వాక్యసందేశముPost Date:2014-09-12//No:72

ఇప్పుడే అందిన వార్త ! 'అపవాది... తనకు సమయము కొంచెమే అని తెలిసికొని....'

ఇది ఇప్పుడే అందిన వార్త! అంధకార రాజ్యం అంతటా అత్యవసర పరిస్థితి విధించబడింది.

చీకటి సామ్రాజ్యపు చక్రవర్తి సాతాను, పాతాళలోకంలోని తన రాజధానిలో ప్రత్యేకమైన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాడు. ఆ సమావేశానికి అంధకార రాజ్యంలోని ప్రధానులు, అధికారులు, లోకనాధులూ అందరూ హాజరయ్యారు.

సమావేశం జరుగుతున్న దర్బారు హాలులో వాతావరణం ఉత్కంఠ భరితంగా ఉంది. చీకటి లోకాల చక్రవర్తి ముఖం ప్రసన్నంగా లేదు. అతడి ముఖంలో ఆందోళన తాండవిస్తోంది - ఆందోళన కాస్త క్రోధంగా మారింది.

అతి సుందరంగా ఉండే ఆ చక్రవర్తి ముఖం క్రోధావేశంతో ఎంతో వికారంగా తయారైంది. అందరి మనస్సులలోనూ భయం, దర్బారులో నిశ్శబ్దం రాజ్యమేలుతున్నాయి.

అలా కొద్దిసేపు గడిచిన తరువాత, ఆ చీకటి రాజ్యాధిపతి తన మౌనాన్ని వీడి నోరుతెరచి మాట్లాడసాగాడు.

అతడొక అద్భుత వక్త, ఉపన్యాసకుడు. అతడి స్వరం, అతడి తర్కం, అతడి వాగ్ధాటి, ప్రసంగ ధోరణి, వింటున్న వారిని మంత్రముగ్దులను చేస్తాయి. అతడి జ్ఞానం అమోఘం. యుద్ధ తంత్ర రచనలో అతడు కనుపరచే నైపుణ్యం అనితరసాధ్యం. లక్షలాది మంది ప్రధానులు వింటూండగా - ఆ పాతాళలోకపు రారాజు ఉపన్యాసం ఇలా సాగింది....

'నాకు అత్యంత ప్రియులైన చీకటి లోకపు పౌరులారా, పరిపాలకులారా! దేవుడు సృష్టించిన కోటానుకోట్ల లోకాలలో మూడోవంతు లోకాలను మనం వశపర్చుకుని, వెలుగు రాజ్యంలోపలే మరో రాజ్యాన్ని - చీకటి రాజ్యాన్ని స్థాపించాం.

అది, మనకు తొలి విజయం - కానీ అది మన తుది విజయం కాదు. ఎందుకంటే ఇంకా పోరాటం అంతం కాలేదు. దేవుణ్ణి ఈ విశ్వరాజధానీ నగర సింహాసనం మీది నుండి పడద్రోసి, విశ్వమంతటినీ చీకటి సామ్రాజ్యంగా మార్చడమే మన ధ్యేయం. అది జరిగిననాడే మనం అంతిమ విజయం సాధించినట్లు లెక్క.

ఈనాటికీ ఈ విశ్వంలోని అధికభాగం - మూడింట రెండు వంతుల ప్రపంచాలు ఇంకా తేజోరాజ్యంగానే కొనసాగుతున్నాయి. దేవుడే ఇంకా మెజారిటీ ప్రజల హృదయాలలో రాజుగా ప్రతిష్టించబడి ఉన్నాడు.

అంతే కాకుండా మన చీకటి రాజ్యపు పునాదులు పెల్లగించి మన రాజ్యాన్ని కూల్చివేసేందుకు దేవుని అద్వితీయ కుమారుడు భూగ్రహం మీద మరణించాడు. మరణం యొక్క బలం నావశంలోనే ఉంది గనుక ఆ ఇమ్మానుయేలును నేను మరణ పాశాలతో పాతాళంలో శాశ్వతంగా బంధించి ఉంచాలని విశ్వప్రయత్నం చేసాను - అయినా అతణ్ణి బంధించి ఉంచలేక పోయాను -

దేవుని రాజ్యాన్ని కూల్చివేయాలని మనం ప్రయత్నిస్తూ ఉంటే, మన రాజ్యాన్నే దేవుడు అంచెలంచెలుగా పెల్లగిస్తున్నాడు.

దేవుని వెలుగు రాజ్యంలో మనం చీకటి రాజ్యాన్ని స్థాపించామని సంతోషిస్తూ ఉంటే మన చీకటి రాజ్యంలోని భాగం అయిన భూగ్రహం మీద ఆ దేవుడు 'దేవుని సంఘం' అనే పేరిట ఒక వెలుగు రాజ్యాన్ని స్థాపించాడు!

ఇది మనకు చాలా అవమానకరం! ఇది మనకు తీవ్రమైన ఓటమి! ఇంకా మనం చూస్తూ ఊరుకుంటే కోట్లాది సంవత్సరాల మన కలలూ ఆశలూ ఆశయాలూ కుప్పకూలి పోతాయి. దేవుని కార్యాలకు మనం ఎలాగైనా అడ్డుకట్టవేయాలి.

ఒకవైపు చూస్తే భూగ్రహం మీద ఆ దేవుని రాజ్యం త్వరత్వరగా వ్యాపిస్తోంది. సువార్త విరివిగా ప్రకటించబడుతూ ఉంది. లక్షలాది మంది ప్రజలు ఆ సువార్తను నమ్మి మన చీకటి రాజ్యంలోనుండి వెలుగు రాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు. - ఇంతకాలం మన రాజ్యంలో జీవించామన్న కృతజ్ఞత అయినా లేకుండా! అయినా ఈ మనుషులలో మంచితనం ఎలా ఉంటుందీ? వాళ్ళూ ఆ దేవుని పోలికలో సృష్టించబడిన వాళ్ళే గదా?! మనం చేసిన సేవలన్నీ ఆనాడు ఆ దేవుడూ మరచిపోయాడు, ఈనాడు మనుషులూ మర్చిపోతున్నారు! ఆ తండ్రిదీ పిల్లలదీ ఒకే పోలిక!

మరో వైపు చూస్తే మన అంధకార రాజ్యానికి సర్వనాశనం తప్పదని, ఒకనాటికి మళ్ళీ సర్వవిశ్వమూ తేజోరాజ్యం అయిపోతుందనీ దేవుడు తన లేఖనాలలో వ్రాయించాడు.

అంధకార రాజ్యపు సంపూర్ణ వినాశనానికి ముందు ఈ సంఘటనలు సూచనగా జరుగుతాయని కూడా దేవుడు తన లేఖనాలలో ముందుగా వ్రాయించాడు. దేవుడు వ్రాయించిన ఆ సూచనలన్నీ ఒకటొకటిగా నెరవేరుతూ ఉన్నాయి.

దేవుని మీద ద్వేషంతో మనం చేసే కొన్ని పనులు కూడా ఆ సూచనల నెరవేర్పుగా పరిణమిస్తున్నాయి. మన నాశనానికి సూచనలుగా దేవుడు నియమించిన సూచనలలో అధికభాగం ఇదివరకే నెరవేరాయి. మిగిలిన సూచనలు కూడా నెరవేరబోతున్నట్టే కనిపిస్తోంది.

ఇక మనం నిర్లక్ష్యంగా ఉండటానికి వీలులేదు - మనం విజృంభించి పనిచేయాలి. మనకు సమయం చాలా తక్కువగా ఉంది! మనం దేవుని సైన్యాలను బలంగా దెబ్బతీయాలి. కోలుకోలేని విధంగా దేవుని కార్యాల మీద దెబ్బకొట్టాలి.

దేవుని ప్రణాళికలను మనం దెబ్బతీయాలంటే, భూగ్రహం మీద నిర్మించబడుతున్న దేవుని సంఘాన్ని మనం నాశనం చేయాలి.....

ఒక్కసారి ఆగి, తన సహచరుల స్పందన కోసం చుట్టూ చూశాడు ఆ అపవాది.

'అవును! అవును! భూగ్రహం మీద దేవుడు తన వెలుగు రాజ్యాన్ని నిర్మించుకోవడం కేవలం అన్యాయం, అక్రమం! ఆ భూగ్రహం దాని ఏలిక అయిన ఆదాము చేత ఏనాడో మనకు అప్పగించబడింది..... ఈనాడు చట్టబద్ధంగా ఆ భూగ్రహం మనది! అయినా దేవుడు తన అనంత బలాన్ని చూసుకుని విర్రవీగి, న్యాయాన్ని భంగంచేసి మన భూగ్రహం మీద తన కార్యాలు చేసుకుంటున్నాడు. ఈ దేవునికి మనం ఒక గుణపాఠం నేర్పాల్సిందే!'

- అంటూ అంధకార రాజ్య ప్రధానులంతా ముక్త కంఠంతో తమ అధిపతి అయిన సాతానుకు వత్తాసు పలికారు.

సాతాను తృప్తిగా తలాడించాడు - 'శెహభాష్‌! మీరు కూడా నా ఆలోచనకు మద్దతునిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇక మనం ఎంత మాత్రమూ సమయాన్ని వృధా చేయకూడదు. వెంటనే మనం కార్యరంగంలోకి దూకాలి.'

'ఆజ్ఞాపించండి మహాప్రభూ! మేం ఏమి చేయాలో సెలవివ్వండి! ప్రణాళికలు రచించగల జ్ఞానం మీలో ఉంది. ప్రణాళికలు రచించవలసింది మీరు. వాటిని అమలు చేయడం మా పని....' అన్నారు లోకనాధులు!

'దేవుని పిల్లలను పాడు చేసి దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి నేను అనేక అంచెల వ్యూహాన్ని సిద్ధం చేసాను. నా
ఇప్పుడే