వాక్యసందేశముPost Date:2013-11-10//No:36

కృతజ్ఞతార్పణలుదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను నేర్పుటలో రాజైన దావీదు దిట్ట. దావీదు తన జీవిత కాలమంతా అనేక విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనందరికి ఒక గొప్ప మాదిరిని విడిచి పోయెను. ఆయన రచించిన కీర్తనలలో తరచు హృదయము పొంగి పారునట్లు కృతజ్ఞతల ప్రవాహమును చూడగలము. ప్రసిద్దిగాంచిన 103వ కీర్తన ప్రత్యేకమైనది. ఇందులోని విశేషము విన్నపాలు లేకుండా కేవలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మాత్రమే ఉన్నాయి. దేవుడు అనుగ్రహించిన వాటికొరకై ఆయనను కొనియాడడము. ఆయనకు మనస్ఫూర్తిగా నిండుగా కృతజ్ఞతలు చెల్లించడము గొప్ప ధన్యత. రాజైన దావీదు తన అంతరంగమందున్న సమస్తముతో దేవునిని సన్నుతించుటకు కారణం, ఆయన చేసిన ఏ ఉపకారములను మరువక పోవడమే! మన జీవితాల్లో అనేకసార్లు అనేకులకు ఎన్నో విషయాల కొరకై 'థ్యాంక్స్‌' చెబుతాము. ఒకరి ద్వారా ఏదైనా సహాయం లేక మేలు పొందినపుడు వెంటనే 'థ్యాంక్యూ' అని చెప్పడము చాఆ మందికి సహజంగా ఉండే అలవాటు. అయితే మనకు జీవాధారకుడై, విమోచకుడై, సంరక్షకుడై, పోషకుడై, మరియు ప్రాణప్రియుడైన ప్రభువుకు ఆయన చేసిన 'లెక్కకు విస్తారమైన' మేళ్ళ కొరకు ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని ఉపకారములు మరిచేవారు, వాటిని పొందిన తర్వాత ఆయనను విడిచేవారు ఎక్కువైపోతున్న ఈ దినాల్లో, వాటిని జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తోత్రము చెల్లించుట అత్యవసరం. ఇంగ్లీషులో కృతజ్ఞత (Gratitude)మరియు కృప (Grace) అను పదాలు ఒకే మూల పదములో నుండి వచ్చినవి. మనము దేవుని కృపను అనుభవించిన వారమైతే తప్పక ఆయనకు కృతజ్ఞత చెల్లింపక ఉండలేము! మరో విశేషం ఇంగ్లీషులో ధన్యవాదము (Thank)మరియు ధ్యానము (Think) అను పదాలు కూడా ఒకే మూల పదానికి చెందినవి. మనము ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా ఆయనకు ధన్యవాదములు చెల్లిస్తాము.దేవుని యెడల మనోహరమైన భావమును కలిగి ఆయన మహిమార్ధమై మన మనస్సుల నిండా కృతజ్ఞతలు ప్రవహించాలి 'కృతజ్ఞత' లేక 'థ్యాంక్స్‌' లో గమనించదగ్గ మూడు విషయాలు. మొదటిది, గుర్తింపు - మనము పొందిన మేలు, లాభము, సహాయము, లేక ఆశీర్వాదమును గుర్తించుట. రెండవది, ప్రశంస - కార్యము చేసిన దేవునిని తగురీతిలో ప్రశంసించుట. మూడవది, కృతజ్ఞత చూపుట - దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు మనలను సమర్పించుకొనుట.

కృతజ్ఞతార్పణలు
కృతజ్ఞతాస్తుతి చెల్లించుట మంచిది (కీర్తనలు 92:1) దేవుని కొరకు మనం చేయగలిగిన మంచి విషయాల్లో కృతజ్ఞతాస్తుతి ఒకటి. క్రైస్తవ జీవితములో ఇది ప్రాముఖ్యమైనది. అబ్రాహాం లింకన్‌ అమెరికా రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, తన పనిలో లీనమై తీరికలేని వాడిగ ఉండేవాడు. అనేకులు ఆయన దగ్గరకు సహాయము, మేలు కొరకు వచ్చేవారు. ఓసారి ఓ వృద్ధురాలు ఆయనను కలుసుకోవడానికి అపాయింట్‌మెంట్‌ తీసుకొని ఆయనను చూడవచ్చింది. యధావిధిగా లింకన్‌ ఆమెను సాదరంగా ఆహ్వానించి ఆమెకు ఏ సహాయం కావాలో అడిగి తెలుసుకోబోయాడు. అయితే ఆమె 'అబ్రాహాం, నేను ఏ సహాయం కొరకు రాలేదు. నీవు మా కొరకు దేశం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నావు. నీకు ఇష్టమైన బిస్కెట్‌లను గూర్చి తెలుసుకున్నాను. వాటిని నీ కొరకు చేసి తీసుకు వచ్చాను, అంతే' అని ఆమె వాటిని ఆయనకు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ సంఘటన లింకన్‌ కళ్ళు చెమర్చేట్లు చేసింది. ఎందరో తన దగ్గరకు వచ్చారు, తన నుండి ఏవేవో పొందారు. అయితే తనను గూర్చి ఆలోచించి తన కొరకు ప్రేమతో పంచి ఇచ్చిన వారు లేరు.దేవుని యొద్ద మనం నిరంతరం ఈవులను పొందుతూనే ఉంటాము. ఎప్పుడైనా కేవలము ఆయన ఏమైయున్నాడో, మన కొరకు ఏమి చేసాడో దాని విషయము కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా?    కృతజ్ఞతాస్తుతి దేవుని ఆజ్ఞ అయి ఉన్నది (1 థెస్స. 5:18)ప్రభువు ప్రేమను అనుభవించినవారు ఆయనను ప్రేమించేవారు నిత్యము కృతజ్ఞతలు చెల్లింపబద్దులై యుండాలి. ప్రతి విషయంలో దేవుని మార్గమును అనుసరించేవారు ఆ విషయాలు వారి మేలు కొరకై దేవుని చేత వాడబడతాయి. కనుక అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతా వచనము పరిశుద్ధుల చిహ్నము (ఎఫెసీ 5:4). కృతజ్ఞత విశ్వాసి నాలుకను శుద్ధిచేయు సాధనమై ఉన్నది. రక్షణ అనుభవంలేని భక్తిహీనుల హృదయాలు కృతజ్ఞతారహితమైనవి. కృతజ్ఞతారహితమైన హృదయము సమస్త పాపములకు కేంద్రము (రోమా 1:21). కృతజ్ఞత చెల్లింపక పోవడము, త్రాగుడు, దొంగతనము, అబద్ధములు, మొదలగు పాపముల కన్నా భయంకరమైనది మరియు అన్నింటి కన్నా ఘోరమైనదని షేక్స్‌పియర్‌ వ్రాశాడు! కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధిలోనికి ప్రవేశించుట ఆయన ఆదేశము. కృతజ్ఞత చెల్లించుట దేవుని ఆజ్ఞగా ఉన్నప్పటికీ దానిని క్రైస్తవుడు తనపై బరువుగా కాక బాధ్యతగా చూడాలి. వాక్యమంతటిలో భక్తులు ఎల్లవేళలా సంతోషముతో ఆరాధన భావముతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించిరి.కృతజ్ఞతాస్తుతి దేవుని మహిమపరుచును (2 కొరింథీ 4:13) రక్షింపబడినవారు దేవుడు వారి జీవితాల్లో చేసిన ఘనమైన, ఆశ్చర్యమైన కార్యముల కొరకు సాక్ష్యము పలికినప్పుడు లేక కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు ఆయన మహిమపరచబడతాడు. కొందరు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుటకు నోరు మెదపరు కాని తమను తాము పొడగుకొను విషయము నోటిని ఆపరు. క్రైస్తవుల్లో ఎక్కువశాతం సణుగు, గొణుగు మరియు ఫిర్యాదులు వినబడతాయి. ఇశ్రాయేలీయులు దేవుని మేలులను మరచి ఆయనను మహిమపరచక ప్రతి చిన్న విషయానికి సణిగి నశించిరి. సణుగుడు మరియు ఫిర్యాదులు కృతజ్ఞతాస్తుతికి వ్యతిరేకమైనవి. అవి దేవునికి హేయమైనవి. సణుగులు ఫిర్యాదులు దేవుని యందు అపనమ్మికకు, ఆత్మీయ హీనతకు సూచనలు. అవి దేవునిని కించపరుచును. దేవుని పై ప్రేమ, నమ్మిక నిత్యము కృతజ్ఞతాస్తుతికి కారణమవుతాయి. ఫ్యాన్సీ క్రాస్‌బీ చిన్న తనములోనే గ్రుడ్డితనానికి గురైనా తన జీవిత కాలమంతటిలో ఎన్నడూ సణుగలేదు. దేవుని పై కృతజ్ఞతతో జీవించింది. కొన్ని వేల ఆత్మీయ గీతాలను రచించి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది విశ్వాసులకు ప్రేరేపణగా మారింది. ఆమె గీతాల్లో కృతజ్ఞతాస్తుతి ఉట్టిపడేది. కృతజ్ఞతా భావముతో దేవునిని గొప్పగా మహిమపరచింది.కృతజ్ఞతాస్తుతిలోని మూడు దృక్పధములు : మొదటిది, అనవసరము - ఈ కోవకు చెందినవారు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుట అనవసరమంటారు. సమస్తము తమ వలననే కలిగినదని ఉప్పొంగి దేవునిని విస్మరిస్తారు. (లూకా 12వ అధ్యాయములో) ధనవంతుడు కలిమిని గూర్చి ఆలోచించినప్పుడు దాని అంతటికి తానే మూలమని మురిసిపోయాడు. దేవునిని పూర్తిగా మరిచిపోయాడు. (లూకా 12:16-19లో) 'నా, నాకు, నేనేమి, నేనీలాగు' మొదలగునవి అనేకసార్లు కనబడుట అతని బుద్ధిని బయటపెడుతున్నాయి! హెన్రీమూర్‌ హౌస్‌ అనే భక్తుడు ఓ సారి భోజనానికి కూర్చున్నప్పుడు తనతోపాటు మరొకడు కూర్చున్నాడు. ఆయన భోజనానికి ముందు దేవునికి స్తోత్రాలు చెప్పి భోంచేయడం మొదలు పెట్టాడు ఎదుటి వ్యక్తి అమాంతం తినడం మొదలు పెట్టాడు. ఆయన అతని, 'దేవునికి స్తోత్రము చెప్పవా?' అని అడిగినప్పుడు 'నా జ్ఞానముతో, నా బలముతో నేను సంపాదించుకొనిన దానికి దేవునికి ఎందుకు స్తోత్రము చెప్పాలి?' అంటు తినసాగాడు. 'మా ఇంటిలో నీవంటివాడు ఒకడున్నాడు' అని హెన్రీ పలికినప్పుడు అతడు 'ఎవరు'? అని అడిగాడు. దానికి ఆయన 'మా కుక్క' అని జవాబిచ్చాడు.రెండవది, వేషధారణతో కూడుకున్నది - కొందరు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పటికీ మట్టిముంతపై పూత పూసినట్టు దానిలో వేషధారణ దాగి వుంటుంది. (లూకా 18వ అధ్యాయములో) పరిసయ్యుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పటికీ అందులో తనను తాను పొగుడుకుంటూ తనకు తానుగ మిడిసి పడ్డాడు.కొందరు ప్రత్యేకంగా దేవుని పేరట కృతజ్ఞత కూడికలు తమ గృహాల్లో లేక సంఘాల్లో ఏర్పాటు చేస్తారు. తరుచు ఈ కూడికలు దేవుని ఘనపరుచుట కన్నా వారి గొప్పను చాటుటకు ఎక్కువగా ఉపయోగపడతాయి, వేషధారణ యదార్ధతకు తావులేకుండా చేస్తుంది.'Get on your knees and thank God you're on your feet' - Irish Proverbఅతని ప్రార్ధనలో ఇతరుల పట్ల హేళన, దేవుని పట్ల వేషధారణ, తన పట్ల హెచ్చింపు కనబడుతున్నాయి. నిజమైన కృతజ్ఞత గల హృదయము వినయంతో నిండి ఉంటుంది.

మూడవది, నిజమైన కృతజ్ఞతాస్తుతి - యదార్ధవంతులు నిజముగా దేవునికి నిండు హృదయాలతో కృతజ్ఞతాస్తుతి అర్పించెదరు. ఒకసారి పదిమంది కుష్టువారు ప్రభువైన యేసును తమను కరుణించమని వేడుకున్నారు (లూకా 17వ అధ్యా.). ఆయన వారిని వెళ్ళి యాజకులకు కనబర్చుకొనమని చెప్పాడు. వారు వెళ్ళుచుండగా, శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదముల మీద పడెను. ఈ సమరయుడు తనను తాను నిస్సహాయునిగా, యేసును తన సహాయకునిగా చూచెను గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించెను. ఈలాంటివారు తక్కువ. 'పదిమంది శుద్ధులైరికారా? తొమ్మండుగురు ఎక్కడ?' అని యేసు ప్రశ్నించెను. ఈ నాటికి ఆయన ప్రశ్న మన మధ్య మారుమ్రోగుతూనే ఉంది!

కృతజ్ఞతాస్తుతిలోని మూడు థలు : విశ్వాసులు 'ఎల్లప్పుడు' కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు దేవుని చేత ఆదేశింపబడిరి. అయినను అందరు అన్ని సమయాల్లో కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారిగా ఉండరు.మీరు ఈ మూడు థల్లో దేనికో ఒకదానికి చెందినవారై ఉంటారు.

మొదటి థశ : (Thanking in Abundance) దేవుని ఆశీర్వాదాలను అనుభవించినప్పుడు మరియు మన అక్కరలు తీరినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట సుళువు. ఉద్యోగం కొరకు, ఆరోగ్యం కొరకు, ఐశ్వర్యం కొరకు, వివాహం కొరకు, ఇంటి కొరకు, వీసా కొరకు, బిడ్డల కొరకు, బండి కొరకు, వ్యాపార లాభాల కొరకు, చదువుల కొరకు, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించుటకు ప్రత్యేక కృతజ్ఞతార్పణల కూడిక ఏర్పాటు చేసి దేవుని ఘనపరుచుట మంచిదే. తీరిన కోర్కెలకై కృతజ్ఞత చెల్లించుట సాధారణమైన విషయము, సామాన్యముగా దీనిని చాలామంది చేస్తారు. దీనికి మామూలు విశ్వాసం చాలును.

రెండవ థశ : (Thanking in Advance) అడిగిన వాటిని, ఆశించిన వాటిని పొందక మునుపు కృతజ్ఞతాస్తుతి చెల్లించుట. చూస్తేగాని నమ్మని తరానికి, అనుభవిస్తేనే గాని ఉండబట్టని వ్యక్తులకు తాము కోరిన వాటిని చూడక, అనుభవించని వాటి కొరకై ముందుగా కృతజ్ఞత చెల్లించుట కష్టము. యేసు అనేకసార్లు తండ్రియొద్ద తాను కోరిన వాటి విషయమై ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను (మత్తయి 15:33-38, యోహాను 11:41-44).

యెహోషాపాతు తన మీదికి శత్రువులు దాడికి రాగా దిక్కుతోచని పరిస్థితుల్లో దేవుడు అతనికి వాగ్దానమిచ్చి ధైర్యపరిచినప్పుడు, ఆ శత్రువులపై జయం పొందక మునుపు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించెను. దీనికి అధిక విశ్వాసం కావాలి.మూడవ థశ : (Thanking in Adversity) సమస్యలు, శోధనలు, మరియు శ్రమలల్లో కృతజ్ఞతాస్తుతి చెల్లించుట కొందరికే ఉన్న ధన్యత. దేవుని కొరకు సమర్పణతో జీవించేవారు తప్పక వీటిని ఎదుర్కొంటారు. వాటి మధ్య కూడా దేవునిపై ఉన్న ప్రగాఢ విశ్వాస ప్రేమలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇది చాలా కష్టమైనప్పటికి అసాధ్యము కాదు. సువార్త ప్రకటన కొరకు హింసపొంది చెరలో వేయబడిన పౌలు సీలలు అంత శ్రమలో అర్ధరాత్రి వేళ కృతజ్ఞత గల హృదయాలతో దేవునికి ఆనందగీతాలు పాడిరి.

ప్రభువు చేత ప్రేమింపబడిన ప్రతి ఒక్కరు ఎల్లప్పుడును సమస్తమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు పేరట తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. ఆత్మానుసారమైన జీవితములో ఇది ఒక లక్షణము. శరీరానుసారముగా నడుచుకొనేవారు దీనిని చేయజాలరు. అందుకే ఆత్మపూర్ణులై. ప్రభువునందు కొనసాగుట అత్యవసరము మరియు ఆశీర్వాదము. నీ పరిస్థితి ఏమిటి? నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించు వ్యక్తివా? లేక ప్రతి నిత్యము నీ స్వార్ధముతో బ్రతుకుతూ దేవుని లెక్కచేయక సణుగుడుతో సతమతమవుతున్నావా? 'ప్రతి సణుగుడుకు క్రీస్తులో విరుగుడు వుంది!' యేసు క్రీస్తు అను దేవుని చెప్పనశక్యమైన వరము కొరకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువైన యేసులో నీకు పాపక్షమాపణ, హృదయపరివర్తన, నిత్య జీవం మరియు జీవన సంబంధమైన ప్రతి ఆశీర్వాదము లభించును గనుక నేడే ఆయనను ఆశ్రయించి ఆయనకు కృతజ్ఞుడవై జీవించు.

- పి.ఉపేందర్‌