వాక్యసందేశముPost Date:2014-10-24//No:81

నోవహు జల ప్రళయము  (Noah's Flood)

దేవుడైన యెహోవా ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను (ఆది 2:8). ఏదేను నుండి బయలుదేరిన నది నాలుగు శాఖలుగా విస్తరించెను. ఒకటి హవీలా దేశము, రెండవది కూషు దేశము, మూడవది అష్షూరు దేశము, నాలుగవది యూఫ్రటీసు. ఇక్కడే ఈ నదుల లోయలోనే బైబిలు చరిత్ర ప్రారంభమయినది. ఇక్కడే ఆది మానవుడు, అతని సంతానం నివశించారు. ఇసుక దిబ్బలను శిధిలమైన ప్రాచీన పట్టణాలుగా నేడు గుర్తిస్తున్నారు. ఈ దిబ్బల క్రింద అద్భుతమైన మానవ జీవితం, మానవ నాగరికతా రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ దిబ్బలను త్రవ్వుకుంటూ పోయి దాని ద్వారా బైబిలు చరిత్రను వెలికి తీసారు. బ్రిటీషు ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రతినిధి అయిన క్లాడీ జేమ్స్‌ రిబ్‌ 1811 లో బబులోనుకు 50 మైళ్ళ దూరంలో కొన్ని ముద్రలు గల ఇటుకలు, వ్రాత పలకలను కనుగొన్నారు. శిధిలాలలో లక్షల గ్రంధాలున్నాయి. బ్రిటీష్‌, ఫ్రెంచ్‌, జర్మనీ, అమెరికా వారు యూఫ్రటీస్‌, టైగ్రీస్‌ లోయలోని దిబ్బలను త్రవ్వి వేలకొలది శిలా శాసనాలను, స్మృతి చిహ్నాలతో ప్రపంచములోని మ్యూజియములు నింపుతున్నారు.

ప్రధమ మానవుడైన ఆదాము పాపము వలన ఏదేను తోటనుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఆదాము సంతతివారు దానికి దగ్గర ఉన్న టర్కీ, ఐరోపా దేశాల అడవులకు వెళ్ళారు. ఆదాము 130 సం||ల తర్వాత కుమారుని కని షేతు అని పేరు పెట్టెను. షేతు నుండి దాదాపు 10 వంశములు వచ్చాయి. మోతూషెల అనువాడు లెమెకును కని భూమిని యెహోవా శపించినందున మన పని విషయములో ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతని కుమారునికి నోవహు అని పేరు పెట్టెను (ఆది 5:25). నోవహు అనగా విశ్రాంతి, ఆదరణ. నరుల భూమిమీద విస్తరింపనారంభించినపుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహము చేసుకొనిరి. నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయ తలంపులు చెడ్డవనియు యెహోవా చూచి భూమిమీద నరులను చేసినందుకు తన హృదయమున నొచ్చుకొనెను (ఆది 6:8). దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది. నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది. వారిని భూమితో కూడా నాశనము చేయుదుననెను. నోవహు నీతిపరుడై దేవునికి విధేయుడై యుండెను (ఆది 6:9, హెబ్రీ 11:7). దేవుని మార్గము వీడిన వారికి కలుగు ఆపదలు అనేకములు. ఆయనను అనుసరించువారికి ఎట్టి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆయన రక్షింపగలడు అనే సత్యాన్ని దేవుడు నోవహుతో చేసిన నిబంధన ద్వారా గ్రహిస్తున్నాము. నేను భూమి మీదకు ప్రచండ వర్షము రప్పిస్తాను. అది భూమిమీద ప్రాణులన్నిటిని నాశనము చేయును గాన నీవు నేను చెప్పిన ప్రకారము ఓడను 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు, కిటికీ తలుపులతో 3 అంతస్తులు గలది నిర్మించు. నీ భార్య, కుమారులు, వారి భార్యలు, జంతువుల నుండి, పకక్షులు నుండి ఆడ, మగ జతలుగా తీసుకొని వెళ్ళు. అన్ని రకాల ఆహార పదార్ధాలు సేకరించుమని యెహోవా చెప్పగా. తు.చ. తప్పకుండా దేవుడు చెప్పినదంతా చేశాడు (ఆది 6:13-22). ఓడరేవు అధికారులు ఆ ఓడ కొలతలు Marine Technology ప్రకారము అంగీకార యోగ్యమైనవిగా తెలుపుచున్నారు.

బబులోనియుల సాంప్రదాయము ప్రకారము నోవహు ఫారా నివాసి. ఇది యూఫ్రటీసు నది ఒడ్డున ఉన్నది. ఇది ఏదేను తోటకు 70 మైళ్ళ దూరము. క్యూనిఫాం లిపిలో వ్రాయబడ్డ మట్టి పలకల ద్వారా ఓడ నిర్మాణానికి తన అమూల్యమైన దినాలను వెచ్చించి వుంటాడని గ్రహిస్తున్నాము. అవిశ్వాసులైన వారు వెక్కిరిస్తూ ఉండగా నోవహు తన మనోధైర్యముతో దేవుని ఆజ్ఞ ప్రకారము ఓడను నిర్మించి ఆయన కుటుంబముతో ఆ ఓడలో ప్రవేశించాడు (ఆది 6:66). మిగిలిన ప్రజలు దేవుని మాట లక్ష్యపెట్టలేదు. 40 పగళ్ళు, రాత్రులు వర్షం కురిసెను. ఆ ప్రచండ జలములు భూమిమీద ప్రబలినందున గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను. నేలమీదనున్న సమస్త రకములైన జీవరాసులన్నియు (నోవహుతో ఉన్నవి తప్ప) తుడిచివేయబడెను. అప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరములు. 2వ పేతురు 3:6 ప్రకారము ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తి హీనుల తీర్పును, నాశనము జరుగు దినము వరకు నిలువచేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నదని ఎరిగియున్నాము (ఆది 9:13-17). దేవుడు మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును, భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండునని, భూమిపైకి మేఘము రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడునని, అప్పుడు నాకును నీకును సమస్త జీవరాసులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందునని చెప్పెను. గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్ళురావు. నాకును భూమి మీదనున్న సమస్త శరీరకులకు మధ్య నేను స్థిరపరచిన నిబంధన గురుతు ఇదేనని నోవహుతో దేవుడు చెప్పెను. ఈ జలప్రళయం ద్వారా దేవుడు చెడును ఏ విధంగా నిర్మూలించాడో ఆయనకు విధేయులైనవారిని ఎలా రక్షించాడో ఇక్కడ తెలుసుకుంటున్నాం.

.


నోవహు
జలప్రళయానికి ముందు వ్రాయబడిన కొన్ని శాసనాల ద్వారా అప్పటి ప్రజల దుష్టత్వము అర్ధమౌతుంది. కీషు దగ్గర బొమ్మలతో వ్రాయబడిన పలక, ఫారా వద్ద 3 శాసనాలు డా||స్క్మిడ్‌ గారికి దొరికాయి. దేవుడు కయీనుపై వేసిన ముద్రతో ప్రారంభమైనదీ బొమ్మల వ్రాత. మట్టి పాత్రలపై, పలకలపై చిత్రాలు చెక్కబడినాయి. స్థిరపడిన జనాంగమునుండి కుటుంబాలు విడిపోయి, మనుష్య నివాసాలు లేని ప్రాంతాలలో స్థిరపడి అన్ని రకములైన విగ్రహారాధన జరిగించుచూ విశ్వమే దేవుడని విగ్రహాలను పూజిస్తూ న్యాయవిరుద్ధమైన పారంపర్య ఆచారాలను నాటి ప్రజలు అవలంబించారు. మరియు విగ్రహారాధికులైన వారు జలప్రళయము దేవుని ఉగ్రతకు కారణమని స్వీకరింపక వారి దేవుళ్ళు, దేవతల వివాదాల వలన జరిగిన విపత్తని సుమేరియనున్‌, బాబిలోనియను, అక్కాడియను పలకలద్వారా వ్రాసి నిజదేవునినుండి దూరమయ్యారు. జలప్రళయమునకు ముందు 10 మంది రాజులు ఉన్నారని, జలప్రళయం తర్వాత ఆర్మేనియా నుండి ప్రజలు పయనించి ఇరాక్‌ ప్రవేశించారని అక్కడ ద్రాక్షతోటలు పెంచబడినాయని, నోవహు ద్రాక్షరసము త్రాగి మత్తుడయ్యాడని కూడా తెలుసుకుంటున్నాము (ఆది 9:21). ఇతని ద్వారానే మానవ జాతి పునరుత్పత్తి ఆయెను. 10 తరాలలో ఒక్క కుటుంబము జనంతో భూమిని నింపింది. మెసపొటేమియానుండే మరలా జనం పెరిగింది. దేవుడు ఇతనితో చేసిన నిబంధన గూర్చి యెషయా 54:9 లో భక్తిని గూర్చి యెహెజ్కే 14:14 లో ఉదహరింపబడెను. ఓడలో నున్నవారు రక్షింపబడుట బాప్తిస్మము ద్వారా కలుగు రక్షణకు సూచనగా నున్నది (1 పేతురు 3:26). జలప్రళయము ద్వారా 150 దినముల వరకు భూమిమీద నీళ్ళు ప్రచండముగా ప్రబలెను. ఆ తరువాత నీళ్ళు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ 17000 అడుగుల ఎత్తుగల ఆరారతు కొండ మీద నిలచెను. జల ప్రళయము వచ్చినదనటానికి విజ్ఞానశాస్త్రపు, పురావస్తుశాస్త్రపు శాస్త్రజ్ఞులు ఋజువులను తెలుపుచున్నారు.

1) భూ రేఖ మార్పువలన జలప్రళయం వచ్చినది (Flood is caused by a change of Earth Axis) :

భూమి ఒక కవచముగా (Outer crust) నున్నది. భూగర్భాన్ని (Inner Core) గా పరిగణిస్తారు. భూమికి ఉత్తర దక్షిణ ధృవాలు (North pole & South pole) ఉన్నాయి. ఈ భూగర్భ రేఖ కోణము మార్పు చెందినప్పుడు ఈ ధృవాలకు భంగము వాటిల్లి జలప్రళయము సంభవిస్తుంది. ఈ భూగర్భ రేఖ మార్పువలన కలిగిన వత్తిడిచేత జలములు ఎంతో ఎత్తుకు ఎగిసి పొంగిపొర్లాయి. పర్వతములు కూడ మునిగిపోయాయి. 'కొండలకు పైగా నీళ్ళు నిలిచెను... అవి మరల వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి' అని దేవుడు ఆజ్ఞాపించెను (కీర్తనలు 104:6-9).

2) ఇది ప్రపంచ జల ప్రళయముగా గుర్తింపు (The World Wide Flood) :

సముద్రముల విస్తీర్ణము భూభాగము కంటే రెండు రెట్లు ఎక్కువ. ఆ సముద్రములు తమ పాత భూకక్షనుండి మారిన భూమధ్య రేఖ వరకు పొంగి పొర్లాయి. కావున అరుణోదయ స్థలము మార్పు చెందింది (యోబు 38:12-15). నీళ్ళలో నుండి సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెనని, వారు బుద్ధిపూర్వముగా మరతురనియు, ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెననియు, ఇప్పుడున్న ఆకాశము, భూమియు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నదని వాక్యం తెలుపుచున్నది (2 పేతురు 3:5). జలప్రళయము వారందరినీ కొట్టుకొనిపోవువరకు ఆ నాటి ప్రజలు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును (మత్తయి 24:39).

3) మార్పు చెందిన భూగర్భ రేఖ వాస్తవికత (The Evidence of change of Earth Axis)

ప్రపంచమంతటా సముద్ర జలాల మట్టములో మార్పులు వచ్చాయి ఆరారతు పర్వతానికి 32 అడుగుల ఎత్తులో సముద్ర జలాలు నిలిచాయి. ఈ Paleomagnetism వలన మానవ మనుగడలో లేక చరిత్రలో ఎన్నో మార్పులు సంభవించాయి. 5000 BC లో జరిగిన జలప్రళయము తర్వాత జీవరాశులు అంతరించి తిరిగి వాని పునరుత్పత్తి 3000 సం||ల తర్వాత జరిగినది. వాతావరణ మార్పుల వలన శీతోష్ణములు అనగా వేసవి, శీతాకాలములు ఏర్పడెను (ఆది 9:22) అని బైబిలులో చదువుచున్నాము. ఇదే సత్యమని డా||మెల్విన్‌ ఐనెన్‌ అనే మానవ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు (Anthropologist) 5000 BC తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించాయని పేర్కొన్నారు. అక్కడనుండి జనాభా ఆసియా గుండా వివిధ ఖండాలకు పయనించింది. అప్పటి ప్రపంచపు క్యాలెండరుని గమనిస్తే సంవత్సరానికి 360 రోజులుగానే వ్రాయబడి ఉన్నది (నోవహు క్యాలెండరు సైతము). ఈ దిగువ ఇచ్చిన వివిధ క్యాలెండర్లు ఈ అంశాన్ని బలపరుస్తున్నాయి. ఈ జలప్రళయము తర్వాతనే సం||నకు 365 రోజులుగా మార్పు కలిగినది.

జలప్రళయానికి పూర్వపు కాలాలు

హిందూ క్యాలెండర్‌                  360 రోజులు 12X30
Thibanis Astronomic

చైనీస్‌ క్యాలెండర్‌                     360 రోజులు 12X30
Medhurst Astronomic

గ్రీకు క్యాలెండర్‌                       360 రోజులు 12X30
Heroditus Astronomic

రోమన్‌ క్యాలెండర్‌                    360 రోజులు 12X30
Plutarch Astronomic

దీనిని బట్టి జలప్రళయం సంభవించటం దేవుని ఆధీనములోనున్న భూగర్భ సంబంధిత మార్పులేనని (God's control of Geology) అర్ధమౌతుంది. డా||ఊలీ నాయకత్వంలో బ్రిటీష్‌ మ్యూజియానికి చెందిన పురావస్తు శాస్త్రజ్ఞులు త్రవ్వకాల ద్వారా ఊరు పట్టణపు పాటిదిబ్బ దగ్గర మానవ శల్యాలు ఉన్నాయని దాని క్రింద ఇంకో నగరం పాతిపెట్టబడి ఉందని, పరిశుద్ధ బైబిలులో వ్రాయబడిన జలప్రళయము వలననే ఆ మట్టిపొర ఏర్పడిందని భూమిపైన నాగరికతలు, ఆ పొరకు చెందిన నాగరికతలకు భేదము ఉందని, భయంకరంగా వచ్చిన విపత్తు వలన ఇది జరిగి ఉంటుందని తెలియజేయబడుతుంది.

నోవహు జలప్రళయము వచ్చిందనటానికి మరెన్నో పురావస్తు శాస్త్రాధారాలు, సాక్ష్యాధారాలు ఉన్నాయి. 1960 వ సం||లో టర్కీ దేశపు సైన్యాధికారి ఆరారతు కొండమీద క్షీణించిన ఒక నావను నోవహు ఓడగా గుర్తించాడు. దాని కొలతలు ఆది కాండము 6:15లో చెప్పినట్లే ఉన్నాయి. రాన్‌ యాట్‌ పురావస్తు శాస్త్రజ్ఞుడు అది నిజముగా క్షీణించి పాడైన నోవహు ఓడగా లైఫ్‌ మాగ్జైన్‌లో ప్రచురించాడు. తరువాత టర్కీ ప్రభుత్వం వారు దేశములోని ప్రముఖులతో చర్చించి టర్కీ మీడియాలో నోవహు ఓడను (Noah's ark) చూపించడం జరిగింది. ప్రొ||మైఖేల్‌సన్‌ మరియు ఆయన బృందము అక్కడ వున్న లంగరును, రాళ్లను, మానవుని మరియు ఇతర జీవరాశుల అవశేషాలను కనుగొన్నారు. కొలంబియాలో జంతువుల ఎముకలు ఎక్కువగా లభ్యమయ్యాయి. అవి క్రీ.పూ.5000 సం||ల కాలం నాటివని గుర్తించారు.

ఆ జలప్రళయ కొండవున్న నోవహు ఓడ ఉన్న స్థలమునకు జాతీయ ఉద్యానవనమని ప్రజలు పేరు పెట్టారు. 1 జనవరి 1987 లో ఆ దేశ ప్రజలు అధ్యకక్షునితో పండుగ జరుపుకున్నారు. అక్కడ మ్యూజియం స్థాపన కూడా జరిగింది. ఎంతోమంది యాత్రికులు అక్కడకు వెళ్ళి సందర్శిస్తున్నారు. టర్కీ ప్రభుత్వం రాన్‌ యాట్‌ గారిని తాత్కాలికంగా బహిష్కరించిన తరువాత ఆ ప్రభుత్వం వీరిని అంగీకరించింది. అచ్చటి గ్రామ ప్రజలు ఓడ అవశేషాలను, జంతు అవశేషాలను గూర్చి ప్రపంచానికి తెలియజేశారు. ఆ నోవహు ఓడ మీద అల్యూమినియం ఖనిజం భూమిలో నుండి 8 శాతం వచ్చి దానిపై పేరుకొన్నది. ఈ విధంగా తొలిసారిగా భూమినుండి వచ్చిన అల్యూమినియంను కనుగొన్నారు. తరువాతనే భూమిలోపల లభించే వివిధ ఖనిజాలను కనుగొన్నారు. 1977 లో నోవహు ఇల్లును, వారి సమాధిని, నోవహు దేవునికి కట్టించిన బలిపీఠమును శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. Flood caused the break in the cultural history of mankind. జలప్రళయము రాగి యుగము తర్వాత వచ్చిందని దీనివలన అర్ధమౌతుంది. కావున మానవుని నాగరికత రాగి యుగంతో ఆగి, మార్పు చెంది విభేదములు కలిగిన నాగరికత కంచు యుగంతో మొదలైనది. నోవహు కుమారులు వారి వంశంలో పుట్టినవారు తూర్పున ప్రయాణమై ఒక గోపురం కట్టుకొని బాబెలు అని పేరు పెట్టుదము అని అనుకొనుచుండగా యెహోవా అక్కడనుండి వారిని చెదరగొట్టెను (ఆది 11:2-9). వారి భాషలను తారుమారు చేసెను. అప్పుడు ప్రజలును వారి ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు, భాష, జీవనశైలి మార్పు చెంది వివిధ మానవజాతులు (Human races) గా గుర్తించబడిరి. ఆ విధంగా నాగరికత (Civilization) వివిధ భేదములు గల మానవ జాతులు (Population differentiation) జాతుల మధ్యగల భేదాలు (Racial differences) ప్రపంచమంతటా వ్యాప్తిచెందాయి. ఈజిప్టునకు 2000 B.C.  సం||ల తర్వాత (ఆది 10:13), సింధూలోయ లోనికి 400 ఔ.్పు. సం|| తరువాత (ఆది 10:29) నాగరికత వ్యాప్తి చెందినది.

నేటి నవ నాగరికత, మానవ జీవిత విధానము నోవహు (ఆది 6:5) లోతు దినాలను (ఆది 17:28) గుర్తు చేస్తున్నాయి. ఈ క్రొత్త యుగంలోని మార్పుల మధ్య జీవిస్తున్న మనము ఒక ప్రత్యేక జనాంగముగా, క్రీస్తు రూపాన్ని సంపాదించుకొని వెలుగొందే భాగ్యము దేవదేవుడు మనకందరికీ దయచేయును గాక! ఆమెన్‌. 
  - ప్రొఫెసర్‌ టి.నిర్మల మేరి