వాక్యసందేశముPost Date:2013-11-16//No:37

గిలాదు పర్వతముల మీది మేకల మందలను పోలి యున్నదిసోలోమోను షూలమ్మితిని అనేక విధాలుగా పోల్చుచున్నాడు. ఈ వచనంలో ఆమె కళ్ళు గువ్వ కళ్ళతో పోల్చాడు. తరువాత ఆమె తలవెంట్రుకలను గిలాదు పర్వతముపైన వున్న మేకల మందలతో పోల్చుతున్నాడు. గిలాదు పర్వతముపైన మేకలమందలు ఎంతో సౌందర్యముగా కన్పిస్తాయి. అలాంటి సౌందర్యం షూలమ్మితిలో వుండాలని సోలోమోను ఆశ. అలాంటి సౌందర్యం దేవుని ప్రజలైన మనలో వుండాలని ప్రభువు యొక్క ఆశ. గిలాదును గూర్చి అనగా ఆత్మీయ సౌందర్యాన్ని గూర్చి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం.

గిలాదు
1. 1 రాజు 17:1 గిలాదులో దైవ సన్నిధి వుంది : ప్రవక్తయైన ఏలియా గిలాదు కాపురస్తుడు. ఆయన ఆహాబు నొద్దకు వచ్చాడు. తాను దేవుని సన్నిధిలో నిలుచున్నానని చెబుతున్నాడు. మహారాజు ఎదుట నిలువక పూర్వం గిలాదులో దేవుని సన్నిధిలో నిలిచాడు. మనుష్యుడు ఎదుట నిలువక ముందు మనం దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడు మనబోధ ఫలిస్తుంది. మనజీవితం ఫలభరితంగా వుంటుంది. దేవుని సన్నిధిలో జీవింపక మనం చేసే ప్రసంగాలు మనం మాట్లాడే మాటలు ఫలభరితంగా వుండవు. ప్రభువు పనిచేయకముందు ప్రభువు పాదసన్నిధి భాగ్యం మనకుండాలి. ప్రభువు పాదసన్నిధి మనకు ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలుగజేస్తుంది. ఇదే గిలాదు అనుభవం.

2. సంఖ్యా 32:1 గిలాదు మందలకు తగినస్థలం : గిలాదు మందలకు తగిన స్థలమని రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వారు తెలుసుకున్నారు. ఇది యోర్దానుకు ఇవతలప్రదేశం. యోర్దాను అవతల వాగ్దానభూమివుంది. మందల నిమిత్తం వాగ్దానభూమిని ఈ గోత్రములవారు విడిచిపెట్టారు. ప్రభువు చిత్తం నెరవేర్చుటకంటే వారి సౌఖ్యాన్నెక్కువగా ప్రేమించారు. వారికి మందలే ప్రాముఖ్యమని అన్పించాయి. దేవుని బిడ్డలైన మనం దేవుని పిలుపుకు ఎక్కువ ప్రాముఖ్యత నివ్వాలి. తాత్కాలికమైన మందలనిమిత్తం వీరు నిత్యస్వాస్థ్యాన్ని కోల్పోయారు. దీనిద్వారా ఆత్మీయ సౌందర్యాన్ని కూడా కోల్పోయారు. సేనదయ్యం పట్టినవాడు వీరి సంతానపు వాడు. అనగా గాదు గోత్రీకుడు. వీరున్న ప్రదేశాన్ని గదరేనీయుల ప్రదేశమన్నారు. మార్కు 5 అధ్యాయంలో మనం చదివే గదరేనీయులు వీరి సంతానపు వారే. ప్రభువును తమ ప్రాంతములు విడిచి పొమ్మని వీరు కోరారు. యాకోబు కుమారులైన వీరు ఎంత ఆత్మీయ భ్రష్టత్వానికి చేరారో మనం గమనించాలి. వీరు పందులను మేపుచు, చీకటి శక్తులకు బానిసలై సమాధుల్లో నివసించే దౌర్భాగ్యస్థితికి దిగజారిపొయ్యారు. వస్త్రహీనులుగా వుండి తమ్మును తాము గాయపర్చుకుంటున్నారు. ప్రభువు కనికరం గలవాడు. అందువలన (మార్కు 5 అధ్యాయంలో) వీరిని దర్శించాడు. పూర్తిగా పతనమైన సేన దయ్యము పట్టినవాని మనస్సు మార్చాడు. అతనికి వస్త్రాలు ధరింపజేసాడు. ప్రభువు పాదసన్నిధిలో వుండే మహాభాగ్యమిచ్చాడు. ఇదే గిలాదు సౌందర్యం. పతనమైనవారు ఆత్మీయంగా వున్నతమైన స్థితికి రావడం గిలాదు సౌందర్యం. ఈ సౌందర్యం ప్రభువు మనలో చూడాలని ఆశిస్తున్నాడు. 

3. యిర్మియా 8:22 గిలాదులో స్వస్థత : యిర్మియా దినాల్లో దేవుని, ప్రజలు, చేయకూడని పనులు చేశారు. అపవిత్రమైన కార్యాలు చేశారు. వారు దేవాలయాన్ని నమ్ముకున్నారు కాని దేవుణ్ని నమ్మలేదు. చెడుమార్గాల్లో నడిచారు. చెడుక్రియలు జరిగించారు. వారి పొరుగువారి ఎడల అన్యాయం చేశారు. పరదేశులను, తండ్రిలేని వారిని, విధవరాండ్రను బాధించారు. అబద్ధాన్నే నమ్ముకున్నారు. దేవుని వాక్యసత్యాన్ని త్రోసివేశారు. జారచోరక్రియలు చేశారు. ఇట్టిపనులు చేసి ఆత్మీయంగా రోగులయ్యారు. వీరి రోగనివారణకు వైద్యుడు, ఔషధము, గిలాదులో దొరుకును. వైద్యుడు ప్రభువే, ఔషధము ప్రభువే. మన బలహీనతల్లో ఆత్మీయంగా ఓడిపోయినపుడు పరమవైద్యుడైన ప్రభువు నొద్దకు వెళ్ళాలి. ఆయనే మన రోగములన్నిటి భరించాడు. ఆయనే మనలను బాగుచేయువాడు. మనరోగములను రూపుమాపి మన పరమవైద్యుడు మనకు ఆత్మసంబంధమైన సౌందర్యానిస్తాడు. ప్రభువే ఇలాంటి సౌందర్యాన్ని షూలమ్మితికి దయచేశాడు. మన బలహీనతల వల్ల మనకున్న ఆత్మీయ వికార రూపాన్ని తీసివేసి, ఆత్మీయరోగాలను నయంచేసి ప్రభువు మనకు ఆత్మీయ సౌందర్యాన్ని దయచేస్తాడు. మనమెల్లప్పుడు ఆత్మసంబంధమైన రోగులుగా వుండకూడదు.

4. యిర్మియా 50:19-గిలాదు మేతస్థలం : ఇశ్రాయేలీయులు బబులోను రాజుచేత దండించబడ్డారు. వారు తమ స్వదేశమునుండి చెదరిపోయారు. దేవుని సన్నిధికి దూరమైపోయారు. సాతానుడు దేవుని ప్రజలను చెదరగొట్టాడు. శ్రేష్టమైన ప్రదేశాలలో దేవుని ప్రజలు దేవుని సమృద్దిని అనుభవిస్తున్నారు. అలాంటి సమయంలో సాతాను దేవుని ప్రజలను దేవునికి దూరం చేశాడు. యిర్మియా 50వ అధ్యాయం సారాంశమిదే. దీనినుండి మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. ప్రభువు బిడ్డలైన మనం ఆయన మందిరంలో వుంటూ ఆయన సమృద్ధిని అనుభవిస్తున్నాం. ఆయా కారణాలు చూపించి సాతానుడు మనల్ని మందిరానికి దూరం చేస్తాడు. దేవుని సన్నిధికి ఎవరు దూరమైనా అది క్షమించరాని నేరమౌతుంది. మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు రాక తప్పవు. వాటి నధిగమించి తిరిగి అందరూ ఐక్యపడాలి. అంతేగాని ఎవరిదారిని వారు సంఘాన్ని విడువరాదు. అయితే ఆయనలో సంఘంలో నుండి దూరమై పోయినవారు తిరిగి సంఘంలో చేరితే సమృద్దియైన ఆహారం దొరుకుతుంది. విశ్వాసులు పుష్టికరంగాను, సౌందర్యంగాను వుంటారు. మీరు సంఘంనుండి దూరమైన విశ్వాసి అయితే మేతకొరకు మరలా సంఘానికి రండి అదే ఆత్మీయ సౌందర్యం.

- ఎమ్‌.ఇమ్మానుయేలు