ఎందుకుంటున్నాడు? దేవుడేడి? ఆయన కార్యాలేవి? ఇవే మాటలు పల్కి ఉండరా?

అంతా చూస్తున్న దేవుడు, అన్నింటిని వింటున్న దేవుడు తన స్వరం వినిపించేందుకై ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనకు అందుబాటులో ఉండే ఆయన పనిముట్టు కొరకు ఆయన నిలచి చూస్తున్నాడు. సమూయేలు నిద్రలో సైతం పిలిస్తే (యజమానికి) పనిచేయగల మెలకువ గలవాడయ్యాడు. షిలోహును దేవుడు మళ్లీ దర్శించాడు. తన స్వరం వినిపించాడు. ఇదెంత విచిత్రం ఎన్నో ఏళ్లు సేవ చేసిన ఏలీ అక్కడే ఉండగా, అనుభవజ్ఞుడైన వానితో కాక, బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు! ఏళ్లు, అనుభవం, ఒకప్పుడు పలికిన మాట ఖచ్చితంగా నెరవేరిన పరిస్థితి కాదు దేవునికి కావలసింది. ఆయన వాడుకొనుటకు అర్హమైన పాత్రగా పరిశుద్ధతలో కొనసాగటం, ఎల్లప్పుడూ ఆయనకు అందుబాటులో ఉండటం ఇవి ఆయన కోరుకునేవి. ఒకప్పుడు వీరులే కావచ్చుగాక, నేడు మనం ఏ రీతిగా ఉన్నాం? ఒక్కమారు విశ్వాసులమైన మనం పరిశీలించుకోవాలి.

ప్రజల ప్రశ్నల పరంపరకు దేవుడేడి? అని అడిగిన దానికి ఆయన జవాబు ఇస్తున్నారు - 'ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను. దానిని వినువారి చెవులు గింగురుమనును. 'ఆ దినమున' ఏలీ యొక్క యింటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును. దానిని చేయ మొదలుపెట్టి ముగింతును' (1 సమూ 3:11,12). ఎంతోకాలంగా ప్రజల అంతరంగంలో ప్రశ్నార్ధకంగాను, ఆశ్చర్యార్ధకంగాను, అయోమయంగాను ఉన్న పరిస్థితికి దేవుడు జవాబిచ్చాడు. ప్రజల మనోభావాలకు, చారిత్రాత్మక ప్రశ్నలకు జవాబివ్వటానికి ఒక్కరోజు చాలని, ఒక దినమున ఆరంభించి ఆ దినాన్నే ముగిస్తానని ప్రభువు చెప్పారు. తెల్లవారింది, ఏలీ సమూయేలుతో దేవుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. 'సెలవిచ్చినవాడు యెహోవా. తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక!' (1సమూ 3:18) అన్నాడు. ఓ తండ్రి అంతరంగం దేవుని తీర్పు ప్రకటించబడినపుడు ఎలా ఉంటుంది? దేవుని సేవచేసే వ్యక్తి కుమారుల ప్రవర్తన తెలిసిన వ్యక్తి, ఆ పసివాడి ముందు బింకంగా మాట్లాడాడా? లేక నిర్వేదంతో అలా అన్నాడా? ఏమో, దేవుని ఎదుట తన తప్పునైనా ఒప్పుకోలేదు. తన పిల్లల విషయమై విజ్ఞాపన చెయ్యలేదు. పిల్లల ప్రవర్తనను చక్కదిద్దే ప్రయత్నంలో రోషం తెచ్చుకోలేదు. నిర్లిప్తంగా ఏం జరిగితే అదే జరుగుతుందిలే అనే వైఖరిని వెల్లడించాడు. బలిచేత, నైవేద్యంచేత కాని పని పశ్చాత్తాపంతో జరుగుతుందని ఏలీకి తెలియదా? పిల్లల మొండివైఖరి ఎరిగినవాడు మౌనమైపోయాడేమో, దహించే తీర్పు కోసం ఎదురు చూస్తుండటం ఎంత కష్టమైన పని. రోజులు గడిచేకొద్దీ దేవుని తీర్పు ఎప్పుడు హఠాత్తుగా మీదపడుతుందోననే భయం ఆ వృద్ధుని అంతరంగాన్ని ఎంత కలచివేసినా ఏం చెయ్యగలడు? కొందరు పరిస్థితులకు, మానసిక దౌర్భల్యానికి బందీలు, తెలిసి ఉండికూడా వెలుపలికి రాలేరు. దేవుడు ఇట్టి స్థితి నుండి మనలను కాపాడునుగాక!

లోతుకు తీర్పును గురించి ఆ రాత్రి తెలియజేయబడింది కానీ ఏలీకి ఎంతో ముందు తెలియజేయబడింది. తీర్పు నోవహుకు ఎంతో ముందు తెలియజేయబడింది. తన కుటుంబాన్ని అతడు సిద్ధపర్చుకోగలిగాడు కానీ ఏలీ తన కుటుంబంలో ఎవరినీ సిద్ధపర్చలేకపోయాడు. తన కోడలికి సైతం ఈ మాట చెప్పాడా? ఆమె దైవభక్తి, దైవభయం, దేవుని మహిమను గురించి తెలిసిన వ్యక్తిగా కనిపిస్తుంది. అయినా ఏం చెయ్యలేక పోయింది. దృష్టిమందగించిన ఓ వ్యక్తి దృష్టి సరిగానున్న మరో వ్యక్తి ఆ యింట ఉన్నా, ఆ యింటి పరిస్థితులు చక్కదిద్దలేనివిగానే మిగిలిపోయాయి. 'న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు.... నికను ఉండును' (హెబ్రీ 10:27).
జవాబు
ప్రస్తుతం మనకు దేవుని చర్యలు అర్ధంకాకపోయినా, కాలం వెంట చెవులు గింగురుమనేట్లు, కళ్లు బైర్లు కమ్మేట్లుగా ఆయన కార్యం చేసిన రోజు మనం నిశ్చేష్టులమై, నోటమాట రాక..... ఆయన ఎవరికి తీర్పు తీర్చాడో.... వారిపై మనకే జాలి కలుగుతుంది. అయ్యో! నేనెందుకు దేవుడ్ని ప్రశ్నించానా అని మనకు మనమే వాపోతాం.

షిలోహులో ఏలీని గురించి దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడే రోజు వచ్చింది. యుద్ధంలో నుండి షిలోహులోని యాజకులకు మందసం తీసుకురమ్మని కబురు వచ్చింది. గుడారం యాత్ర చెయ్యటం లేదు. దానికి ఒక స్థిరమైన స్థలం ఏర్పాటు చెయ్యబడింది. మందసాన్ని కదిలించటం....! సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్లవలసినది. పరిశుద్ధ స్థలములోకి ఏ భయం లేకుండా వెళ్లి, వాక్యవిరుద్ధంగా మందసాన్ని వెలుపలికి మోసుకొచ్చారు. మోషేచేత దేవుడు చేయించిన మందసమది. శ్రేష్ఠులైన యాజకులు మోసిన మందసమది. కానీ నేడు వ్యభిచారులు, దైవద్రోహులు, బలత్కారులు ఆ మందసాన్ని మోస్తూ యుద్ధరంగానికి వెళ్లారు. వాళ్లు పాపంలో నిలిచియుండి మందసాన్ని మోస్తున్నారు. దేవుని భయంలేని వ్యక్తులు వాళ్లు. 'దేవుడు ఏం చెయ్యగలడు? ఇన్ని చేసినా ఏం చేసాడు? ఇప్పుడేం చేస్తాడు?' అనుకుంటూ, సేవ నటనగా, భుక్తికోసం చేసే పనిగా, ప్రజలను మోసగించే ప్రక్రియగా.... (ఏం వ్రాయను, రాస్తున్న నా గుండె మండుతుంది, నా ఎముకలలో మంట) సాగిపోతున్నారు.

నేటి నా భయాలకు కారణం ఇదే. నేడు వాక్యోపదేశకులుగా పిలువబడుతున్న వాళ్లను చూస్తుంటే, భారతదేశంలో సేవకు ముగింపు రాబోతుందా? మందసం పట్టుబడిన షిలోహు పరిస్థితి మనకు దాపురించబోతుందా? దీపస్థంభం ఆరిపోబోతుందా? ఎవరు ప్రజల ముందు నిలబడి మందసాన్ని (దేవుడు విడిచి పెట్టినా) మోస్తూ ఇంకా మీ మధ్య దేవుడున్నాడని నటనతోను, కార్యక్రమాలతోను, విన్యాసాలతోను, ఆడంబరాలతోను ప్రజలను మోసగిస్తూ తాము యాజకులమేననే భ్రమలో కొనసాగుతున్నారు గదా! పర్యవసానం ఏమిటి?

ప్లీజ్‌! ఈ రోజైనా పశ్చాత్తాపపడండి. రాబోయే పర్యవసానం సేవకుల మూలంగా ప్రజలందరికీ ఓటమిగా, అవమానంగా మారకుండా కన్నీటితో ఆయన పాదాలపైబడి క్షమించమని అడిగి నడతను సరిచేసుకుని, పనిచెయ్యటం కొంతకాలం ఆపి, మళ్లీ సిద్ధపడటం ఎంతైనా అవసరం. దయచేసి ఈ నా మాటలు కొట్టి పారెయ్యకండి. దూరంగా భారతదేశంపైకి క్రైస్తవ విరోధ మేఘాలు కమ్ముకోవటం కనిపిస్తుంది. అందుకు కారణం మనం కాకుండా ఉండేందుకు మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను.

మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను సిద్ధపర్చి, కన్నీటి సమయాలను ప్రతిష్ఠిద్దాం. చీకటి క్రియలను బంధించి, ఆత్మల రక్షణకై నడుం కడదాం. నటన వలన, వాక్పటిమ వలన మేలు కలుగదు. ఆత్మ నింపుదల, అభిషేకం వలన మాత్రమే మేలు కలుగుతుంది. అపవిత్రమైన పాత్రను దేవుడు వాడుకోడు. వాడబడుతున్నట్లు జరుగుతున్న కార్యమంతా నటన, తీర్పుకు కూర్చుకుంటున్న పొట్టు.

మందసం యుద్ధభూమికి వెళ్లింది. ప్రజలు ఆర్భటించారు. 'భూమి ప్రతిధ్వనించేట్లు గొప్ప కేకలు వేసారు' (1సమూ 4:5). అంతా సంభ్రమం, దేవుని ప్రజలు, శత్రువులు ఇద్దరూ 'మహా బల శూరుడు యుద్ధ రంగంలోకి వచ్చాడు' అని అనుకున్నారు. కానీ యుద్ధంలో అంచనాలు తారుమారయ్యాయి. ఫలితం దైవ విరోధులకు జయం, మూలకారకులెవరు? 'మందసం' దైవ విరోధుల చేతుల్లో.....! కారణం ఎవరు?

ఏలీ, హోఫ్నీ, ఫినేహాసులు అని చెప్పేయటం సుళువు కానీ రేపు ఆంధ్రప్రదేశ్‌లో, భారతదేశంలో దేవుని సేవకు ఇదే పరిస్థితి దాపురిస్తే కారణం, కారకులు ఎవరు? అయ్యో... నేడైనా మనలను మనం సరిచేసుకుందాం. మన చేజేతులా చీకటికి పట్టం కట్టే ప్రయత్నం, దేవుని నామం అవమానించబడే పరిస్థితి రాకుండా ఉండేందుకు మనల్ని మనం వాక్య ఉదకంలో కడుగుకుందాం, పరిశుద్ధాత్మ చేత పవిత్రపర్చబడదాం. లేకుంటే రాబోతున్న రోజులు..... తీర్పు..... పెల్లున దిగే రోజులే.

ఏలీ కుమారులిద్దరు కత్తిచేత చంపబడ్డారు. మందసం భుజాలమీద ఉండగానే వారి తలలు తెగనరకబడ్డాయి. వీళ్లను హతసాకక్షుల జాబితాలోకి చేర్చుతారా? ఇది దేవుని తీర్పు.

మందసం ఫిలిష్తీయుల చేత చిక్కింది. బెన్యామీనీయుడొకడు తన మీద ధూళి పోసికొని, చినిగిన బట్టలతో పరుగెత్తుకుంటూ షిలోహులో ప్రవేశించాడు. అప్పుడు 1 సమూయేలు 2:27లో దైవజనుని ద్వారా హెచ్చరిక పంపిన దేవుడే, ఇప్పుడు 1 సమూయేలు 4:12లో బెన్యామీనీయుని ద్వారా, ఆనాడు లోబడకపోవటం వలన నేడు కలిగిన పర్యవసానం ఏలీకి వర్తమానంగా పంపాడు. సమూయేలుతో తీర్పు ప్రకటించిన దేవుడు, దానిని నెరవేరుస్తున్న రోజు ఇదే.

ఏలీ గుండెలవియుచూ మందసం కోసం ఎదురు చూస్తున్నాడని 1 సమూయేలు 4:13లో వ్రాయబడింది. ఇప్పుడు గుండెలవిసి ప్రయోజనం లేదు. దేవుడిచ్చిన సమయాన్న గుండెలవియ చేసుకుంటే, వస్త్రంకాక హృదయాన్ని చింపుకుంటే పరిస్థితి, పర్యవసానం వేరుగా ఉండేది. కుమారుల మరణం, మందసం పట్టబడిన సంగతి విని 98 సం||ల వయస్సులో పీఠం పైనుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. (షిలోహులో సమూయేలు జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నాడు. నేడు జరిగినది కళ్లారా చూస్తూ, దేవుని మాట ఎంత ఖచ్చితమైనదో, ఆయన తీర్పులు ఎంత బలమైనవో గ్రహించి మరింత విధేయత, మరింత అంకితభావం అలవర్చుకుని ఉంటాడు)

మెడవిరిగి చనిపోవటం ఎంత బాధాకరమైనదో, తొలిచూలు జంతువులలో యజమాని విడిపించటానికి ఇష్టపడని గాడిద మెడ విరిచి చంపెయ్యాలి (నిర్గమ 34:20). ఇది ప్రత్యక్ష గుడారం ఎదుట జరగాలి. గాడిదను విడిపించాలంటే గొర్రెను అర్పించాలి. అనాది కాలములోనే మన కొరకు వధించబడటానికి ఏర్పరచబడిన గొర్రెపిల్ల సిద్ధం. కానీ అతనిని విమోచించే మనస్సు అతని యజమానికి లేదు. అయ్యో ఇదెంతటి దుస్థితి.

చూస్తున్న సమూయేలు చేష్టలుడిగి, పరలోకంవైపు కన్నులెత్తి.... కన్నీళ్లు కారుతుండగా..... తీర్పులను చూస్తుండిపోయి ఉంటాడు.

ఇంటిలో నుండి చావుకేక, ఈ కాబోదు.... అంటూ.... యుద్ధరంగంలో రెండు శవాలు, షిలోహు గుడారం వద్ద రెండు శవాలు. దేవుడేడి? ఆయన చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? అనే ప్రశ్నలకు దేవుని తీర్పే జవాబు. ఆ వర్తమానం విన్న ప్రతివాని చెవులు గింగురుమన్నాయి.... దేవుడు న్యాయాధిపతి, ఆయన చేతిలో పడటం భయంకరం. 

- పి.వెంకటరత్నం