వాక్యసందేశముPost Date:2014-06-03//No:59

ఆది అపోస్తలిక సంఘ లక్షణములు

ప్రియమైన పాఠకులకు క్రీస్తు నామమున శుభములు. క్రీస్తు నామమునందు విశ్వాసముంచి, పాప పశ్చాత్తాపముతో పాపక్షమాపణయు, ఆత్మ రక్షణయు పొందిన మనము క్రైస్తవ సంఘ సభ్యులము మరియు విశ్వాసులమైతిమి. అపోస్తలుల కార్యములు 2:42-47లో గల ఆది అపోస్తలిక సంఘ లక్షణములను ధ్యానిస్తూ, వాటి వెలుగులో ఈనాటి మన సంఘములు, విశ్వాసులుగా మన వ్యక్తిగతానుభవాలు ఒకింత పరిశీలన చేస్కొందాం.

1. ఆనాటి సంఘము దేవుని వాక్యమును నేర్చుకొనెడి సంఘము : ఆది అపోస్తలులు ఆత్మాభిషిక్తులై పాత నిబంధన లేఖనములలోని క్రీస్తును గూర్చిన ప్రవచనములు, అవి నజరేయుడైన యేసునందు నెరవేరిన విధము మరియు తాము వినిన యేసుక్రీస్తు ఉపదేశములను విశదీకరించగా ఆనాటి విశ్వాసులు శ్రద్ధాసక్తులతో నేర్చుకొనెడివారు. దేవుని వాక్యములో నిబిడీకృతమైయున్న దైవికజ్ఞానము, దేవుని కృప, దేవుని చిత్తము మన యెడల తండ్రియైన దేవుని ఉద్దేశ్యము మనము నేర్చుకోవలసి యున్నాము. అవి మనలను ఆత్మీయలోతుల్లోకి నడిపిస్తాయి, దేవుని సామీప్యతలోనికి నడిపిస్తాయి. సిసలైన జీవిత విలువలు మనకు అబ్బుతాయి, వానలు కురిసినా, వరదలు వచ్చినా పడిపోకుండా పటిష్టమైన పునాదిమీద కట్టబడిన యింటివలె నిలబెడతాయి. దేవుని వాక్యపు పునాది విశ్వాసికి స్థిరపునాది.

2. అది సహవాసమందు ఎడతెగక యుండిన సంఘము : 'ఎవరికి వారే యమునా తీరే' వలె ఉండెడిది సంఘమెన్నటికి కాజాలదు. రక్షించబడిన విశ్వాసి తన తోటి విశ్వాసులతో సహవాసము చేయుటద్వారా మరెన్నో ఆత్మీయ అనుభవాలు పొందుకోవడానికి అవకాశం కల్గును. సంఘమొక ఆత్మీయ కుటుంబము. ఇందున్న అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఒండొరులతో సత్సంబంధాలు కల్గి, దేవుని ప్రేమను పంచుకొంటుంటే విశ్వాసబాటలో ఎదగడానికి దోహదపడును. ఒక బొగ్గుముక్క మండుతూ ఉండాలంటే మండుతున్న పలు బొగ్గుముక్కల సావాసమెంతో అవసరం. కుంపటినుండి వేరైన బొగ్గుముక్క మండలేకపోగా మసిగా మారుతుంది. తోటి సంఘస్తుల సావాసము లేని విశ్వాసి గతియును అంతే. సహవాసములో ఆధ్మాత్మికజ్వాల వుంది, ఆత్మీయబలముంది.

3. అది ఎడతెగక ప్రార్ధించిన సంఘము : దేవుని సన్నిధిలో ప్రార్ధనలో గడుపుట మనలను బలపరచి, జీవిత సమస్యలను, సవాళ్ళను ఎదుర్కోడానికి ఊతమిచ్చును. లోకములోకి వెళ్ళకముందు ఆది అపోస్తలిక సంఘము దేవుని సన్నిధిలో గడిపేది. ప్రార్ధన అనగా మనము దేవుని సన్నిధిలో వచించెడి మాటలేకాదుగాని, మన భావనయైయున్నది. ప్రార్ధన పరలోకానికి, భూలోక వాసులు చేయు టెలిఫోన్‌ కాల్‌ వంటిది. మనుష్య మాత్రులమైన మనము దేవదేవునితో మాట్లాడుట అసామాన్యమైన ఆధిక్యత మరియు అవకాశము.

4. రొట్టె విరుచుటయందు గడిపిన సంఘము : ఇది ప్రభుభోజన సంస్కారమును సూచించుచున్నది. ఆనాటి సంఘము ఇంటింటా రొట్టె విరచినట్లుగా అపో||కా||2:46లో చూడగలము. ప్రభువు సంఘమునకిచ్చిన నియమములలో ప్రభుభోజన సంస్కారము యొకటి. సిలువలో రక్షకుడు చేసిన త్యాగమును, యాగమును జ్ఞాపకము చేసికొనుచు, దేవుని ప్రేమను మననం చేస్కొనుచు ఆయన మరణమును ప్రచురము చేయుటయు, కృతజ్ఞతా భావముతో దేవుని ఆరాధించుటయు ఇందున్న ప్రముఖ ఉద్దేశ్యము (1కొరింథి 111:24-26).

5. ఆనాటిసంఘం ప్రతివానికి భయము కలిగించెను (అపో||కా||2:42) : సంఘము లోపల మరియు వెలుపల నున్నవారికి సహితము గౌరవముతో కూడిన భయము కల్గెను. అయితే ఈనాటి సంఘము అందుకు ఎంతో భిన్నముగానున్నది. సంఘమనగా లోపటివారికి గాని, వెలుపటివారికి గానీ భయము, గౌరవము తగ్గిపోతున్న కాలమిది. విశ్వాసులు తమ సంఘముపట్ల అభిమానమును, గౌరవముతో కూడిన భయమును, ఆప్యాయతను, సదవగాహనను, సద్భావమును, సహకార భావము, సంఘీభావము, సమైక్యతను కల్గియున్నచో సంఘమునకు వెలుపటివారు సహితము ఎంతైనా సద్భావము పొందుట సాధ్యపడును. అయితే ఈనాటి విశ్వాసులు, సేవకులు 'మూఢురాలు తన చేతులతోనే తన యిల్లు ఊడబెరుకును' అనుచందమున ప్రవర్తించుట వలన సంఘము యొక్క ప్రతిష్ట దిగజారినట్లు గమనించగలము. ఏ కుటుంబపు మనుగడకైనా గుట్టుగానుండుట ఎంతయో అవసరము. అయితే దేవుని సంఘము తన గుట్టును కాపాడుకొనుటకు బదులుగా అల్లరి చేస్కొనుట వలన వెలుపటి వారిలో నిర్భయమును, చులకన భావమును కల్గించుటకు హేతువగుచున్నది.

6. ఆనాటి సంఘములో మహత్కార్యములు జరిగెను (అపో||కా||2:43) : స్వస్థతలు, మహత్కార్యములు గతమునకే పరిమితమనియు, వైద్యశాస్త్రము పెచ్చు పెరిగినందున అద్భుత కార్యములీనాడు అవసరము లేదనియు చెప్పెడు బోధకులు లేకపోలేదు. అయితే నమ్మినవారిపట్ల ఈ మహాదేవుడు నాడేగాక నేడును స్వస్థతలు, మహాత్కార్యములు జరిగించగల సమర్దుడై జరిగించుచున్నాడు. స్వస్థతలు, సూచకక్రియలు దేవుని అద్భుత శక్తికి, అద్భుత కృపకు తార్కాణములై విశ్వసించినవారిపట్ల క్రియారూపము దాల్చును, మేలు కల్గించును. తద్వారా దేవునికి మహిమయు, ప్రజలకు మేలును, సంఘమునకు క్షేమమును, అభివృద్ధియు కల్గును.

7. కలిగినవాటిని సమిష్టిగా పంచుకొన్న సంఘము : ప్రార్ధించుట, వాక్యము నేర్చుకొనుట, పరిశుద్ధాత్మ పొందుట మాత్రమేగాక ఒండొరుల అక్కరలు తీర్చుటకు సంఘ నాయకులైన అపోస్తలుల యొద్దకు అర్పణలు, ఆస్థులమ్మగా వచ్చిన సొమ్ములను తెచ్చింది ఆది సంఘము. కలిమి లేములమద్య వ్యత్యాసము లేకుండా అందరు ఉన్న దానిని సమిష్టిగా అనుభవించారు. అక్కరలోనున్నవారికి వారివారి అక్కరకొలది పంచి పెట్టబడెను. దీనిని కొందరు సిసలైన సోషలిజముగా అభివర్ణించిరి.

8. అది ఆరాధించు సంఘము (అపో||కా||2:46) : ఆనాటి ప్రజలకు దేవుని మందిరమునకు వెళ్ళి దేవదేవుని భక్తి ప్రవృత్తులతో ఆరాధించవలెనను ఆరాటముండెడిది. 'నా దేవుని సన్నిధిని నేనెప్పుడు కనబడెదను'? నా దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? జీవముగల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. 'దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది' (కీర్తన 42:1-2). ఇవి కోరహు కుమారులు ఆరాధనకొరకు ఆరాటముతో
ఆది