వాక్యసందేశముPost Date:2014-08-08//No:68

స్వాతంతోద్య్రమములో క్రైస్తవులుస్వాతంత్ర సమరములో  క్రైస్తవులు పాల్గొనలేదని అనేకులు భావింతురు. బ్రిటిష్‌ వారు  క్రైస్తవులు గనుక క్రైస్తవులు వారికి వత్తాసు పలికినారనీ, స్వాతంత్ర సమరములో క్రైస్తవులు పాల్గొనలేదనీ కొందరు పని కట్టుకొని మరీ ప్రచారము చేసినారు. చివరికి సెంట్రల్‌ సిలబస్‌ పుస్తకములను ప్రచురించే NCERT  (National Council of Educational Research and Training) తొమ్మిదవ తరగతి సోషల్‌ పుస్తకములో సమరయోధుల గురించి వ్రాసినారు కాని స్వాతంత్ర సమరములో పాల్గొన్న క్రైస్తవుల గురించి ఒక్క మాట కూడ వ్రాయలేదు. కాని నిజమునకు అనేకమంది క్రైస్తవులు స్వాతంత్ర సమరములో పాల్గొన్నారు. స్టాన్లీ జోన్స్‌,C.F. అండ్రూస్‌, J.C. విన్‌స్లో, వారియర్‌ ఎల్విన్‌ మొదలగు మిషనెరీలు కూడ స్వాతంత్య్ర సమరములో పాల్గొన్నారు. అందువలన వారు బ్రిటిష్‌ ఇండియాను వదలి వెళ్లవలసి వచ్చినది.

 1885 లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఆవిర్భవించిన తరువాత 3 వ సర్వసభ్య సమావేశములో 607 మంది పాల్గొన్నారు. వారిలో 15 మంది క్రైస్తవులు. ఒరిస్సాకు చెందిన క్రైస్తవుడైన మధుసూధన్‌ దాస్‌ ఆ సమావేశములో పాల్గొన్నారు. ఆయనకు ఉత్కళ గౌరవ్‌ అనే బిరుదు ఉండేది. ఆ సమావేశములోనే కాళీచరణ్‌ బెనర్జీ అనే బెంగాలీ క్రైస్తవుడు కూడ పాల్గొన్నారు. 1889 లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సర్వసభ్య సమావేశములో 10 మంది స్త్రీలు పాల్గొన్నారు. వారిలో ముగ్గురు క్రైస్తవులు. (వారు పండిత రమాబాయి, శ్రీమతి త్రింబన్‌ మరియు శ్రీమతి నికంచి).

  1973 లో తమిళనాడు ప్రభుత్వము తమ రాష్ట్రములోని స్వాతంత్య్ర సమరయోధుల జాబితాను ప్రకటించింది. వారిలో 103 మంది క్రైస్తవులు. శ్రీ J.C.కుమారప్ప బోస్టన్‌ యూనివర్సిటీ లోను, హార్వర్డ్‌ యూనివర్సిటీ లోను విద్యనభ్యసించిన తరువాత లక్నో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసారు. ఆయన సబర్మతీ ఆశ్రమములో గాంధీజీని కలుసుకొని ఆయనకు సన్నిహిత మిత్రుడైనాడు. J.C. అనగా జాన్‌ జేసుడాసన్‌ అని చాలమందికి తెలియదు. గాంధీజీ ప్రారంభించిన యంగ్‌ ఇండియా అనే పత్రికలో J.C.కుమారప్ప గారు వ్రాసిన ఉత్తేజకరమైన వ్యాసములకు అయనకు 18 నెలలు కఠిన కారాగార శిక్ష విధించబడినది. కాని గాంధీ ఇర్విన్‌ ఒడంబడిక వలన వారమురోజుల తరువాత విడుదలై 1932 లో మరల అరెస్ట్‌ అయి నాసిక్‌ జైలులో రెండున్నర సంవత్సరములు కఠిన కారాగార శిక్ష అనుభవించారు.

 కె.టి.పాల్‌ 1930 లో రౌండ్‌ టేబుల్‌ సమావేశములో పాల్గొన్నారు. జొయాకిమ్‌ ఆల్వా, జార్జి జోసఫ్‌, సామ్యూల్‌ మొదలగు క్రైస్తవులు  స్వాతంత్య్ర సమరములో పాల్గొన్నారు. శ్రీమతి జార్జి జోసఫ్‌, శ్రీమతి గ్రేసీ ఆరన్‌, మార్గరెట్‌ పావమణి, కుమారి మేరీ థామస్‌, కుమారి మెటిల్డా కాల్టన్‌ మొదలగు క్రైస్తవ స్త్రీలు కూడ చురుకుగా పాల్గొన్నారు. నా మాతామహులు కీర్తిశేషులు పాకెర్ల మనోహరము గారి చిన్న కుమారుడు పాకెర్ల సంజీవరావు గారు స్వాతంత్య్ర సమరములో పాల్గొని రాజమండ్రి జైలులోనే మరణించారు. ఆయన భార్య పుష్పరాజ్యమ్మ గారు ప్రస్తుతము ఉండ్రాజవరములో నివసిస్తూ స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పొందుతున్నారు.

 దేశము గురించి, దేశనాయకుల గురించి బైబిలు ప్రార్ధన చేయవలెనని ఉద్భోదిస్తున్నది. అధికారులకు లోబడి, విధేయులై ఉండవలెనని ఆజ్ఞాపిస్తున్నది. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్ధనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2 : 2   - డా|| పి.బి. మనోహర్‌
స్వాతంతోద్య్రమములో