వాక్యసందేశముPost Date:2014-04-11//No:47

యేసుక్రీస్తు మరణం శాస్త్రీయమైనదేనా?

  'నజరేయుడైన యేసు' పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్‌ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షణంగా యేసుక్రీస్తును సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ త్రిప్పి... కొరడాలతో కొట్టి... యెరూషలేము వీధుల్లో సిలువను మోయించి... గొల్గొతాపై మేకులు కొట్టి... సిలువలో వ్రేలాడదీసి... ప్రక్కలో బళ్ళెపు పోటు పొడిచి... చిత్రహింసలకు గురి చేశారు. ప్రేమ, సహనములకు కర్తయైన దేవుడు వాటినన్నిటిని సహించి, భరించి సిలువలో మరణించాడు.

ప్రస్తుత ప్రపంచంలో యేసు సిలువ మరణంపై ఎన్నో అనుమానాలు... తర్జన భర్జనలు. కొన్ని మతశాఖల వారు అదే పనిగా యేసుక్రీస్తుపై బురద జల్లుతున్నారు. క్రీస్తు యొక్క మరణ, పునరుత్థానాలు క్రైస్తవ విశ్వాసానికి... నిరీక్షణకు పునాదిగా నిలిస్తే... ఆ పునాదులు పెకిలించాలని అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు సిలువపై యోగా చేశాడని కొందరు... చనిపోయినట్టు నటించాడని కొందరు... ఆ స్థానంలో మరియొకరిని సిలువ వేశారని ఇంకొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే! పరిశుద్ధ దేవుని మరణాన్ని పరిశుద్ధ లేఖనాలు అద్భుత రీతిలో స్పష్టం చేస్తున్నాయి. ఆధునిక వైద్య శాస్త్రం కూడా యేసుక్రీస్తు మరణం సిలువపైనే జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. ఎందుకంటే అది ముమ్మాటికి నిజం కనుక!

గెత్సెమనే తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్ధించుట మొదలు పెట్టెను. శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని ప్రార్ధించుమని చెప్పెను. అతి వేదనతో ప్రార్ధించుట వలన చెమట రక్తపు బిందువులుగా మారెను. వైద్య పరిభాషలో దానిని హెమాటిడ్రోసిస్‌ లేదా హెమటోహైడ్రాలసిస్‌ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం శ్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష యొక్క తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్ధించెను.

కొరడాలతో కొట్టబడుట : (Scourging)

ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. రోమన్లు ఉపయోగించే కొరడా అతి భయంకరమైనది. ఒక్కొక్క కొరడాలో నాలుగు శాఖలుంటాయి. చెక్కతో చేయబడిన పిడి దానికి ఉంటుంది. జంతువుల చర్మముతో చేయబడిన త్రాళ్ళకొనలకు పదునైన ఎండిన ఎముకలు మరియు లోహపు గుళ్ళు ఉంటాయి. కొరడా తయారీని ఊహిస్తేనే భయమనిపిస్తుంది. అటువంటి కొరడాతో యేసుక్రీస్తు ప్రభువును అతి తీవ్రంగా గాయపరిచారు.

ముందుగా కొరడా శిక్ష విధించబడిన వ్యక్తి యొక్క వస్త్రములు లాగివేస్తారు. ఏర్పాటు చేయబడిన ఒక మ్రానుకు ఆ వ్యక్తిని కదలకుండా కట్టివేస్తారు. ఆ తరువాత వెనుక భాగమున ఇద్దరు సైనికులు నిలువబడి ఒకరి తర్వాత మరియొకరు విపరీతంగా కొడతారు. దెబ్బలు కొట్టే సైనికులే అలిసిపోతారంటేనే పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. దెబ్బలు కొట్టుచున్నప్పుడు లోహపు గుళ్ళు తీవ్రమైన నొప్పిని కలుగచేస్తాయి... పదునైన ఎముకలు... ముళ్ళు... శరీరంలోనికి దిగబడి మాంసాన్ని పెకిలిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియలో చాలా మంది తీవ్ర రక్త స్రావం జరిగి అక్కడ కుప్పకూలిపోతుంటారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఆ దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూర్చబడాలని మనకోసం వాటిని భరించెను (1 పేతురు 2:24). మనకు రక్షణ భాగ్యం కలిగించడానికి తీవ్ర బాధను అనుభవించారు.

సిలువ శిక్ష అమలు : (Crucifixion)

సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరిచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరిచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశ్యంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్‌ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు మరియు పరాయి దేశస్థులకు, నేరస్థులకు ఈ శిక్ష విధించేవారు.

యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి... భుజాలపై సిలువను మోపి సుమారుగా ఒక కిలోమీటరు నడిపించారు. మధ్యలో కురేనీయుడైన సీమోను కూడా సహకరించాడు. సిలువ యొక్క బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. గొల్గొతా అనగా కపాలమనబడిన స్థలము. మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్‌ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు.

మేకులు కొట్టుట : (Nails)

సిలువ వేసే స్థలము నొద్దకు తీసుకొని వచ్చిన తరువాత నేరస్థునికి బోళము కలిపిన ద్రాక్షారసము ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువు దానిని తీసుకోలేదు. వెంటనే నేరస్థుని సిలువపై పండబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొడతారు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు 7 అంగుళాల (18 సెం.మీ) పొడవు ఉండును. సుమారు 1 నుండి 2 సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్‌ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ పై ఉంచి చేతులలో కాళ్ళల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు.

బళ్ళెముతో పొడవబడినపుడు రక్తమును, నీరును కారెను (యోహాను 19:34) :

మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వ్రేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్ద కేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువమీద
యేసుక్రీస్తు