వాక్యసందేశముPost Date:2013-10-21//No:33

ఆధ్యాత్మిక బలంకీర్తన 18:1లో 'యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను' అని భక్తుడైన దావీదు పలికాడు. ఈ లోకములో మనం ధనబలమును, శరీరబలము, అధికార బలమును బట్టి అతిశయిస్తుంటాము. మన దేవునిని బట్టి ఆయన బలమును బట్టి అతిశయించలేక పోతున్నాము. 'బలము తనదనే అని ఒకమారు దేవుడు సెలవిచ్చాడు. రెండు మారులు ఆ మాట నాకు వినబడెను' (కీర్తన 62:11). మన బలహీనలతలో ఆయన బలము పరిపూర్ణమవుతూ ఉంది. మనమెలా బలపడగలమో కొంత ధ్యానిద్దాం.

1. విశ్వాస బలం : యెషయా 30:15లో 'మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. మన బలహీనత శారీరకంకావచ్చు మానసికం కావచ్చు లేక ఆత్మీయ విషయాలలో కావచ్చు ఏదైనా సరే దేవుని బలమునందు విశ్వసించినప్పుడు బలము పొందుకుంటాము' యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు' (కీర్తన 125:1).
ఆధ్యాత్మిక
2. శరీరబలం : విశ్వాసమును బట్టి శారా వయస్సు గడచిపోయిననూ గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రసవ వేదన పడే శరీర బలాన్ని దేవుడనుగ్రహించాడు. మోషే దేవుని మాటలయందు విశ్వాసముంచి ఆరులక్షలకు పైగా ఇశ్రాయేలీయులను నలుబది సంవత్సరాలు అరణ్యములో నడిపించే శరీర దారుఢ్యము పొందాడు. ఏలియా యెజెబెలు రాణికి భయపడి పారిపోయి బదరీవృక్షము క్రింద మరణాపేక్ష గలవాడై కూర్చుని యుండగా దేవుడు తన దూత ద్వారా రెండు మార్లు పంపిన ఆహారపు బలముతో నలుబది దివారాత్రులు నడచి హోరేబు కొండను చేరుకున్నాడు. అనేకమంది పరిశుద్ధ గ్రంధములో ప్రభువునందలి విశ్వాస బలముచే శరీర బలము పొంది స్వస్థపరచబడ్డారు. 

3. మనోబలం : దావీదు గొల్యాతు కంటే బలహీనుడు, బాలుడు, యుద్ధనైపుణ్యం లేనివాడు. దేవుని యందలి విశ్వాస బలముతో మనోబలాన్ని పొందుకొని గొల్యాతునెదుర్కొని చంపగలిగాడు. గిద్యోను దేవుడిచ్చిన సూచనలను బట్టి మిద్యానీయులు మిడుత దండువలెను వారి ఒంటెలు ఇసుక రేణువులంతలెక్కలేనివైయున్నప్పటికి తన మనోబలముతో కేవలము మూడువందల మందితో వారిపై యుద్ధమునకు వెళ్ళి జయించాడు. (న్యాయాధి 7:12). అలాగే మన జీవితాల్లో సమస్యలు ఎంత పెద్దవైనా విశ్వాసముంచినప్పుడు ఆ సమస్యల నెదుర్కోవడానికి కావలసిన మనోబలాన్ని దేవుడు ఇస్తాడు.

4. ఆత్మీయ బలము : అపొ.పౌలు ప్రభువునందలి విశ్వాసమును బట్టి ఆత్మీయ బలమును పొందుకున్నాడు. 'నన్ను బలపర్చు వానియందే నేను సమస్తమును చేయగలనని (ఫిలిప్పీ 4:13) అన్నాడు. పుట్టు కుంటివాడైనా వానిని పేతురు యోహానులు స్వస్థపరిచినప్పుడు మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీని చేసితిరని అనేకులు ప్రశ్నించగా పేతురు పరిశుద్ధ ఆత్మతో నిండినవాడై మా స్వంత శక్తిచేత వీనికి నడువమని బలము ఇచ్చినట్లు మీరెందుకు మా తట్టుతేరి చూచుచున్నారని జవాబిచ్చాడు. అవును దేవుని పరిచర్యలో విజయవంతంగా ముందుకు సాగిపోవాలంటే మనమైతే ఆత్మీయంగా బలహీనులము. దేవుడే మనకు బలమిచ్చువాడని విశ్వసించాలి. సైతాను శక్తుచే పోరాడాలన్నా శోధనలలో విజయం సాధించాలన్నా పరిశుద్దాత్మ దేవుడే ఆత్మీయబలాన్ని అందజేస్తాడు. కొన్నిసార్లు పరిచర్యకు కావలసిన వనరులు లేవే పరిచర్యను చివరి వరకు కొనసాగించగలనా అన్న నిరుత్సాహము చోటు చేసికుంటుంది. అటువంటి సమయాల్లో ప్రభువు మన ప్రక్కనేయుండి ప్రోత్సహించి బలపర్చుతాడు. పౌలు సువార్త పరిచర్యలో ఎలాంటి పరిస్థితులు కూడ ఆత్మీయంగా కృంగదీయలేదు. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడని ఎఫెసీ 6:10లో హెచ్చరించబడియున్నాము.కావున ప్రియులారా! మన విశ్వాసం ద్వారా శరీరబలము మనోబలము పొందినవారమై ఆత్మీయ శక్తిని పొందినవారమై ఆయనయందు నిత్యము అతిశయించుదుముగాక.
- జి.విజయకుమార్‌