వాక్యసందేశముPost Date:2014-10-04//No:75

యాకోబు అంటే ఎందుకు ప్రేమ.. ఏశావు అంటే ఎందుకు ద్వేషము  దేవుని వాక్యమును సరిగా ధ్యానించినచో ఏశావు యాకోబు జీవితంలో దేవుని కార్యము న్యాయార్ధమైనదని గుర్తింపగలము.

1. దేవుడు ఏశావునకును యాకోబునకును సమానమైన తరుణముల నిచ్చెను : వీరిరువురును ఒకే తల్లిదండ్రులకు జన్మించినవారు. తోబుట్టువులు; ఒకే యింటిలో పెరిగి పెద్దవారైరి: ఒకే మతమునవలంభించిరి. వీరిరువురి పుట్టుకలో భేదములేదు; పెంపకములో భేదములేదు? భోజన పానాదులందు భేదములేదు? విద్యాభ్యాసములోను భేదములేదు; విశ్వాసములోను భేదము లేదు. అనగా ఒకే దేవున్ని ఆరాధించిరి. కృపా సాధనములో భేదములేదు. దేవుడు న్యాయస్థుడై వీరిరువురికిచ్చిన తరుణములలో భేదముండియుండును. ఏశావునకే యాకోబు కంటె తక్కువ తరుణముల నిచ్చియుండును; విరుద్ధ పరిస్థితులను కల్పించియుండును. చూడగా యాకోబుకంటె ఏశావునకు ఉన్నత పరిస్థితులను కల్పించెను. ఏశావు జ్యేష్ఠుడు; యాకోబు కనిష్ఠుడు. అయితే ఒక విషయములో మాత్రము చాలా భేదమున్నది. దేవుడే యిట్లు చెప్పుచున్నాడు. 'ఏశావు యాకోబు అన్నకాడా! అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందు నక్కలపాలు చేసితిని'. మలాకీ 1:2-3; రోమా 9:13.

2. దేవుడెందుచేత ఏశావును ద్వేషించెను? ఆయన అన్యాయస్థుడు? కాదా ఏశావు శరీరానుసారి; యాకోబు ఆత్మానుసారి; దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మానుసారియైన యాకోబును ప్రేమించెను. ఏశావు శరీరానుసారమైన మనస్సుగలవాడు; యాకోబు ఆత్మానుసారమైన మనస్సుగలవాడు. ఏశావు భూసంబంధమైన వాటిని మనస్కరించెను. యాకోబు ఆత్మ విషయములను మనస్కరించెను. ఏశావు శరీరమును కాపాడుకొనజూచెను. యాకోబు జ్యేష్టత్వములో ఇమిడియున్న ఆత్మ విషయములను సంపాదింపకోరెను. ఏశావు భోజన ప్రియుడు; యాకోబు ఆత్మ విషయములందు ఆకలిదప్పులు గలవాడు. ఏశావు స్వచిత్తమున పోయెను; యాకోబు దైవచిత్తమునకు విధేయుడు కాగోరెను. ఏశావు లౌకిక చింతగలవాడు; యాకోబు పరసంబంధమైన వాటినపేక్షంచినవాడు. ఏశావు శరీరాహారమును కోరెను; యాకోబు దైవాశీర్వాదమును కోరెను. వీరిరువురి మధ్యనున్న యీ వ్యత్యాసము చేతనే దేవుడు ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించెను. ఈ రెండు రకముల మనస్సుల ఫలితమును దైవవాక్యమిట్లు వివరించుచున్నది. 'శరీరానుసారులు శరీర విషయములను మనస్కరించెదరు. ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై యున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు. యే మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు.' రోమా 8:5-8. మానవులలో దేవుడు ఆత్మానుసారులను ప్రేమించి, శరీరానుసారులను ద్వేషించును. దేవుడు తన స్వభావమునకు విరుద్ధముగ యేమియు చేయడు. ప్రపంచ అంతర్జాతీయ లెక్కలలో పాశ్చాత్య దేశస్తులని లేక తూర్పు దేశస్తులనియు లెక్కించెదరు. వివిధ ఖండములను వివరించుటలో తెల్లవారనియు నల్లవారని లెక్కించెదరు. దేశీయ అంతరంగ లెక్కలలో విద్యావంతులనియు లేక విద్యాహీనులనియు ప్రత్యేకించెదరు. మత విమర్శలో క్రైస్తవులనియు లేక అన్యులనియు లెక్కింతుము. సకల జాతులవారిని విభజించునప్పుడు గ్రీకులనియు లేక యూదులనియు ప్రత్యేకించెదము. జ్ఞానము నందు పండితులనియు లేక పామరులనియు మానవకోటిని వేరుచేయుదురు. ఆస్తిపాస్తులు పరిగణించినప్పుడు ధనికుడనియు లేక దరిద్రుడనియు వేరుచేయుదుము. సంఘ లెక్కలలో బాప్తిస్మము పొందినవాడని లేక బాప్తిస్మము పొందని వాడనియు వేరుచేయుదము. ఇవి మానవుల ఏర్పాటులు, కాని దేవుడైతే మరియొక విధముగా మానవజాతిని విభజించును. ఆత్మానుసారమైన మనస్సుగలవాడు లేక శరీరానుసారమైన మనస్సు గలవాడు. నీవు ఏ తరగతికి చెందిన వాడవు? ఏశావు వలె శరీరానుసారివా? లేక యాకోబు వలె ఆత్మానుసారివా?

3. ఏశావు యాకోబుల జీవిత ఫలములను కొంత ధ్యానింతుము. దేవుని వలన కృపగా నియ్యబడిన జ్యేష్ఠత్వమును ఏశావు బుద్ధిపూర్వకముగా తృణీకరించెను; యాకోబు అయితే జ్యేష్ఠత్వమును ఆతురతతో ఆపేక్షించెను : 'ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివశించుచుండెను.' ఆది 25:27, 'ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను; ఆ యెర్ర యెర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు యిమ్మని అడుగగా ఏశావు - నేను చావబోవుచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను? యాకోబు - నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి తన జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏశావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు అతని జ్యేష్ఠత్వమును తృణీకరించెను.' ఆది 25:29-34

ఏశావు - నేను చావబోవుచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు? ఏశావు ఎదుర్కొనిన పరిస్థితులనే మనలో అనేకులును యెదుర్కొనుచున్నారు, అట్టి పరిస్థితులలో అనేకులు ఏశావు వలెనే నేను చావబోవుచున్నాను; నాకు ప్రభువెందులకు? అని చెప్పుచున్నావా? శరీర అక్కరలకై ఆత్మీయ అర్హతలను అమ్మివేయుచున్నారు. ఆత్మీయ కృపావరములను తృణీకరించుచున్నారు? మరణించిన పిదప ఆత్మ స్థితి నెవరెరుగుదురు? ప్రస్తుతము శరీర జీవితమును అభివృద్ధి పొందనిమ్ము అని ఆత్మ రక్షణను నిర్లక్ష్యముగా నెంచుచున్నారు. ఈ లోకమున దౌర్భాగ్యుడుగనున్నాను; నా ఆత్మీయ జీవితము వలన ప్రయోజనమేమి? క్రీస్తు నామమును మార్చుకొని అన్యనామమును పెట్టుకొని విద్య, ఉద్యోగములను సంపాదించుకొననిమ్ము అని ప్రభువు నామముతో ఆటలాడుచున్నారు; తమ ఆత్మలను చులకనగా నెంచుచున్
యాకోబు