వాక్యసందేశముPost Date:2013-11-02//No:35

వ్యాధులెందుకు వస్తున్నాయి ?మనుష్యులకు రోగములు ఎందుకు వస్తున్నాయి? అని ఎవరిని అడిగినా రకరకాల జవాబులు వస్తాయి. మానవులకు జబ్బులు రావడానికి వాతావరణము కారణమని కొందరు, అలవాట్లు కారణమని కొందరు ఆహారము కారణమని మరికొందరు చెప్తారు. ఈ మధ్య చాలామంది రోగ గ్రస్తులయ్యారు ఎందుకంటే అంటువ్యాధులు ప్రబలినాయని చెప్తారు. పరిశుద్ధ గ్రంధములో మనము గమనించినపుడు, వ్యాధులు రావడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు గమనించగలము.

1వ కారణం :- యెహాను సువార్త 11వ అధ్యాయం 3,4 వచనాలలో చూచినపుడు, లాజరు రోగియయ్యాడని గ్రహించగలము. లాజరు మరియు మార్తల సహోదరుడు యేసు ప్రభువుకు స్నేహితుడు. అలాంటి లాజరు రోగి కావడానికి కారణం దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని యేసుక్రీస్తు యోహాను 11:4లో తెలియపర్చాడు. లాజరు రోగి అయినది దేవుని నామము మహిమ పర్చడానికని గమనించాలి. పుట్టుగ్రుడ్డి అయిన మనుష్యుడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు వీడా. వీని కన్నవారా? అని ప్రశ్నించినపుడు దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టాడని ప్రభువు యోహాను 9:3 నందు తెలియజేశాడు. కనుక కొన్ని రోగములు, వ్యాధులు దేవుని నామ మహిమ కొరకు వస్తాయి అనునది సుస్పష్టము.

2వ కారణం :- అపవాది అని గ్రహించాలి. యోబు 2:7 నందు 'అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాఢగల కురుపులతో యోబును మొత్తెను'. అని వ్రాయబడివుంది. విశ్వాసియైన యోబు, నీతిమంతుడైన యోబు రోగగ్రస్తుడు కావడానికి కారణం అపవాది అని గమనించగలము. చాలాసార్లు క్రైస్తవులు భక్తి విశ్వాసాలతో ఎదుగుచున్నప్పుడు సాతానుడు కొన్ని సమస్యలు జబ్బులు వచ్చేలాగున చేసి విశ్వాస జీవితంను పడగొట్టాలని చూస్తాడు. క్రైస్తవులు రోగాలు వచ్చినపుడు, నాకెందుకు దేవుడు ఈ రోగం పెట్టాడు అని బాధపడి విశ్వాసం నుండి తొలగిపోతుంటారు. ఇలా విశ్వాసం నుండి తొలగిపోవడమే సాతానునికి కావాలి. అందుకే యోబును బాధపెట్టినట్లు సాతానుడు విశ్వాసులను రోగ గ్రస్తులనుగా చేయుచున్నాడు.

3వ కారణం :- విశ్వాసులు ప్రభు భోజన సహవాసములో ఉన్నప్పుడు ప్రభువు శరీరమని వివేశింపక రొట్టెను, ద్రాక్షారసమును ఆహారము లెక్కన తీసుకుంటున్నారని 1 కొరింది 11:29, 30 వచనాలలో భక్తుడైన పౌలు చెప్పుచున్నాడు. రొట్టె ప్రభువు శరీరమని, ద్రాక్షరసము ఆయన రక్తమని తలంచక ఆహారము, పానీయము వలె స్వీకరిస్తే అనేకులు బలహీనులు, రోగులుగా ఉన్నారని పౌలు చెప్పుచున్నాడు. ప్రభు భోజన సహవాసము ప్రభువుతో సహవాసమని, స్వీకరించేది ప్రభువు శరీరాన్ని, రక్తాన్ని అని మరవరాదు. అలా మరచితే రోగాలు వస్తున్నాయని గమనించాలి.
వ్యాధులెందుకు
4వ కారణం :- మన పాపము అని యిర్మియా 30:15 నందు గమనించగలము. పాపములు విస్తరించినందున ఈలాగున రోగ గ్రస్తునిగా చేశానని దేవుడు యిర్మియా ప్రవక్త ద్వారా తెలియజేయుచున్నాడు. అందుకే మార్కు 2:5 నందు యేసుక్రీస్తు పక్షవాయువు గల వానితో 'కుమారుడా నీ పాపములు క్షమింపబడియున్నాయని' తెలియజేశాడు. పక్షవాయువు గల వానిని కొందరు యేసునొద్దకు స్వస్థత కొరకు తెచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి కుమారుడా, నీ పాపములు క్షమించబడియున్నాయని చెప్పాడు. పక్షవాయువు గలవాడు పాపం వలన తను రోగ గ్రస్తుడయ్యాడని గ్రహించగలము.

5వ కారణం :- అక్రమసంపాదన అని 2 రాజులు 5:26 నందు గేహాజి తెచ్చుకున్న సంపాదన ద్వారా కుష్టురోగం వచ్చినట్లు గమనించగలము. ఎలీషా నయమానును స్వస్థపర్చాడు. కాని కానుకలు స్వీకరించలేదు. గేహజికి కానుకలు నయమాను నుండి పొందాలనుకున్నాడు. అయితే ఆ విషయం ఎలీషాకు తెలియకుండానే రహస్యంగా నయమానును కలుసుకొని ఎలీషా పేరునుపయోగించి వస్త్రములు, ద్రవ్యము, తోటలు, గొర్రెలు, ఎడ్లు దాసదాసీలను సంపాదించు కొనుటకు ప్రయత్నించాడు. అంటే ఇది క్రమమైన సంపాదన కాదు. అక్రమ సంపాదన లంచము వంటిది. ఇలా సంపాదించిన గేహాజి కుష్టురోగం తెచ్చుకున్నాడు.

6వ కారణం :- దేవునిని విసర్జించడం, ద్వేషించడం, అసహ్యించుకోవడం అని యెషయా 1:1 - నందు చూడగలము. దేవునిని విసర్జించి, ద్వేషించి తిరుగుబాటుచేయడం, దేవునిని దూషించడం వంటివి చేసి రోగము తెచ్చుకున్నట్లు పై వచనములో గమనించగలము. లేవీయ కాండము 26:16 నందు దేవున్ని అసహ్యించు కున్నందున రోగము తెచ్చుకున్నట్లు గ్రహించగలము.

7వ కారణం :- దేవుని పేరిట మానవుని ద్వేషించుట దేవుని పోలికగా పుట్టిన మానవుని ద్వేషిస్తే దేవున్ని ద్వేషించినట్లే గనుక జనులు చాలా మంది జబ్బులు తెచ్చుకుంటారు. నిన్ను ద్వేషించు వార్కి సర్వరోగములను ఏర్పరస్తున్నానని దేవుడు తెలియజేయుచున్నాడు. దేవున్ని నిరాకరిస్తే రోగాలు వస్తాయని లేవీయ 26:16లో చూడగలము. దేవుని స్వరూపముతో చేయబడిన మానవున్ని నిరాకరించినా వ్యాధులు వస్తాయని గమనించాలి.ప్రియ పాఠకులారా, దేవుని నామ మహిమ కొరకు రోగాలు వస్తే ధన్యులమే. అపవాది ద్వారా రోగాలు వచ్చిన ప్రభువు మనలను స్వస్థ పర్చును, అప్పుడును ధన్యులమే. ప్రభు భోజన సహవాసం ద్వారా గాని, దేవుని విసర్జించుట, ద్వేషించుట, తిరుగుబాటు చేయుట, దేవున్ని దూషించుట, నిరాకరించుట తదితర విషయాల వలన జబ్బులు తెచ్చుకుంటే బాధపడవలసి ఉంటుంది. కనుక రోగాలు ఎందుకు వస్తాయి అని గుర్తించ గలిగిన మనము రోగాలు రాకుండ జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చినా యేసు నామమున రోగ విముక్తులం కావాలి. మనలను బాగు చేయడానికి యేసు ప్రభువు వచ్చాడు. గనుక జాగ్రత్త పడుదాం. దైవ ఆశీర్వాదం పొందుదాం. శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థతలో కొనసాగుదాం. రోగ విముక్తలమవుదాం. దేవుడు మిమ్ము దీవించునుగాక ఆమెన్‌.
- ఇండ్ల దేవరాజు.