వాక్యసందేశముPost Date:2014-11-01//No:90

ప్రవక్తయైన సమూయేలు ఆత్మను కర్ణపిశాచిగల స్త్రీ యెట్లు రప్పింపగలిగెను?మృతులై యీ లోకమును విడచినవారికిని యిహమున సజీవులుగా నున్నవారికిని సహవాస సంబంధములకు వీలున్నదా? మృతులు తిరిగి భూలోకమునకు వచ్చి సజీవులతో మాట్లాడగలరా? సోదెగాండ్రు కర్ణపిశాచము గలవారు. మాంత్రికుల సలహాను తీసుకొనవచ్చునా? భక్తుల ఆత్మలపై సాతానుకు వాని అనుచరులకు అధికారము గలదా? పై ప్రశ్నలు ప్రతి క్రైస్తవుడును తెలిసికొనవలసినవి. 1 సమూయేలు 28వ అధ్యాయమున సౌలు చరిత్రలో యీ విషయములు కొన్ని బయలు పడుచున్నవి. పై ప్రశ్నలకు జవాబును తెలిసికొనక పూర్వము 1 సమూయేలు 28వ అధ్యాయమును. లూకా 16వ అధ్యాయమును బాగుగా చదువుడు. కర్ణ పిశాచిగల స్త్రీ ప్రవక్తయైన సమూయేలు ఆత్మను ఆత్మలోకము నుండి యీ లోకమునకు తీసుకొని రాలేదనుటకు బలమైన కారణములు గలవు. వాక్యమును పైపైన చదువక వాక్యము యొక్క అంతర్యములోనికి వెళ్ళుట అవసరమైయున్నది.

1. భవిషద్విషయములను బయలుపరచుటలో దేవుని పద్ధతి : దేవుడు తన చిత్తమును మూడు విధములుగ బయలు పరచుచుండెను. స్వప్నము ఆది 20:6. ఊరీము సంఖ్యా 27:21. ప్రవక్తలు 2 సమూయేలు 7:1-13. సౌలు దేవుని నుండి తొలగినందున దేవుడు తన చిత్తమును బయలుపరచుట మానెను. 'సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను యేమియు సెలవియ్యకుండెను. '1 సమూయేలు 28:6. ప్రవక్తయైన సమూయేలు బ్రతికివున్నప్పుడు అతని ద్వారా దేవుడు తన చిత్తమును బయలుపరచెను. దేవుని హెచ్చరికను సౌలు పెడచెవిని బెట్టెను. అందుచేత దేవుడు తన చిత్తమును బయలు పరచుట మానెను. దేవుని నుండి వెనుకకు జారినవాడు గ్రహింపలేడు.

2. దేవుని సహాయము పొందలేని సౌలు యిప్పుడు సాతాను పద్ధతి ననుసరించుచున్నాడు : 'అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి. నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయీయగా వారు 'ఏన్దోరులో కర్ణపిశాచముగల యొకతె యున్నదని అతనితో చెప్పిరి'. 1సమూయేలు 28:7. ఒకప్పుడు సౌలు సోదేగాండ్రను, కర్ణపిశాచము గల వారిని మాంత్రికులను, దేశములో నుండకుండ నిర్మూలము చేసెను దీనికి ఆ స్త్రీయే సాక్ష్యమిచ్చుచున్నది. ఇప్పుడుపడిన స్థితిలో సౌలు తాను ఒకప్పుడు దేనిని విడచెనో దానిలో తిరిగి ప్రవేశించుచున్నాడు. ఇదియే ప్రతివాని జీవితమునను సంభవించును. 2 పేతురు 2:21-22. 'ఆ స్త్రీ - చిత్తము, సౌలు చేయించినది. నీకు తెలిసినది కాదా. కర్ణపిశాచములు గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలనము చేసెను గదా? నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను.' 1 సమూ 28:9. ఈ స్త్రీ సౌలునకెట్టి సహాయము చేయగలదు?

 3. సాతానునకు పిశాచులకు దైవజనుల ఆత్మలపై అధికారముగలదా? కర్ణపిశాచిగల స్త్రీని సౌలు కోరినది చూడుడి. 'ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలయునని యడుగగా అతడు సమూయేలును రప్పింపవలెననెను' 1 సమూ 28:11. ఆ స్త్రీ దయ్యముల ఆత్మలను రప్పించి యింత పర్యంతము మోసము చేయువచ్చియుండెను. అందుచేత సమూయేలు ఆత్మను కూడా ఆమె రప్పింపగలదని సౌలు పడిన స్ధితిలో తలంచియుండును. అది నిజము కాదు. సమూయేలు ఆత్మను కర్ణపిశాచి పైకి తెప్పించియుంటే పరిశుద్ధుల ఆత్మలపై సాతానుకును వాని అనుచరులకును అధికారము గలదని చెప్పవలసియుండును. ఇది సరికాదు. దేవుని వాక్యము దేనికి తోడ్పడుట లేదు. కర్ణ పిశాచిగల స్త్రీ 'నేనెవరిని రప్పింపవలె'నను మాట ఆమె చెప్పినందున సమూయేలు ఆమె మాటవలననే వచ్చెనని తలంచరాదు. అట్లు చెప్పినచో, పాపులేమి, పరిశుద్ధులేమి మృతులైన వారందరిపై, కర్ణపిశాచికి అధికారమున్నదని చెప్పవలసియుండును. ఇది మోసము, ఇది పొరపాటు. దేవుని వాక్యమునకు విరోధము పరిశుద్ధులేమి, మృతులేమి మృతులైనవారి ఆత్మలపై సాతానుకును వాని అనుచరులకును అధికారమేలేదు. దేవునికి మాత్రమే అధికారముగలదు. ప్రకటన 1:18; 2 పేతురు 2:10. మృతులైన వారిని లేపు అధికారము మృత్యుంజయుడైన క్రీస్తునకు మాత్రమే దేవుడిచ్చెను. పరిశుద్ధులు క్రీస్తు ఆగమనమున ఆయనను కలిసికొనుటకై 1 థెస్స 4:17-18; పాపుల న్యాయ తీర్పుకై పాపల తీర్పునందు, ప్రకటన 15:11-20; లేచెదరు. మృతుల ఆత్మీయు క్రీస్తు వశమున నున్నవి. సమాధులలో నున్న మృతుల శవములు కూడ క్రీస్తు వశములో నున్నవి. యోహాను 5:27-29. కర్ణపిశాచిగలవారు, సోదెగాండ్లు, మాంత్రికులు డబ్బు ఆర్జనకై వేషము వేసికొనిన దయ్యముల ద్వారా మానవులను మోసగించెదరు. అందుచేత యెషయా 3:19-20లో అట్టివారి ననుసరింపరాదని దేవుడాజ్ఞనిచ్చెను. ఒక వేళ ఆ వృద్ధుని కర్ణపిశాచిగల స్త్రీ రప్పించియుంటే అతడు సమూయేలు కాదు సమూయేలు వేషము ధరించిన దయ్యమే అయియుండును.
ప్రవక్తయైన
4. దేవుడు దైవ పద్ధతిని సౌలుతో మాట్లాడుట మాని దయ్యముల పద్ధతిని తన చిత్తమును బయలుపరచునా? ఇది విరుద్ధమైనదే. 'సమూయేలు - నన్ను రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలునడుగగా, సౌలు బహు శ్రమలో నున్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారా నైనను నాకేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను' 1 సమూ 28:15. పై వచనమును బట్టి కర్ణపిశాచి ఆయనను తొందరచేసినందున వచ్చినట్లు లేదు. సౌలు తొందరను బట్టి వచ్చినట్లున్నది. అందుచేత కర్ణపిశాచి వలన సమూయేలు రాలేదు. మరియు దేవుడు కర్ణపిశాచి నాశ్రయించినందులకై అతని శిక్షించుచున్నాడు. 'ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణచేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయువారిని వెదకినందున సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను.' 1 దిన 10:13-14 కర్ణపిశాచి నాశ్రయించిన సౌలును యింత ఘోరముగా శిక్షించిన దేవుడు ఆ స్త్రీకి ప్రవక్తను లోపరచి సౌలుతో మాట్లాడ సెలవిచ్చునా? అది అసంభవము.

5. మృతుల ఆత్మలు సజీవులైన వారితో సహవాస సంబంధము గలిగి యుండుటకు వీలున్నదా? అను మరియొక ప్రశ్న తేలుచున్నది. లూకా 16 అధ్యాయము ఈ ప్రశ్న నాలోచించుటలో మనకు కొంత తోడ్పడుచున్నది. క్రీస్తు నందు నిద్రించి పరదైసులోనున్న భక్తుల ఆత్మలు పాపమునందు మృతులై హేడెస్‌లో నున్నవారి దగ్గరకు వెళ్ళుటకు వీలులేదు. 'అప్పుడితడు (ధనవంతుడు)... తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము... అందుకబ్రహాము... మీ యొద్దకు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటిపోజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను' లూకా 16:23-26.

భక్తుల ఆత్మలు తిరిగి యీ లోకమునకు వచ్చి సజీవులై ఆత్మలతో సంబంధము కలిగి యుండును వీలులేదు. 'అప్పుడతడు... నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. మృతులలో నుండి యొకడు వారి యొద్దకు వెళ్ళిన పక్షమున వారు మారుమనస్సు పొందుదురనెను. అందుకతడు మృతులలో నుండి యొకటి లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను' లూకా 16:27-31.

పై సత్యములను క్రీస్తునాథుడే ధృడపరచెను. ఆయా సమయములందు ప్రవక్తలు కొందరిని లేపిరి గాని వారు లేచిన పిదప తిరిగి జీవించిరి. ఈ రీతిగా సజీవులతో మాట్లాడి తిరిగి వెళ్ళిపోయినట్లుగ పడదు.

అయితే పాతనిబంధనలో ఒకసారి, నూతన నిబంధనలో పై సత్యమునకు ప్రతికూలముగా జరిగినట్లు చూడగలము :- 1. సమూయేలు వచ్చి సౌలుతో మాట్లాడుట. 2. ప్రభువు రూపాంతర సందర్భమున మోషే ఏలీయాలు ప్రభువుతోను ముగ్గురు శిష్యులతో నుండుట ఈ రెండు సందర్భములలో పరిశుద్ధులే వచ్చినట్లు కన్పించుచున్నది.

సౌలుతో మాట్లాడినది సమూయేలు రూపమునున్న దయ్యము కాదు గాని సమూయేలు అని గుర్తింపవలయును. ఏలననగా పైకివచ్చి వాడు సమూయేలు అని వ్రాయబడియున్నది. 'అందుకు సమూయేలు.' 1 సమూ 28:16. పరిశుద్ధాత్మయే సమూయేలని వ్రాయించి యున్నాడు. సమూయేలు యిప్పుడు సౌలునకు 1 సమూ 28:16-18. లో యిచ్చిన వర్తమానమును తాను సజీవుడైయుండగా 1 సమూ 15:28లో యిచ్చెను. వేరుకాదు, కొందరు తలంచిన రీతిని వెనుక సమూయేలు యిచ్చిన వర్తమానమును దయ్యములు తెలిసికొని సమూయేలు రూపమున యిచ్చిరందుమా! అదికాదు ఏలననగా మాట్లాడినది సమూయేలు అని పరిశుద్ధాత్మ వ్రాయించి యున్నాడు. 1 సమూ 28:16. సాధారణముగా దేవుడీ పద్ధతి ననుసరింపకపోయినను సర్వశక్తిగల దేవుడే యీసారి సమూయేలును బయటికి రప్పించి తన చిత్తానుసారముగా యీ కార్యమును చేసెను. కీర్తన 77:14. ఆయన కార్యముల రీతిని ప్రశ్నించుట మన పనియైయుండరాదు.

ఆ స్త్రీ సమూయేలును రప్పించలేదు గాని దేవుడే సమూయేలును రప్పించెను. సౌలు సమూయేలును రప్పించమని అడిగెనే గాని ఆ స్త్రీ సమూయేలును రప్పించెనని వ్రాయబడలేదు. 1 సమూ 28:12. అడుగుటను బట్టి అనేకులు ఆ స్త్రీయే రప్పించెనని తలంచెదరు. ఇది పొరపాటు మరియొక విషయము గలదు. సమూయేలును చూచిన వెంటనే ఆ స్త్రీ భయపడుచున్నది. 'ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి - నీవు సౌలువే; నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు'. 1 సమూ 28:12. ఆ స్త్రీ సమూయేలును మంత్రించి పైకి రప్పించియుంటే ఆయనను చూచినప్పుడెందుకు భయపడును? భయపడి యెందుకు బిగ్గరగా కేకవేయును. కర్ణపిశాచి గల స్త్రీ కాదు గాని దేవుడే సమూయేలును రప్పించెను.

 రెండు ముఖ్య ఉద్దేశ్యములతో రప్పించెను :-

1. కర్ణ పిశాచి గల స్త్రీకి బుద్ధి చెప్పుట ఒక ఉద్దేశము. ఆమె మోసము యిచ్చట బయలుపడినది. ఏదో దయ్యపు రూపమున సౌలును మోసగింపజూచుచున్న ఆమె స్థితిని ఆమెకు దేవుడు బయలుపరచెను. వేషము చాటునున్న సౌలును ఆమె గుర్తించలేకపోయెను. పిశాచి వేషము చాటునున్న సౌలును ఆమె గుర్తించలేకపోయెను. పిశాచి వేషము వెనుకనున్న ఆమె నిజ స్థితిని దేవుడామెకు బయలుపరచెను. ఆమె కన్నులు తెరవగా సౌలు 'నీకు ఏమికనబడినదని' ఆమె నడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకివచ్చుట నేను చూచుచున్నాననెను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు - అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.

  'భూమిలో నుండి పైకి వచ్చుట' చూచెను. భక్తులు పై నుందురు; భూమిలో పాపులు, దయ్యములుందురుగదా? యని అడుగవచ్చును. మరియొక సందేహము. అయితే యిదియు తెలిసికొనవలసినదే. క్రీస్తు వారి పునరుత్థానమునకు పూర్వము భూమి క్రింద భాగములోనే భక్తులును, పాపులు నుండెడివారు. వారికి వీరికి 'మధ్య మహా అగాధముంచబడియున్నది' లూకా 16:33. క్రీస్తువారు బల్యర్పణలో ఆయన భక్తులను తనతో పైకి కొనిపోయి పరదైసులో నుంచెను. ఎఫెసీ 4:8, అప్పటి నుండి భక్తులు పరమండలమందు పరదైసులోను లూకా 23:43; పాపులు పాతాళమందు హేడేస్సు నందునున్నారు. లూకా 16:22-23. పై కారణమును బట్టి సమూయేలును గూర్చి దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.

  2. రెండవదిగా, దేవుడు సౌలుకు ప్రత్యేక తరుణమిచ్చుచున్నాడు. ఈ అధ్యాయమునందు చూచిన బహువిషాదకరముగ నున్నది. ఎన్నెన్నో విధములుగ దేవునిని యెడబాసియున్నాడు. :- యెహోవా ఆజ్ఞగైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసెను. 1 దిన 10:13. దేవుడతనికి ప్రత్యక్షతనిచ్చుట మానెను. 1 సమూ 28:6. దేవుని నాశ్రయించుట మాని కర్ణ పిశాచి నాశ్రయించెను. 1 సమూ 2:7. ఇతరులకు భీతిల్లి మారువేషము ధరించెను. 1 సమూ 28:8. మహారాజు పిరికి పందవలె రాత్రియందు స్త్రీ యొద్దకు చేరెను. 1 సమూ 28:8 మోసగించువాడాయెనని కర్ణపిశాచి గల స్త్రీ రాజునే గద్దించుచున్నది. 1 సమూ 28:12. దేవుని జనాంగముపై రాజుగానున్న సౌలు సాతాను సేవకుడాయెను. కర్ణపిశాచి స్త్రీ దగ్గర అన్నపానములు చేయుచున్నాడు. 1 సమూ 28:21-25. యెహోవా సౌలును యెడబాసెను. అతనికి పగవాడాయెను. సమూ 28:14 సౌలు జీవితము ప్రతి విశ్వాసికి అనేకమైన పాఠములను బోధించుచున్నది. దైవ మార్గముల నుండి తొలగి, దేవుని హెచ్చరికలను గైకొనని ప్రతి విశ్వాసి జీవితమున నీ స్థితియే సంభవించును అట్లు వెనుకకు జారినవారికి సంభవించునది 1 కొరింథీ 5:4-5 నందు చూడుడి. 'ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై అట్టివారిని సాతానుకు అప్పగింపవలెను.' సౌలుకు దేవుడు మరణ దండన విధించి సమూయేలు ద్వారా తెలియపరచుచున్నాడు. 'అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తనమాట తన పక్షముగా నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్లు నీ చేతినుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దాని నిచ్చియున్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు యీ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులచేతికి అప్పగించును; రేపు నీవును నీ కుమారులును నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా సమూయేలు మాటలకు సౌలు బహుభయమొంది వెంటనే నేలకు సాష్ఠాంగపడి దివారాత్రము భోజనమేమియు చేయక యుండినందున బలహీనుడాయెను.' 1 సమూ 28:16-29.

3. పైకి వచ్చినవాడు సమూయేలు అయినచో. 'రేపు నీవును నీ కుమారులును నాతో కూడా ఉందురు' అని భక్తుడైన సమూయేలు భక్తిహీనుడైన సౌలుతో యెట్లు చెప్పెను? భక్తులు ఒక చోటుకు, భక్తిహీనులు మరియొకచోటుకు పోదురని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది గదా? కనుక పైకివచ్చిననాడు సమూయేలు కాదుగాని సమూయేలు వేషము ధరించుకొనిన దయ్యమే అని కొందరు తలంచెదరు. దీర్ఘముగా యోచించిన యెడల అది సరియైన తీర్మానముగా కన్పించదు. సౌలు క్రొత్త మనస్సును ప్రవక్తలతోపాటు దైవాత్మనొందినవాడు 1 సమూ 10:9, 10:13. అతని కుమారుడు దైవ ఏర్పాటును గ్రహించి దావీదుతో నిబంధన చేసుకొనెను. 1 సమూ 20:14-16. దావీదు యోనాతానుతో చేసిన నిబంధన ఫలితముగ యోనాతాను కుమారుడైన మెఫీబోషేతు దావీదు బల్లయొద్దనే రాజకుమారులలో ఒకడైనట్లుగ భుజించుచుండెను? 2 సమూ 9:11-13. కావున సౌలును అతని కుమారులు రక్షింపబడలేదని చెప్పలేము. రక్షింపబడిరి. అయిన సౌలు పొరపాటునుబట్టి దేవుడు అతని సంతతిని శిక్షించెనుగాని వారి ఆత్మలు రక్షింపబడి సమూయేలుతో నున్నవి. ఇట్టివారు బహుమానములను మాత్రము పోగొట్టుకొందురు. రక్షణమాత్రము నిత్యమైనది, నిత్యజీవము. 'పునాది మీద ఒకడు కట్టిన పని నిలచినయెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకనిపని కాల్చివేయబడినయెడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడునుగాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.' 1 కొరింథీ 3:14-15. గనుక పైకి వచ్చినది సమూయేలు మాత్రమే.

పై ధ్యానముయొక్క ఫలితమేమనగా:-

1. పైకి వచ్చినది సమూయేలు ఆత్మయే

2. సమూయేలు ఆత్మను కర్ణపిశాచి కాదుగాని దేవుడే పైకి రప్పించెను.

 - జి.ఆర్‌.లార్న్‌