వాక్యసందేశముPost Date:2014-04-11//No:48

మట్టలాదివారము

  క్రీస్తు ప్రభువు మరణము 6 దినములకు ముందుగా యెరూషలేమునకు జయోత్సాహముతో వెళ్ళెను. యోహాను సువార్త 12:1. ఆయన బేత్పగేకు వచ్చినపుడు గాడిద పిల్లలను ఎక్కి జయోత్సాహముతో యెరూషలేముకు వచ్చెను. క్రీస్తు ప్రభువునకు మూడు పర్యాయములు ఘనస్వాగతము లభించునట్లు లేఖనములలో గమనించుచున్నాము.

ఎ. పరలోకము నుండి భూమికి లూకా 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానము కలుగును గాక అని దేవదూతలు స్తోత్రము చేయుచుండెను.

బి. బేతనీయనుండి, యెరూషలేముకు జయోత్సాహముతో వచ్చినప్పుడు త్రోవపొడవున బట్టలు పరిచి, పచ్చని చెట్లకొమ్మలు నరికి, దారి పొడుగునా పరిచి. దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు. స్తుతింపబడుగాక! సర్వోన్నతమైన స్థలములలో జయము అని ప్రభువును స్తుతించుచూ యెరూషలేము లోనికి ఆయనను తోడుకొనివచ్చెను.

సి. భూలోకము నుండి పరలోకమునకు పునరుత్థానుడైన తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు దేవదూతలు ఘనస్వాగతం చెప్పి, గలిలయ మనుష్యులారా మీరెందుకు ఆకాశమువైపు చూచుచున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన, ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అపో.కా.1:10-11. ఈ దినము నుండి పరిశుద్ధవారములో ప్రవేశించుచున్నాము. సిద్ధపడువారం. పస్కా, పెంతెకోస్తు పర్ణశాలల పండుగలకు యెరూషలేమునకు వెళ్ళుదురు. ప్రజలు ఆయనకు ఘనస్వాగతము పలుకుచుండగా శాస్త్రులు, పరిసయ్యులు నిరాశపడిరి.

1. ఆయన ఏలాగు వచ్చుచున్నాడు : దీనుడుగా గాడిదపై ఎక్కి వచ్చుచున్నాడు. జెకర్యా 9-9.

ఒంటెను ఎక్కుట కోపమునకు గుర్తు

ఏనుగు - అహంభావమునకు గుర్తు

గుర్రం - గర్వమునకు గుర్తు

పల్లకి - గొప్పదనమునకు గుర్తు

గాడిద - సాత్వికమునకు గుర్తు

ఈయన దీనుడుగానే ఈ భూలోకములోనికి వచ్చి, మనందరికి మాదిరి ఉంచిపోయెను. లూకా 1:52; 2:51; ఫిలిప్పీ 2:6-8; యాకోబు 4:6, హెబ్రీ 5:7-8; పరి|| అగష్టీన్‌ వాట్‌ ఈజ్‌ క్రిస్టియానిటీ? అని అడిగిన ప్రశ్నకు క్రిస్టియానిటీ ఈజ్‌ ఎ హ్యుమిలిటి. అని జవాబిచ్చెను. ఆండ్రూ ముర్రే అనే భక్తుడు దీనత్వము లోయ వంటిదనియు, గర్వము కొండవంటిదనియు; వర్షము లోయలోను, కొండమీదను ఏకరీతిగానే కురియుచున్నను, కొండమీదనుండి వర్షము లోయలోనికి చేరి లోయ ఫలించుచున్నట్లు దీనులైన వారు ఫలించుదురు అని చెప్పెను.

2. ఆయన ఆత్మసంబంధమైన రాజుగా వచ్చుచున్నాడు : రాజులను గౌరవించుట మానవుల ధర్మం. సైమన్‌ మక్కాబి యెరూషలేములోనికి వచ్చునపుడు (ఎపిఫానస్‌ను జయించెను) త్రోవ పొడవునా మట్టలు పరిచి, బట్టలు పరిచి ఆహ్వానించిరి. అలెగ్జాండర్‌ బబులోను దేశమునకు వచ్చినపుడు ఆయన గుర్రమును అలాగుననే నడిపించిరి. 1928లో సైమన్‌ కమీషన్‌ వచ్చినపుడు స్వరాజ్‌ పార్టీ వారు నల్లబాడ్జీలు ధరించి, సైమన్‌ కమీషన్‌ వెనక్కిపొమ్మని నిరసన తెలియజేసిరి. గాడిద నీచమైనది అయినను క్రీస్తుదానిపై ఉన్నందున దానికి ఘనత వచ్చినది. దేవుని బిడ్డలైన వారు దేవుని వాక్యము కలిగి ప్రభువునందు ఉన్నందున మన జీవితములలో ఘనతవచ్చినది. కీర్తన 149:9. మట్టల యొక్క పచ్చదనము నూతన మనసునకు సాదృశ్యము. వస్త్రములు నూతన ప్రవర్తనకు సాదృశ్యము. ఖర్జూర మట్టలు 1. అందమునకును, 2. ఆనందమునకును, 3. జయమునకును సూచనగా వాడుదురు. ప్రకటన 7:9.

3. ఆయన ఎందుకు వచ్చుచున్నాడు : ఎ. కలవరము తీసివేయుటకు మత్తయి 21:10 మానవుడు పాపము చేసిన వెంటనే పాపమును గూర్చియు తీర్పును గూర్చియు, మరణమును గూర్చియు కలవరపడుచున్నాడు. అట్టి మానవుని విమోచించి కలవరము తీసివేయడానికి వచ్చుచున్నాడు.

బి. దేవాలయమును శుద్ధీకరించుటకు : ఆయన ఆలయములో ప్రవేశించి ఆవరణలోని పశువులను తోలివేసి పకక్షులను వదలివేసి చిల్లర మార్చువారి బల్లలు పడద్రోసి నామందిరము ప్రార్ధనా మందిరము అనబడునని దానిని శుద్ధీకరించెను.

సి. మనమును ఆయనకు దేవాలయమై ఉన్నాము : దేవుని ఆత్మమనలో నివసించుచున్నాడు. 1 కొరింథి 3:9,16,17; హెబ్రీ 3:6 కనుక దేవుని ఆలయమైన మనము పవిత్రముగా ఉన్నామా? లేక ఆనాటి దేవాలయము రీతిలో వ్యాపారపు యిల్లుగా మార్చి దేవుని కృపకు దూరమగుచున్నామా? ఎవరికి వారే పరీక్షించుకొనవలెను. దేవుడు తన స్వరూపమందే తన పోలిక చొప్పున చేసినను అట్టిపోలిక చెడగొట్టుకొని భ్రష్టుడైయున్న మానవుని శుద్ధీకరించి తన కృపకు పాత్రులుగా చేయుటకు ఆయన మనలోనికి రావలెనని ఆశించుచున్నాడు. తలుపు తీసినచో మనతో కూడా నుండి సహవాసము చేయును. ఆది.కాం.1:26; ప్రసంగి 7:2; ప్రకటన 3:20. అట్టి కృప మనందరము అనుభవించునట్లు దేవుడు తన పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికిని ప్రసాదించును గాక! ఆమెన్‌.  - రెవ.చెల్లెం రాజారావు
మట్టలాదివారము