వాక్యసందేశముPost Date:2013-10-04//No:31

ఆపరేషన ఆండ్రూ  ''ఆపరేషన్ గజ'', ''ఆపరేషన్ హోం'', ''ఆపరేషన్ దుర్యోధన'' లాగే ఆపరేషన్ ఆండ్రూ ఉంది. ఇది బైబిల్ పరిజ్ఞానం గలవారికే అవగతమవుతుంది. అంద్రెయ ఆపరేషన్ గూర్చి తెలసికోక పూర్వం అస్సలు అంద్రెయ ఎవరు? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అన్న విషయం తెలుసుకొందాం.

1. యేసుక్రీస్తు ప్రధమ శిష్యుడు : అంతకు పూర్వం ఇతడు బాప్తీస్మమిచ్చు యోహాను శిష్యుడు. ''ఇదిగో! లోకపాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల''. అని యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం స్థానికుడైన యోహాను చెప్పగా విని వెను వెంటనే, ''రబ్బూనీ! [బోధకా] నీవెక్కడ కాపురమున్నావు'' అంటూ యేసును వెంబడించాడు అంద్రెయ. 
2. జాలరి [బెస్తవాడు]. [మత్తయి 4:18]. 
3. సీమోను పేతురు సహోదరుడు [మత్తయి 4:18]
4. బెత్సయిదా పట్టణపు కాపురస్థుడు [యోహాను 1:44]
5. ఇతని తండ్రి యోహాను .
6. ఇతనిని గ్రీకు భాషలో ''ప్రొటక్లేటస్'' అంటారు. అంటే మొదట పిలువబడిన వాడని అర్ధం. 
7. అంద్రెయ అంటే ''పౌరుషం గలవాడని'' అర్ధం. 
8. ఇతడు గొప్ప ఆత్మల సంపాదకుడు. 
9. ఇతడు ప్రధమ శిష్యుడే అయినా ఆఖరి వాడుగా నుండుటకు ఇష్టపడిన సౌమ్యుడు అంద్రెయ. 
              నూతన నిబంధన గ్రంధాలలో శిష్యుల పేర్లు ప్రస్తావింపబడినవి. ఈ జాబితాను మనం పరిశీలిస్తే ఇతనికి దక్కిన ఆధిక్యత ఎలాంటిదో, మనకు తెలుస్తుంది. 
               1. మత్తయి, లూకా. సువార్తల్లో 2వ స్థానం. 
               2. మార్కు సువార్తలో 4వ స్థానం .
               3. అపొస్తలుల కార్యముల గ్రంధములో 4వ స్థానం. 
               ఈ జాబితాను బట్టి మొదటివాడైన అంద్రెయ కడపటి వాడుగా కనిపించడం విడ్డూరంగా ఉంటుంది. అధిక్యతలను కోరుకొనని శిష్యుడు అంద్రెయ. వ్యక్తిగత సువార్త సేవ [పర్సనల్ ఎవాంజలిజమ్] అంటే ఇతనికి ఇష్టం. పదిమందిలో ఇతడు బోధించునట్లు మనం ఎక్కడా చూడము. వ్యక్తిగతముగా మనుష్యులతో మాటలాడడం ఇతనికి ఇష్టం. డా॥బిల్లీగ్రహం గారు పాతిక సంవత్సరాలకు పూర్వం, ఆపరేషన్ ఆండ్రూ కార్డులు ఇచ్చి కార్డులో 10 మంది క్రైస్తవేతరుల పేర్లు వ్రాసుకొని వారి కొరకు నిత్యము ప్రార్ధించి, ప్రభువు చెంతకు తీసికొని రండని చెప్పేవారు. అంద్రెయ వ్యక్తిగత పరిచర్యను కలిగి యున్న కారణాన ఆకార్డుకు ''ఆపరేషన్ ఆండ్రూ'' అని నామకరణం చేయడం జరిగింది. అంద్రెయను గూర్చి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం!

ఇంటివారిని యేసు దగ్గరకు నడిపించాడు. యోహాను 1:42
                ఇతడు [అంద్రెయ] మొదట తన సహోదరుడైన సీమోనును చూచి - మేము మెస్సీయాను కనుగొంటి మని అతనితో చెప్పెను''.                  '' యేసును కనుగొన్న వెంటనే ఎక్కడికో వెళ్లి సువార్త చెప్పలేదు. ''ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు''. ఇంటి దగ్గరే ఆయన తన సువార్తను ప్రారంభించాడు. స్వయంగా తన సొంత సోదరుడైన ''సీమోను పేతురు'' వద్దకెల్లి, మేము మెస్సయ్యను కనుగొన్నామని సాక్ష్యం ఇచ్చాడు. చాలా మంది ఇంటిలో సాక్ష్యం ఇవ్వడానికి భయపడతారు. కారణం! వారి బలహీనతలు. అంద్రెయ తన సొంత సోదరుడిని ప్రభువు దగ్గరకు తెచ్చి ఎంత గొప్ప భాగ్యం సంపాదించుకున్నాడో! మీతో చెప్పాలి. 
                 1. పేతురు రచయిత : ఇతడు బైబిల్ గ్రంధములో రెండు పుస్తకాలను రచియించాడు. ఎ] పేతురు మొదటిగ్రంధము బి] పేతురు రెండవ గ్రంధము. దీని ద్వారా మనం అర్ధం చేసుకోవలసిన విషయం. అంద్రెయ రచయిత కాదు. ఒక గొప్ప రచయితను యేసు దగ్గరకు నడిపించాడు. 
                  2. పేతురు గొప్ప బోధకుడు : ఈయన ప్రసంగం విని ఇంచుమించు మూడువేలమంది రక్షింపబడినారు. ఒక్క ప్రసంగం విలువ - మూడువేల ఆత్మలు. ఎంత శక్తి వంతమైన దైవ సందేశమో ఆలోచించండి. అంద్రెయ బోధకుడు కాదు గాని ఒక బోధకున్ని [పేతురును] యేసు దగ్గరకు నడిపించాడు.
                   3. పేతురు గొప్ప ఆత్మల సంపాదకుడు :  ఆయన సందేశముల ద్వారా, రచనల ద్వారా ఇతరులను యేసు చెంతకు నడిపించిన పునీతుడు పేతురు. 
                   4. హతసాక్షి : పేతురు యేసు ప్రభువు కొరకై హతసాక్షి అయ్యాడన్న విషయం మనకందరికి విధితమే. గమనించారా అంద్రెయ నడిపించిన పేతురు ఎంత గొప్ప వ్యక్తిగా రూపొందాడో...! మనం కూడా అంద్రెయ వలె జరిగిస్తే, మన ద్వారా రక్షింపబడినవారు గొప్ప వ్యక్తులు కావచ్చు. అందుకే ఆత్మల సంపాదన అనేది చాలా ప్రాముఖ్యమైనది. 
ఆపరేషన
చిన్న వారిని యేసు దగ్గరకు నడిపించాడు. యోహాను 6:9
                    'ఇక్కడ ఉన్న ఒక చిన్న వానియొద్ద ఐదు యవల రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నవి గాని యింత మందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా''                     యేసుక్రీస్తు ఉజ్జీవ సభలు నిర్వర్తిస్తున్నాడు జన సమూహములు ఆయన బోధ వినుటకు అరుదెంచారు. 5 వేల మంది పురుషులు, మరియు స్త్రీలు, పిల్లలు, ఆ సభలలో పాల్గొన్నారు. యేసు మరణించి సజీవంగా తిరిగి లేచిన సంఘటన మినహాయిస్తే, నాలుగు సువార్తలల్లో రాసి ఉన్న అద్భుత కార్యం ఇదొక్కటే...!                    మీరే వారికి భోజనం పెట్టండి. అన్నాడు ప్రభువు. శిష్యుల దగ్గర ఏమీలేదు. ఫిలిప్పు లెక్కల్లో ఆరితేరిన వాడు. త్వర త్వరగా లెక్కలు కట్టి, ప్రభువా వీరందరు భుజించుటకు 200 దేనారములు ఖర్చు అవుతుంది అన్నాడు. ఈయనదంతా లెక్కల విశ్వాసం. లెక్కలు వేసుకోవడం తప్పు అని నేనడం లేదు. ఆయన ప్రక్కనే అద్భుతాలు చేసే అద్భుతాకారుడున్నాడన్న విషయం విస్మరించాడు. 
                    అంద్రెయ అక్కడున్న చిన్న పిల్లవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి. వాటిని తెచ్చి ప్రభువు చేతిలో పెట్టాడు. ధనం విషయం, కొనుగోలు విషయం, లెక్కలు కట్టే విషయం ఆయన ఆలోచించలేదు. ఉన్నవేవో అవి యేసు చేతిలో పెట్టాలి. అదే అంద్రెయ విశ్వాసం . ఈయన విశ్వాస పరిమాణము చొప్పున యేసు వాటిని తన చేతిలోనికి తీసుకొని కన్నులెత్తి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. అంటే! అద్భుతం జరిగింది. అనేక వేలమంది ఆహరం తిని తృప్తి పొందారు. 12 గంపలు మిగిలాయి. 
                    గమనించండి! అంద్రెయ చిన్నపిల్లలను గమనిస్తూ ఉండినాడు. బహుశా సండే స్కూలు ఇన్ చార్జీగా ఉండి ఉండవచ్చు. పెద్దల యెడల మాత్రమే కాదు. చిన్నవారి యెడల కూడా అంద్రెయ శ్రద్ధ వహించాడు. ఆ పిల్లవాడే లేకుంటే....! ఆ పిల్లవాడే ఇవ్వకపోతే!! ఈ అద్భుతకార్యం జరిగేదా?
                     అంద్రెయకు చిన్న పిల్లల యెడల ఎంత శ్రద్ధ ఉందో చూడండి. బైబిల్ వేదాంతులు చెపుతారు, పిల్లలు ఫుల్ టిక్కెట్లు, పెద్దలు హాఫ్ టిక్కెట్లు అని. ఎందుకలా చెపుతారు? ఉదా : 10 సం॥రాల పిల్లవాడు అదే వయసులో రక్షింపబడినాడు అనుకోండి వాని ఆయుష్షుకాలం 100 సం॥ రాలు అయితే దేవునికి 90 సం॥ రాల జీవితం అంకితం చేయగలడు. అలాగే ఒక 50 సం॥ రాలు అతడు జీవించగలిగితే 50 సం॥రాల జీవితాన్ని మాత్రమే యేసుకు అంకితం చేయగలడన్న మాట. ఇప్పుడు ఆలోచించండి పెద్దవారు దేవునికి ఎక్కువ ప్రయోజకులా? పిల్లలు దేవునికి ఎక్కువ ప్రయోజకులా? ఒక్కసారి ఆలోచించండి. చిన్నవారిని నా యొద్దకు రానీయుడి'' అని యేసు చెప్పిన విషయాన్ని మనస్కరిద్దాం. 
                    అంద్రెయ బైబిల్ అంతటిలో ఎక్కడా అద్భుతాలు చేసినట్లు దాఖలాలు లేవు కానీ అద్భుతానికి కారకుడైన ఒక చిన్న వానిని యేసు దగ్గరకు తేగలిగాడు.                     కొంతమంది సండే స్కూలుకు తమ పిల్లలను పంపరు. సండేస్కూలు పిల్లల యెడల శ్రద్ధ చూపరు. అలాంటి వారందరికి అంద్రెయ ఆదర్శం. అంద్రెయ వలె మనం కూడా జరిగించి ఇతరులను యేసు వద్దకు తీసుకొని వద్దాం!

విదేశీయులను యేసు దగ్గరకు నడిపించాడు. యోహాను 12:20,21
                     ''ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి వారు గలిలయ లోని  బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి అయ్యా! మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. ఫిలిప్పు అంద్రెయ తో చెప్పెను. అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పెను''. 
                    ఎందుకు గ్రీసు [గ్రీకు] దేశస్థులు ఫిలిప్పు దగ్గరకు వెళ్లారు? ఫిలిప్పు అనే పేరు గ్రీకు పేరు. మన పేరు గల వ్యక్తి యేసు శిష్య బృందముతో ఉన్నాడని గ్రీసు దేశస్థులు ఫిలిప్పు దగ్గరకు వెళ్లారు. వీరు యేసును చూడగోరితే అంద్రెయ యేసును చూపించుటకు అంగీకరించాడు. యేసును చూపించుటకు అంగీకరించిన అంద్రెయకు యేసుని చూడాలని కాంక్షించిన వారందరికి యేసును చూపించుట ప్రధాన కర్తవ్యం. అంద్రెయకు సమూహాలతో పనిలేదు. వ్య్వక్తులతో ఆయనకు పని. అంద్రెయ సొంతవారిని, పిల్లలను మాత్రమే కాదు, విదేశీయులను కూడా యేసు చెంతకు నడిపించాడు.
                   వ్యక్తిగత సువార్త యెడల అంద్రెయ శ్రద్ధ గలవాడు. క్రైస్తవేతరులను యేసు దగ్గరకు తేవాలి. అదే అంద్రెయ ఆకాంక్ష. క్రైస్తవ సంఘము ఈ పనిని విస్మరిస్తుంది. కమిటీ మీటింగులతో తలమునకలైపోతోంది. సంఘము యొక్క నాలుగు గోడలను వదలి బయటకు వెళ్ళలేకపోతోంది. ''సర్వసృష్టికి సువార్త'' విషయం మరచిపోయింది. ఆత్మల సంపాదకులను ప్రోత్సహించే దినాలు పోయాయి. అంద్రెయ గొప్ప ఆత్మల సంపాదికుడు. ఆత్మల కాపరియైన యేసుక్రీస్తు పరలోకంలో అంద్రెయ కు గొప్ప బహుమానమును పదిల పరిచాడు. అంద్రెయకు మాత్రమే కాదు. ఎవరైతే అనేకులను, యేసు వైపు త్రిప్పుతారో వారందరికి పరలోకంలో శ్రేష్టమైన బహుమతులు లభిస్తాయి.

 హతసాక్షిగా మరణించిన అంద్రెయ                   అంద్రెయ కాకసీయ కొండ ప్రాంతములో సేవ చేయుటకు వెళ్ళెను. ప్రస్తుతము అది రష్యా దేశమందు గల జార్జియా రాష్ట్రములో ఉన్నది అంద్రెయ సైన్య ప్రజలకు క్రీస్తును ప్రకటించెను. 
                  తరువాత పైసాండ్యం ప్రాంతములలో ప్రస్తుతపు యిస్తాంబుల్ సంఘములను స్థాపించి స్టాగిస్ అను సేవకునిపై విచారణ చేయువానిగా నియమించెను.                   ఆ సేవా సమయములో అనేకసార్లు జైలు శిక్షకు గురి అయ్యెను. రాళ్లతో కొట్టి తరమబడెను!                   పిదప గ్రీకు దేశమందు దెరేస్, మాసిదోనియ ప్రాంతములో సేవ చేసి చివరికి పట్రోస్ అను పట్టణమునకు చేరెను. 
                  అచ్చట అధిపతిగా ఉండిన యేజయేడిస్ భార్య మేక్సిమిల్ల అంద్రెయ బోధ విని మారు మనస్సు పొందెను. అందువలన అధిపతి ''అంద్రెయ, నీవు సేవ చేయుట మానకపోతే నిన్ను చిత్రహింస చేసెదను'' అని బెదిరించెను. అయితే అంద్రెయ అధిపతిని కూడా మార్చుటకు ప్రయత్నించెను. 
                   కోపోద్రేకుడైన యేజియేడిస్ అంద్రెయను సిలువ వేసి చంపమని ఆజ్ఞాపించెను. అంద్రెయను ఇంటు మార్కు రూపములో చేయబడిన సిలువలో వేసిరి. రెండు దినములు సిలువలో వేసిరి. రెండు దినములు సిలువలో వ్రేలాడిన అంద్రెయ ఎంత వేదనను అనుభవించెను. అక్కడికి వచ్చువారికి క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చెను. 
                    ''క్రీస్తుయేసూ, నన్ను చేర్చుకొనుము నేను నిన్ను చూచితిని, నేను నిన్ను ప్రేమించితిని : నీ యందు నేను ఉన్నాను; నీ నిత్య పరిపాలన సమాధానమందు నా ఆత్మను అంగీకరించుము'' అని ప్రార్ధించి ప్రాణము విడిచెను అంద్రెయ. 
                            క్రీస్తు శకము 69వ సంవత్సరము నవంబరు చివర దినమున అంద్రెయ హతసాక్షిగా మరణించెను.    
                        మేక్సిమిల్ల అంద్రెయ దేహమును పట్రోసులో సమాధి చేసెను. చక్రవర్తి కాన్స్టెంటైన్ కుమారుడు క్రీ. శ. 356లో అంద్రెయ ఎముకలను తీసుకొని వెళ్లి పైసాండ్యమందుగల పరిశుద్ద అపోస్థుల ఆలయ పీఠము మీద ఉంచెను. కపాల ఎముకలైతే పట్రోసులో నుండెను. 
                      1460 లో టర్కీయుల పౌసాండ్య మును పట్టుకొన్నప్పుడు అంద్రెయ కపాల ఎముకల భద్రత నిమిత్తము రోమా పట్టణమునకు తరలించిరి. అయితే 1964లో పోపు 6వ పాలు దానిని పట్రోసు గ్రీకు ఆర్తోడక్స్ సంఘమునకిచ్చెను. 
                    అంద్రెయ మరణించిన కొన్ని వందల సంవత్సరముల తరువాత ఆయన జ్ఞాపకార్ధ చిహ్నములను ఓడలో స్కాట్లాండ్ దేశమునకు తెచ్చిరి. ఒడ్డుకు చేర్చుటకు ముందు ఓడ బ్రద్దలయ్యెను. ప్రాణము దక్కించుకున్న నావికులు దరిచేరి క్రీస్తును ప్రకటించిరి. ఆ సముద్ర ప్రాంతము అంద్రెయ సింధుశాఖ అని పిలువబడుచున్నది. అంద్రెయ స్కాట్లాండ్ దేశపు పరిశుద్ద తండ్రిగా కొనియాడబడుతూ ఇంగ్లండు జాతీయ పతాకముతో అంద్రెయ సిలువ అని చెప్పబడు [+] ఆకార సిలువ గుర్తు కనబడుచున్నది. 
- రెవ.బి. సామ్యూల్ బాబు