వాక్యసందేశముPost Date:2013-10-28//No:34

మతోద్ధారణ పండుగబైబిలు పండుగను 'మతోద్ధారణ పండుగ' లేదా 'దిద్దుబాటు పండుగ' అంటారు. ప్రతీ సంవత్సరము అక్టోబర్‌ 31వ తేదీన ఈ పండుగను ఆచరిస్తారు. సత్య మతోద్ధారణ యాత్రను జర్మనీ దేశములో కొనసాగించిన ప్రధముడు మార్టిన్‌ లూధర్‌, కాథలిక్‌ సంఘంతో హోరాహోరీ పోరాటం సాగించిన ధీరుడు. అనేకసార్లు మరణమును కూడా తప్పించుకుని, ప్రజాభిమానాన్ని చూరగొని, నిలిచి జీవితాంతం తను నమ్మిన సిద్ధాంతంకై సర్వ త్యాగాలూ చేసిన మహనీయుడు.

1483లో బైస్లెబెన్‌ పట్టణంలో ఓ పేద కార్మికుని ఇంట పుట్టి దినమొక రీతిగా పెరిగి చదువు సంధ్యలకై సంగీతము పాడుకుంటూ ఖర్చులకు సంపాదించుకుని కడకు ఎర్‌ఫర్ట్‌ యూనివర్శిటీలో చేరి 1502లో బి.ఏ., 1505లో ఎమ్‌.ఏ.పూర్తి చేశాడు. ఆ కాలంలో ఒకనాడు యూనివర్శిటీ గ్రంధాలయంలో ఒక గ్రంధము ఆయన కంట బడినది. అదే బైబిలు. ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చుసరికి అభిషేకించబడిన యాజకుడై విటెన్‌బర్గ్‌ యూనివర్శిటీకి వేదాంత బోధకుడుగా వెళ్ళినాడు. దైవత్వాన్ని కోల్పోయిన యాజకులు, లౌకిక జీవిత సుఖాలకు అంకితమైన వారి ఆడంబరాలు, పట్టుదర్పాలూ అన్నీ గాంచి, ఆశ్చర్యపోయినాడు. రోము నగర దేవాలయములలో ఒక దానిలో పరిశుద్ధ మెట్లున్నవని, ప్రార్ధనతో మోకాళ్ళపై ఆ మెట్లెక్కినచో పుణ్యం కలుగునని ప్రచారమున్నది. యెరూషలేములో యేసు ప్రభువు పిలాతు న్యాయపీఠము చెంతకు ఎక్కి వెళ్ళిన మెట్లు ఇవేనని మరో కట్టు కధను కూడా అల్లినారు. యీ మెట్లను దేవుడు రోము నగరానికి పంపినారట. వీటన్నింటినీ గాంచి ఎంతో ఆందోళన పడిన లూధర్‌ రోము నగరాన్ని విడిచి, జర్మనీ దేశమును చేరినాడు. క్రీస్తు యందలి విశ్వాసమును ఇనుమడింప చేసుకొనుటవల్లనే అతడి ఆందోళన తగ్గి సంపూర్ణ సమాధానము లభించినది. 'నీతిమంతుడు విశ్వాసం వల్ల బ్రతుకుతాడు' అనే సిద్ధాంతముపై ఆయనకు నమ్మకమేర్పడి, ఆ సిద్ధాంతమునే జీవిత కాలమెల్లా వేదనా భరితులైన పాపులకు బోధించాడు. పోపైన పదియవ లియో ధనార్జన కోసం మరో వ్యాపార పద్ధతిని త్రొక్కినాడు. పాప క్షమాపణ పత్రములను అమ్మకమునకు పెట్టినాడు. రోమను యాజకులు యూరపు ఖండమంతటా పెద్ద పెద్ద యాత్రలు జరిపి అమిత ధనమును యీ పత్రాల విక్రయం వల్ల సంపాదించినారు. పరిశుద్ధులు, హతసాకక్షులు తమకు మించిన పుణ్యమును సంపాదించగా, ఆ పుణ్యము పోవు ఆధీనమందున్నదని, ఆ పుణ్యమును యీ పత్రముల ద్వారా కొనుక్కోవచ్చునని వార్తలు ప్రచారం సాగించినారు. ఇందులో ఆయా దేశములలోని ప్రభువులకు భాగస్వామ్యం కల్పించబడింది. ఆ దుర్వ్యాపారాన్ని గాంచి లూధరు ఎంతగా ఉద్రేకపడి ఉంటాడో మనం ఊహించు కొనవచ్చును. యీ విక్రయము ఎంత మోసమో తూర్పారబడుతూ 95 సూత్రములు రాసిన కాగితమును విట్టెన్‌బర్గ్‌ ఆలయాన సింహద్వారమునకు అంటించినాడు. ఆ వ్రాతలు అనేకులను ఆకర్షించినవి. ఆ సూత్రములను ఎత్తిరాసుకుని, ఇతర భాషల్లోకి అనువదించుకొని, అనేకులు ఉత్సాహభరితులైనారు.
మతోద్ధారణ
దీన్ని విమత సిద్ధాంతంగా ముద్రవేసి 60 రోజులలో రోము నగరానికి వచ్చి సంజాయిషీ చెప్పుకోవలసిందిగా పోపు, లూధరును ఆజ్ఞాపించినాడు.ఈ ఆజ్ఞ పత్రమును ప్రజా సమక్షమున లూధరు కాల్చివేసినాడు. ఆయన ధైర్యాన్ని ప్రజలు ఎంతగానో కొనియాడినారు. కాని పోపు లూధరు గ్రంధములనన్నింటినీ తగుల బెట్టమని ఉత్తర్వు చేసినాడు. అంతేగాక పోపు ఒత్తిడి ఫలితంగా జర్మనీ చక్రవర్తియైన ఐదవ ఛార్లెస్‌ 'వర్క్స్‌' పట్టణమందు రాజ్యసంబంధమైన ఆలోచన సభను ఏర్పాటు చేసి, ఆ సభకు రావలసిందిగా లూధరును ఆజ్ఞాపించినాడు. లూధరు అచటకు వెళ్ళుటకు అంగీకరించినాడు. కాని ఆయన అభిమానులు, మిత్రులు ఆ సభకు వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. 'పట్టణంలోని ఇళ్ళన్నింటిపైనా పెంకులెన్ని ఉన్నవో అన్ని పిశాచములక్కడున్నను నేను వెళ్ళకమానను' అని ధైర్యంగా పట్టణంలో అడుగుపెట్టినాడు.

ఆ ఆలోచన సభకు చక్రవర్తి యువరాజులు, ప్రభువులు, సామంతులు, రోమను క్రైస్తవ మతాధికారులు, పోపు రాయబారులు అనేకులు విచ్చేసినారు. ఈ సభలో ఒక అధికారి లేచి,

ఇవి నీవు రచించిన గ్రంధములా?' అని అడిగాడు.

'అవును'

'వీటిలో నీవు చెప్పిన విషయములు నిషిద్ధములని అంగీకరింతువా?' దీనికి సమాధానము దాదాపు రెండు గంటలు అనర్ఘళంగా ఇచ్చినాడు. తాను రచించిన విషయములు బైబిలుకు సత్యసమ్మతములైనవని నుడివినాడు. కాని కళ్ళులేని ఆలోచన సభ అతడు విమతస్థుడని తీర్పు చెప్పినది. అతని గ్రంధము లెచట ఉన్నను కాల్చివేయవలెను. ఎవరూ ముద్రించకూడదు, విక్రయించకూడదు, అతను గాని అతని శిష్యులుగాని ఎవరూ ఆహారము పెట్టకూడదు.కడకు ఆయనకు శిక్ష విధించు అధికారము చక్రవర్తికి దత్తం చేసినాడు. ఇకాయనను సజీవ దహనం గావించుటకే చక్రవర్తి నిశ్చయించుకొనినాడు. కాని తాను స్వస్థలము చేరువరకూ చక్రవర్తి తనకిచ్చిన అభయపత్రికను ఆధారం చేసుకుని లూధరు ఆ సభ శిక్ష నుండి తప్పించుకొనినాడు. కాని దారిలో లూధరు ప్రాణ స్నేహితుడైన సాక్సన్‌ దేశ ప్రభువైన 'ఫ్రెడరిక్‌' లూధర్‌ను బంధించాడు. అలా ఆయన బంధించి ఉండకపోతే శత్రువుల చేత చిక్కి లూధరు సంహరింపబడవలసినవాడు.

ఈ బందిఖానాలో ఉన్న ఏడాది కాలంలో నూతన నిబంధన గ్రంధమును జర్మనీ భాషలోకి అనువదించాడు. 'ఫ్రెడరిక్‌' రక్షణలో లూధరు విటెన్‌బర్గ్‌కు చేరుకున్న రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో చెక్కదగింది. ఆయనకక్కడ జరిగిన సన్మానము అనూహ్యమైనది. తండోపతండాలుగా జనసందోహం వచ్చి ఆనందాశ్రువులను రాల్చినది. ఆయన అనువదించిన నూతన నిబంధనల గ్రంధము వేల కొలది ప్రతులు అచ్చయి అమ్ముడు పోయిన ఉత్సాహంలో పాత నిబంధన గ్రంధమును అనువదించ ప్రారంభించాడు. అదే సమయంలో రోమను కాథలిక్‌ చెప్పే 'మతాచార్యులు వివాహమాడుట చట్ట విరుద్ధము' అనే దాన్ని పూర్వ పక్షం చేస్తూ 'వివాహము దేవుడు ఏర్పరచినది' అని బైబిలు సత్యాన్ని కరపత్రంగా ప్రచురించినాడు. దానితో అనేకమంది సన్యాసులు మఠాలను విడిచి వివాహాలు చేసుకొని సంసారులైనారు.

తను కూడా అంతకు ముందు కాథలిక్‌ సన్యాసియై ఆ సంఘమును విడిచిన కేథరిన్‌ 'బోరాను' వివాహమాడి ఆరుగురు పిల్లలకు తండ్రియైనాడు. అట్టి నిర్విరామ సత్యమతోద్ధారకుడైన లూధర్‌ యావత్ప్రపంచమంతటా శాఖోపశాఖలుగా సంఘములు నెలకొల్పుటకు ఊపిరిపోసినవాడై తన ఊపిరిని 1546లో తన 63వ ఏట విడిచిపెట్టినాడు. ఆయన ఎక్కువకాలం పనిచేసిన విటెన్‌బర్గ్‌లోనే ఆయన సమాధి ఉన్నది.