వాక్యసందేశముPost Date:2014-10-18//No:79

భక్తుల ఉపవాసము!లోకమును కదిలించిన సేవకుల చరిత్రను చదివి చూడండి! అగ్ని, జ్వాలలవలె లేచిన ఉజ్జీవపు చరిత్రను చదివి చూడండి! అత్యధిక మహిమతో అభివృద్ధి చెందిన సంఘముల చరిత్రను చదివి చూడండి! దాని వెనుక ఆసక్తిగల ఉపవాసములు, బలమైన స్తంభములుగా, శక్తిగల వెన్నెముకగా ఉండిన విషయములను గ్రహించగలము.

1. అసిస్సివాసియగు ఫ్రాన్సిస్‌ :

12వ శతాబ్దములో జీవించిన గొప్ప భక్తుడు. ఐశ్వర్యవంతులకు జన్మించిన యితడు తిరుగుబోతు గాను, తన యిష్టానుసారముగా పాపములో మునిగి జీవించుచుండెను. సరిదిద్దుటకు ఎవరివలననూ కాలేదు. పాపమును మంచినీటివలె త్రాగిన యితనిని ప్రభువే రక్షించాలని అతని తల్లి విడిచిన కన్నీరు విస్తారము. చివరకి రోజు విడిచి రోజు ఉపవాసముండి ప్రార్ధించిన ఫలితముగా, ప్రభువు యితనిని ముట్టెను. రక్షణానుభవము పొందినపుడు తన ఆస్తి, అంతస్తులను ఉపేక్షించుకొని సన్యాసము పుచ్చుకొనెను. అతని కటిక చీకటి తొలగిపోయెను. ప్రభువునామ మహిమార్ధమై జీవించసాగెను.

అతని సేవ ద్వారా వేలకొలది ప్రజలు క్రీస్తును అంగీకరించిరి. తరువాత పూట భోజనము ఎక్కడ నుండి వచ్చునని పట్టించుకొనక, బహుకరించిన బట్టలను ధరించువానిగాను జీవించెను. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకొనక క్రీస్తు కొరకు కాలినడకన అతడు చేసిన సేవ నేడునూ మనకు సవాలుగా నున్నది.

భుజింపక, ఖాళీ కడుపుతో నుండినను ఉత్సాహముగా పాడి సాక్ష్యము చెప్పుచు ప్రసంగించెను. ఇతడు ప్రార్ధన పూర్వకంగా ఉపవాసముతో మెల్లగా వీధులలో నడుచుచుండగా చూసినవారు మారుమనస్సు, రక్షణ పొందిరి. దీని రహస్యము యితని ప్రార్ధనలోనూ ఉపవాసములోను వుండెను.

2. సేవకుడు సెవనరోల : ఇతడు 14వ శతాబ్దములో ఇటలీ దేశములో దేవుడు లేపిన ఉజ్జీవ వీరుడు. యితని ద్వారా ప్లారెన్స్‌ అనే పట్టణములో ఉజ్జీవ మంట రగులుకొనెను. ప్రభువును స్తుతించు స్తుతులతోను, పాటలతోనూ ఆ పట్టణమంతా ఆవరించెను. యితని సేవ ద్వారా పట్టణస్థులందరూ రక్షణ పొందారని చెప్పవచ్చు.

చరిత్రకారులు అతనిని గూర్చి యిలాగు వ్రాయుచున్నారు. తన ఎక్కువకాల ఉపవాస ప్రార్ధనల వలన ప్రసంగవేదికపై ఎక్కుటకునూ శక్తిహీనుడై యుంటాడు. కానీ ఎక్కిన తరువాత ప్రసంగము వినే ప్రతి వారునూ ఏడ్చుచూ ప్రభువుకు అప్పగించుకొనుటకు నడిపించగలడట. అతని ఉపవాసము యొక్క శక్తి ఆత్మలను సంపాదించుటలో కనపడెను.

3. మార్టిన్‌ లూధర్‌ : విప్లవ ఉపవాసవీరుడు యితడు! ఉపవాసము యొక్క శక్తిని బట్టి ప్రభుత్వములకునూ, అధికారులకునూ సవాలు చేసెను. తన ప్రాణమును లక్ష్య పెట్టక తప్పుడు సిద్ధాంతములను ఎదిరించి, దీర్ఘమైన దిద్దుబాటులను తెచ్చెను. ప్రొటస్టెంట్ల సంస్థాపకుడు ఈయనే! ఇతడు దిద్దిన దిద్దుబాటు విత్తనములు ఐరోపా, అమెరికా ఖండములకు చేరెను.

ఇతడు ఎడతెగక ఎక్కువకాలము ఉపవాసముండి ప్రార్ధించేవాడు. ఇతని ఎక్కువకాల ఉపవాసము వలన శరీర ఆరోగ్యము దెబ్బతిన వచ్చని అతని బంధుమిత్రులు భయపడిరి. అతని యొద్దకు వచ్చి ప్రేమతో, ""నీ ఆత్మ, ఉపవాసము వలన బలపరచబడుట అవసరమే కాని ఉపవాసము వలన పరిశుద్ధాత్మ నివాసముచేయు నీ శరీరము పాడైపోకూడదు""అని సలహా యిచ్చిరి. అయిననూ అతడు తన ఉపవాస ప్రార్ధనను మానుకోలేదు!

అతడు బైబిలును తర్జుమా చేయుట ప్రారంభించనపుడు, ఎదుర్కొనిన వ్యతిరేకతలు విస్తారము. ప్రభుత్వము, సంఘము, లోకమంతా ఎదిరించిననూ ఆశ్చర్యముగా పరిశుద్ధ గ్రంధమంతయూ అనువదించెను. దేవుని హస్తములే కాని వేరేదియూ దీనిని చేయుట అసాధ్యమే! అవును, మార్టిన్‌ లూధర్‌గారి ఉపవాస ప్రార్ధన విని దేవుడు దిగివచ్చి అతనికి సహాయకుడై యుండి విజయవంతముగా పని జరిగించెను. అతని ఉపవాస ప్రార్ధనయే మూలకారణమయ్యెను.

4. జాన్‌ కాల్విన్‌ : జెనీవాకు చెందిన ఇతడు క్రమముగా ఉపవాసముచేయు ఉత్తమ సేవకుడై యుండెను. అతని ప్రార్ధనా ఫలితముగా ఆ పట్టణమంతా రక్షణ నొంది ప్రభువులోనికి వచ్చెను. అంతేకాదు, అతని ఉపవాస ప్రార్ధనా ఫలితముగా అనేక ప్రార్ధనా బృందములు స్థాపింపబడెను. ప్రార్ధన వీరులు బయలుదేరిరి. అతని సేవ ద్వారా మార్పునొందినవారు, ఇంటికొక ప్రార్ధన వీరుని చొప్పున లేచి ప్రార్ధించసాగిరి.

ఉపవాసము యొక్క ఫలితమును గ్రహింపక దానిని అవమానించినవారు, ఉపవాసము యొక్క శక్తిని కనుగొనిరి. అంతవరకు ఆచారముగా ఉపవాసము చేసిన పారంపర్య క్రైస్తవులు పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఉపవాసము చేయనారంభించిరి. ఉజ్జీవ మంట జ్వాలలుగా లేచెను.

5. జాన్‌నాక్స్‌ : జాన్‌నాక్స్‌ అను ఉపవాస వీరుని ప్రార్ధన, ఇంగ్లాండు దేశపురాణి యొక్క యుద్ధ వీరుల బలమున కంటె శక్తి గలదై యుండును! ఇంగ్లాండు దేశమును పరిపాలించిన మేరి ఒక క్రూరమైన రాణి. సేవకుడైన జాన్‌ నాక్స్‌ను సర్వనాశనము చేయుటకు ప్రయత్నించెను కాని ఆమె వలన కాలేదు! ఆమె సైన్యమంతా ఈ దీన సేవకుని యెదుట నిలువలేక పోయెను.

జాన్‌ నాక్స్‌ ఉపవాసముండి ప్రార్ధించగా ఆమె, ప్రార్ధన శక్తిని ఎదుర్కొనలేక వణికెను. పట్టువిడవక అతడు ప్రార్ధించుటనుబట్టి, అహంభావముతో నిండిన రాణి, పదవీ భ్రష్టురాలై విదేశములో మృతి చెందెను. ఉపవాస ప్రార్ధన ఎంతో శక్తి గలది!

భక్తుల
6. ఛార్లెస్‌ ఫిన్ని : వేకువనే లేచి ఎక్కువ సమయాన్ని యితడు ప్రార్ధనలో గడుపుతూ వచ్చెను. శరీర వ్యాయామము దేహమును ఎలాగు బలపరచుచున్నదో అలాగే క్రమమైన ఉపవాస వ్యాయామము యితని ఆత్మను పరిశుద్ధాత్మ బలపరచెను. ఉపవాసము చేయుచూ దేవునితో ఏకాంతముగా సమయము గడుపు నిమిత్తము ప్రార్ధన గదిలోను, అడవులలోను వుంటాడు. ఇతడు యిరవై నాలుగు గంటలూ ప్రార్ధించాడని చెప్పవచ్చు.

ఉపవాసము తన ఆధ్యాత్మిక జీవితమునకు ఒక లంగరుగా వుండెనని చెప్పేవాడు. ఎప్పుడైనా తనలో దేవునిశక్తి తగ్గినట్లు గ్రహించిన యెడల మూడు దినములు తీవ్ర ఉపవాసము చేసి పోగొట్టుకొన్న పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనుటను అలవాటుగా చేసుకొనెను. చార్లెస్‌ ఫిన్నీ చుట్టూ ఎల్లప్పుడూ ఆత్మ యొక్క బలమైన ప్రసన్నత ఆవరించి యుండెను. అందువలన వ్యాపారులు, కార్మికులు, సొసైటీలో అంతస్థు గలవారు, అధికారులు మరియు వేలకొలది ప్రజలు పాపమును గ్రహించి రక్షణ కోసము ఏడ్చి, దేవుని రక్షణను స్వతంత్రించుకొనిరి.

7. జొనతాన్‌ ఎడ్వర్డ్స్‌ : ఇతడు ఉపవాస ప్రార్ధనయందు గొప్ప నమ్మకము గలవాడై ప్రసంగ వేదికపై నిలుచుటకు శక్తిలేనంతగా ఉపవాసము చేయువాడై యుండెను. ప్రభువు అతని సేవను అపరిమితముగా ఆశీర్వదించెను.

అతడు ఎక్కువ కాలము ఉపవాసముండి ప్రసంగించిన ""రోషము గల దేవుని చేతిలోని పాపులు"" అనే ప్రసంగము ప్రజలకు కలవరము పుట్టించి వణికించెను. అతడు ప్రసంగిస్తుండగానే తాము నరకములోనికి వెళ్ళిపోతామేమో అని భయపడిన ప్రజలు స్తంభాలను, కుర్చీలను పట్టుకొని వ్రేలాడిరి. దేవుని న్యాయతీర్పును గూర్చి యితడు ప్రసంగిస్తుండగా వారి గుండె జారినట్లు వుండెను. ప్రజలకు పశ్చాత్తాపము కలిగించే అతని ప్రసంగము యొక్క రహస్యము ఉపవాస ప్రార్ధనయే!

8. జాన్‌వెస్లీ : ఎట్టి పరిస్థితులలోను క్రమము తప్పక ఉపవాసము చేసెను. సేవకులు మాత్రం కాదు, విశ్వాసులునూ ప్రతి బుధ, శుక్రవారములు ఉపవాసము చేయాలన్నది యితని ఆజ్ఞ. అతని దినములలో ప్రసంగ వేదికల నుండి నిప్పురవ్వలు వంటివి ఎగిరినట్లుగా వుండెను. అది మహా గొప్ప ఉజ్జీవమునకు ప్రారంభము.

ఉపవాసము యొక్క అద్భుతశక్తిని కన్నులారా చూచిన అనేకులు ఒకరితో ఒకరు పోటీపడి, తమ శరీరారోగ్యములను లెక్కచేయక, ఎక్కువకాలము ఉపవాసము చేసిరి. అయిననూ జాన్‌వెస్లీ ఉపవాసము యొక్క శక్తిని నొక్కి చెప్పుట మానలేదు. ప్రార్ధించని క్రైస్తవుల వలె ఉపవాసము చేయని క్రైస్తవులునూ పరలోక మార్గములో నడవనివారై యున్నారు అని అతడు ఉద్భోదించెను. 1789 జులై 22న డబ్లిన్‌ నగరమందు క్రైస్తవ్యము బలహీనమై యుండుటకు కారణాలు అను అంశంపై ప్రసంగించినపుడు, అతి ప్రాముఖ్యమైన కారణము ఉపవాసము చేయకపోవుటయే అని ప్రకటించెను.

9. సి.హెచ్‌.స్పర్జన్‌ : బాల్యములో దైవసేవకుడై తన ప్రసంగ సమర్థత వలన లోకమును తల్లక్రిందులు చేసిన సి.హెచ్‌.స్పర్జన్‌ ఒక మంచి ఉపవాస వీరుడు. అతడు ఉపవాసమును గురించి యిలాగు వ్రాసెను. ప్రార్ధన వలననూ ఉపవాసము వలననేగాని మరి దేనివలననైననూ యీ విధమైన దయ్యములు వదలిపోవుట అసాధ్యమని క్రీస్తు బోధించెను. ఈ బోధలో ఆయనకు ఒక గొప్ప ఉద్దేశ్యముండి వుండాలి, మారుమనస్సు పొందకుండా మనుష్యుల హృదయములు కఠినపరచి, బంధించి యున్న దెయ్యములు వెళ్ళగొట్టబడుటకునూ, మనుష్యులు రక్షణ పొందుటకునూ మామూలు ప్రసంగములు, పారం పర్యాచారముగా చేయబడు ప్రార్ధనలు సరిపోవు. ప్రత్యేకమైన ప్రసంగములును, ఆసక్తికరమైన ప్రార్ధనలునూ గట్టి ఉపవాసములు మాత్రమే మంచి ఫలమును యిచ్చెను.

నేనెందుకు ఉపవాసము చేయాలని మీరు అడగవచ్చు! మీ ప్రార్ధనా జీవితము కాపాడబడుటకును, ఆత్మ ఎదుగుదల నిమిత్తమును ప్రభువు కోసము సాహస కార్యములు చేయుటకును ఉపవాసము అవసరమని నేను చెప్పుచున్నాను.

యేసు ఉపవాసము చేసెను, ఉపవాసము చేయమని ఆజ్ఞాపించెను. నీవు ఉపవాసము చేయనియెడల నీకు రావలసిన అదనపు ఆశీర్వాదములను పోగొట్టుకొనువాడవై యుందువు. తాను ఉపవాసము చేసినపుడు నరములు ముడుచుకొని పోవుట వలన శరీరము బిగుసుకు పోయిననూ, ఉపవాసము చేయుటను మానలేదు. ఎందుకనగా, ఆత్మను క్రొవ్వ చేసే ఆరోగ్య కేంద్రము ఉపవాసమే!

నశించుచున్న ఆత్మల కొరకు పరితపించి, కన్నీరు కార్చుచున్న మీరు క్రమముగా ఉపవాసము పాటించి చూడండి. దయ్యములు భయముతో ఒణకుటను చూచెదరు. ఉపవాసము విశ్వాస అభివృద్ధికి మంచి ఔషధమై యున్నది. శరీర ఆరోగ్యమునకునూ అది తోడ్పడుచున్నది. ఆత్మ సంబంధమైన అనుభవములేని అన్యజనులునూ శరీర ఆరోగ్యము కొరకు ఉపవాసము చేయుచున్నారు. ఉపవాసము చేయుట వలన శరీరమునకు హానిలేదు. మెదడుకు తెలివినిచ్చును. మనస్సును దేవునియందు ఓదార్చుటకును సహాయపడును.

10. డేవిడ్‌ బ్రైనార్డ్‌ : యవ్వన కాలములో ప్రభువు సేవ కొరకు ఉపవాసమందు తన్నుతాను క్రుమ్మరించుకొన్న ఉత్తమ భక్తుడీతడు. ఇతడు తన డైరీలో వ్రాసిన సంగతులు ఎంతో ఉజ్జీవకరమైనవి. అవి అతడెంతో శ్రేష్ఠమైన ఉపవాస వీరుడని సాక్ష్యమిచ్చుచున్నవి.

""ఈ దినమున ప్రార్ధన, ఉపవాసము కొరకు కేటాయించితిని. ప్రభువు తన సేవకు నన్ను పరిపక్వపరచుటకును, తన కృపతో నింపుటకును, యిది అవసరమని తెలుసుకొన్నాను. నా ప్రాణము ప్రభువుపై తృష్ణగొనెను. ఆహారము భుజించు మరచితిని. ఆహారమున కంటె దేవుని సముఖము నాకు ప్రీతికరమాయెను"" అని పలుచోట్లలో తన డైరీయందు వ్రాసి పెట్టెను.

11. ఉల్లియం బ్రాన్‌వెల్‌ : 19వ శతాబ్దపు బలమైన సేవకుడు! ఇతడు ఉపవాసముండి ప్రార్ధించినపుడు ప్రత్యేకమైన దేవునిశక్తిచే నింపబడెను. అతని ఉపవాస ప్రార్ధన దేశములో గొప్ప ఉజ్జీవమును తెచ్చెను. తన ప్రార్ధన గదిలో కనీసం రెండు గంటలనుండి ఆరు గంటల సమయము ఎడతెగక ప్రార్ధించుచుండెను.

ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంత్రము 3 గం||ల వరకు మోకాళ్ళమీద నుండి తరచుగా ఉపవాసము చేయుట అతని అలవాటు ""ఉపవాసము మరియు తమ్మును తాము పరిశీలించుకొనుటయు తగ్గిపోయి, భుజించుటయు, త్రాగుటయు, పోకిరి మాటలును, సరసోక్తులును ఎక్కువైనందున చాలామంది విశ్వాసులు తాము పొందిన రక్షణానుభవమును నిలుపుకోలేక పోవుచున్నారు"" అని అతడు చెప్పెను.

12. రీస్‌ హవెల్‌ : రెండవ ప్రపంచ యుద్ధ విజయము యితని ఉపవాస ప్రార్ధన శక్తిలో నుండెను. ఇతనివంటి విజ్ఞాపన ఉపవాస వీరులు యింతవరకు బయలుదేరలేదని చెప్పవచ్చు.

తాను సేవ ప్రారంభ దినమున మొదలుకొని కేవలము రెండు దినములకు ఒక్కసారి మాత్రమే భుజించెను. జీవితమంతా అలాగే పాటించెను. తరువాత 15 దినములు ఎడతెగక ఉపవాసము చేయుటకు దేవుని ఆత్మచే నడిపించబడెను.

సువార్త ప్రకాశమును అందించే, దేశములకు విరుద్ధముగా జరిగిన రెండవ ప్రపంచ యుద్ధకాలములో దేవుడు జోక్యము చేసుకొని, అంధకార శక్తులను లయము చేయు నిమిత్తము, ఒక దినమంతా భారముతో ప్రార్ధించుటకు తన కాలేజి విద్యార్ధులను పిలిచెను. బ్రిటిష్‌ వారు పొందిన విజయము ఆ యుద్ధవీరులు, ఆయుధముల ద్వారా కలిగెనా - లేక రీస్‌హవెల్స్‌ ప్రార్ధన ద్వారా కలిగెనా? అని అతని పుస్తకములను చదువువారు గ్రహించెదరు.

13. డి.యల్‌.మూడి : డి.యల్‌.మూడి విజయవంతమైన సేవకు కారణము అతని సేవ కొరకు ఉపవాసముతో ప్రార్ధించిన విశ్వాసులే!

1872లో డి.యల్‌.మూడి కొద్ది విశ్రాంతి నిమిత్తము ఇంగ్లండు దేశమందున్న ఒక గ్రామమునకు వచ్చిరి. తాను ప్రసంగించకూడదని తీర్మానించి యుండిననూ, ఆ గ్రామ సంఘకాపరి ఒత్తిడిని బట్టి ఉదయము, రాత్రియూ ప్రసంగించుటకు ఒప్పుకొనెను.

ఆదివారం ఉదయ వర్తమానము చప్పగా ఉండెను. ఆరాధనలో పాల్గొనిన ఒక సహోదరి తన యింట నడవలేని స్థితిలో నుండిన అక్కతో మూడిగారు వచ్చిన సంగతి, ప్రసంగమును గూర్చి వివరించెను.

దానిని విన్న అక్కయ్య, ""మూడిగారు వస్తున్నారని నేను తెలుసుకొనకపోవుట నా దురదుష్టము. గత రెండు సంవత్సరముల నుండి ఆయన్ని దేవుడు యిక్కడికి పంపాలని ప్రార్ధించుచున్నాను. నేను రాత్రికూటము ముగించు వరకు భోజనము చేయును. ప్రభువు ఆయనను బలముగా వాడుకొను నిమిత్తము ఉపవాస ప్రార్ధన చేస్తాను"" అని చెప్పి తన ప్రార్ధనాగదిలోనికి వెళ్ళి గోజూడసాగెను.

రాత్రి కూటము ప్రారంభమాయెను. మూడిగారి ప్రసంగము సాధారణముగానే వుండెను. అయితే హఠాత్తుగా, కూటములో ఒక గొప్ప కదలిక ఏర్పడెను. ప్రసంగించుట ముగించిన తరువాత, ప్రభువుకు సమర్పించుకొనగోరు వారిని లేచి నిలువబడమని చెప్పెను. 500 మంది నిలచిరి. మూడి దిగులు చెందెను. తన వర్తమానము, పిలుపు యొక్క ఉద్దేశ్యమును వారు సరిగా గ్రహించలేదని భావించెను.

కాబట్టి అందరిని కూర్చుండ బెట్టి మరలా పిలుపు నిచ్చెను. 500 మంది లేచిరి. అయిననూ మూడిగారి సందేహము తీరలేదు. మూడవసారి కూడా 500 మంది లేచి నిలువబడిరి. యింత గొప్ప ఆత్మల కోత రహస్యము ఏమిటో గ్రహించలేక కూటమును ముగించెను.

పిమ్మట ఆయన కొరకు ఉపవాసముతో ప్రార్ధిస్తున్న సహోదరి యొద్దకు తీసుకొని పోయిరి. సేవ చేయుటకు శక్తి ఎక్కడనుండి వచ్చుచున్నదో అప్పుడు గ్రహించెను. ఉపవాసముయొక్క శక్తివలన సేవ, సేవకులు ఆశీర్వదించబడుచున్నారు.

ఉపవాసదినము ప్రతిష్టించుడి, వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను, దేశములోని జనులందరిని మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. యోవేలు 1:14.

""ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి; ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడను, శాంత మూర్తియూ, అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి.

సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతిష్టించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి."" 
యోవేలు 2:12,13-15. 

- జె.సామ్‌ జెబదురై