వాక్యసందేశముPost Date:2014-02-28//No:40

భస్మ బుధవారం

  ప్రియులైన పాఠకులకు క్రీస్తుయేసు నామమున శుభములు. ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అనేక క్రైస్తవ శాఖలు మార్చి నెల 5వ తేది (బుధవారం) నుండి ఏప్రిల్‌ 19వ తేది (శనివారం) వరకు 40 దినములపాటు లెంటు దినములను ఆచరించుటకు సిద్ధపడుచున్నారు. ఈ లెంటు దినముల Lent Days  ఆచరణ, ప్రాముఖ్యతలను గురించి కొంత ధ్యానించుకుందాం :

లెంటు యొక్క ప్రాచీన మూలాలు : బైబిలు పండితుల పరిశోధనా వివరముల ప్రకారము - ఈ 40 ఉపవాస దినముల ఆచారము బబులోనీయుల దేవతారాధకుల (Worshippers of babylonioan Goddes - Tammuz) నుండి క్రైస్తవారాధకులలోనికి ప్రవేశించింది. బబులోనీయులు క్రీస్తు పూర్వము నాటివారు. అటు తర్వాత ఇంగ్లండ్‌లోనికి వలస వచ్చిన జర్మనులు (ఆంగ్లో-శాక్సన్స్‌) దీనిని ఆచరించినారు. Lent  అను ఇంగ్లీషుపదము Lenz అను జర్మను పదము నుండి పుట్టింది. దీనిని డచ్‌ భాషలో Lente అనియు, ఆంగ్లో శాక్సన్‌ భాషలో Lencten  అనియు అందురు. లెంట్‌ అనగా వసంతకాలము అని అర్ధము. కొమ్మలను చీల్చుకుంటూ చిగురుటాకులు బయటికి వచ్చు కాలమే వసంత కాలం (Spring Season) ఇది దీర్ఘకాల ఋతువు కూడా. రోమా ప్రభుత్వ కాలములో లెంటు ఆచరణను కాన్‌స్టాంటైన్‌ చక్రవర్తి క్రీ.శ.313లో క్రమబద్ధీకరించాడు. అట్లు ఈ ఆచారము కాథలిక్కుల నుండి ప్రొటస్టాంట్‌ మొ||గు ఇతర క్రైస్తవ శాఖలలోనికి ప్రవేశించింది.40 ఉపవాస దినముల లెంటు : ఈ సంవత్సరం మార్చి నెల 9వ తేదీ బుధవారము నుండి ఏప్రిల్‌ నెల 23వ తేదీ వరకు 46 దినములైనను, ఈ మధ్య కాలములో వచ్చు 6 ఆదివారములను మినహాయిస్తే, ఈస్టరు పండుగకు ముందురోజైన శనివారముతో 40 ఉపవాస దినములు పూర్తియగును. కాని కొన్ని శాఖలవారు కొన్ని సడలింపులు చేసుకుంటూ ఆచరిస్తున్నారు.

ఇట్టి ఆచరణను గురించి బైబిలు నిశ్శబ్దంగా వుంది. దీనిని ఆచరించమని బైబిలులోని క్రొత్త నిబంధనలో చెప్పబడలేదు. కానీ క్రైస్తవులు మాత్రం ప్రభువైన క్రీస్తు అరణ్యములో ఉపవాసముండిన 40 దినముల సమయాన్ని అనుకరిస్తూ ఆచరిస్తూ ఉన్నారు. వారు ఇట్టి దానిని ప్రార్ధనా పూర్వకముగా నిర్ణయించుకుని ఆచరించుట మంచిదే !

భస్మ బుధవారం గురించి బైబిల్‌ ఏమి చెపుతుంది ? : ఉపవాస దీక్ష ప్రారంభ దినమే భస్మ బుధవారం. ఈస్టరు ఆదివారమునకు ముందు 46 రోజులను లెక్కించగా వచ్చు బుధవారాన్ని భస్మ బుధవారంగా పరిగణిస్తారు. కానీ బైబిలు ఇట్టి దానిని గురించి ఏమీ చెప్పదు. కానీ భస్మమును గురించి మాత్రమే చెపుతుంది. పాత నిబంధన కాలములో (1450 బి.సి. - 500 బి.సి. మధ్యకాలములో) దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల పాపశుద్ధి Purification form sin కోసం మోషె ద్వారా నిర్ణయించిన కట్టడము గురించి సంఖ్యాకాండము 19 అధ్యాయంలో చూడగలము. అక్కడ దహించబడిన పెయ్య యొక్క భస్మము (బూడిద ash) మరియు పాప పరిహార జలము గురించి వివరించబడిది. లోక రక్షకుడైన క్రీస్తుయేసు పాపపరిహారార్ధబలిగా తనకు తానే సిలువలో అర్పణము గావించుకొనుట ద్వారా పాత నిబంధన ఆచారములను కొట్టివేసెను. ఆయన సిలువలో కార్చిన పవిత్ర రక్తము ద్వారానే నరులకు పాపపరిహారం కలుగుతుందని నిరూపించాడు. పశువుల బూడిద కంటెను, పాప పరిహార జలముల కంటెను శ్రేష్టమైన యేసు రక్తము మాత్రమే పాపశుద్ధి సాధనం - ఆయన రక్తమే మనస్సాక్షిని శుద్ధీకరించి నిర్మలము చేయు దివ్యౌషధం ! (హెబ్రి. 9:13-14)

భస్మమును గురించిన సందర్భములను గమనిస్తే - భక్తుడైన యోబు దేవునితో వ్యాజ్యమాడి, చివరికి దైవ న్యాయాన్ని గ్రహించిన వాడై - 'దేవా, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను, బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను' అంటూ పలికిన మాటలు హృదయాలను కదిలిస్తాయి. (యోబు42:3-6). అట్లే నీనెవె పట్టణస్థులు గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపముతో తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు వారిని క్షమించెను (యోనా 3:4-10).

ఇట్లు పశ్చాత్తాప ప్రార్ధనలకు బాహ్యాచారమే భస్మమును చల్లుకోవడం. కాని యేసు కొండమీది ప్రసంగములో శిష్యులకు ఇట్లు బోధించెను - 'మీరు ప్రార్ధన చేయునప్పుడు వేషధారులవలె ఉండవద్దు... వ్యర్ధమైన మాటలు పలుకవద్దు... మీరు ఉపవాసము Fasting చేయునపుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి... కాని నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును' (మత్తయి 6:5-18) యెషయా. 58 ధ్యానించండి. లెంటు దినములలో ఉపవాస ప్రార్ధన : లెంట్‌ అంటే వసంత కాలమనే అర్ధముందని మనము గ్రహించినట్లైతే - అది ఆత్మసంబంధమైన వసంతకాలం Spiritual Spring Season గా మారాలి, ఆచరించబడాలి. వసంత ఋతువులో చెట్టు చిగిర్చి పూలు పూసి వికసిస్తాయి. వాటిలో గల నూతనత్వం, పరిమళం, సృష్టికి క్రొత్త శోభను సమకూరుస్తాయి.

ఒక పాపి పశ్చాత్తాపంతో మారుమనస్సు పొంది నూతన వ్యక్తిగా మార్చబడాలంటే - అతని పాషాణ హృదయం బ్రద్దలై కరిగిపోవాలి; దుష్టత్వం దహించబడాలి; అంధకార జీవితంలోకి క్రీస్తు యొక్క వెలుగు ప్రవేశించాలి. అట్టి గొప్పకార్యం జరగాలంటే అతడు / ఆమె ఈ 40 దినాలను వ్యర్ధపరచుకొనకుండ, ఉపవాస కన్నీటి ప్రార్ధనలోను, దైవవాక్య పఠనలోను గడపాలి. ఆయన పవిత్ర రక్తంతో తనను ప్రోక్షించి శుద్ధీకరించమని ప్రాధేయపడాలి. నిజమైన పశ్చాత్తాపానికి ప్రతిఫలం 40 రోజులలోపే అభిస్తుంది. ఒక్క రోజులోనే పాపులను క్షమించే దేవుడు యేసు మాత్రమే.

ఇక విశ్వాసుల 40 దినముల ఉపవాస ప్రార్ధనలను యదార్ధహృదయులై దీక్షకలిగి ఆచరిస్తే ఆత్మీయ ఎదుగుదల మరియు ఆత్మాభిషేకం వారి సొంత మౌతాయి. ఒకవేళ పడిపోయిన స్థితిలోనున్నచో, వాక్యపు వెలుగులో దిద్దుబాటు చేసుకుంటూ తిరిగి నూతన జీవం పొందగలరు. చెట్టుకు గాయమైతేనే (బెరడు పగిలితేనే) ఆ పగుళ్ళలో నుండి క్రొత్త చిగురు పుడుతుంది. అది భౌతిక వసంతకాలం. మానవ హృదయం విరిగి నలిగి పగిలితేనే అందులోనుండి నూతన హృదయం ఉదయిస్తుంది. - ఇది ఆత్మీయ వసంతకాలం ! - రెవ.డా||గుడిపాట
భస్మ