వాక్యసందేశముPost Date:2013-10-01//No:27

ప్రార్ధనలో మనము గుర్తుంచుకొనవలసిన విషయములుప్రార్ధనలో
మనము దేవుని సన్నిధిలో ప్రార్ధన చేయునపుడు దేవుడు మన ప్రార్ధన అంగీకరించాలంటే మనము కొన్ని విషయములను గుర్తించి ప్రార్ధన చేయాలి అవి ఏమనగా :

(01)ప్రార్ధనలో కన్నులు తెరువకూడదు :                  మనము ప్రార్ధన చేయునపుడు కన్నులు మూసుకొని ఉండవలెను. కండ్లు తెరచుట ద్వారా అటు ఇటు చూస్తాము. ఏకాగ్రత ఉండదు. అపుడు మన మనస్సును ప్రార్ధనలో నిలకడగా ఉంచలేము. గనుక కండ్లు మూసుకొని ప్రార్ధన చేయవలెను. 

(02)ప్రార్ధన చేయునపుడు వేరే ఆలోచనలు ఆలోచించకూడదు:
                 మనము ప్రార్ధనలో ఉన్నంతసేపు మన మనస్సును స్థిరముగా అక్కడనే ఉంచవలెను. ఆ సమయములో ప్రార్ధనకు సంబంధించిన విషయాలు తప్ప మరియే విషయములు ఆలోచించకూడదు. కొందరు ప్రార్ధనలో ఉంటారు గాని వారి మనస్సు ఎటో ఎటో ప్రయాణము చేస్తుంది. వారు ప్రార్ధనలో వుండి ఏవేవో ఆలోచిస్తుంటారు. అది తప్పు ప్రార్ధనలో మనస్సు స్థిరముగా ఉండాలి. 

(03) ప్రార్ధనలో వస్త్రహీనులుగా ఉండకూడదు :
                  ప్రార్ధన చేయునపుడు పురుషులైన సరే, స్త్రీలైన సరే నిండు వస్త్రములను ధరించవలెను. ప్రార్ధనలో మన శరీరము దేవునికి కనబడకూడదు. కొంతమంది పురుషులు చొక్కా ధరించకుండా ప్రార్ధనలో ఉంటారు ఇలా ఉండకూడదు. కొంతమంది స్త్రీలు పలుచటి వస్త్రాలతో దేవుని సన్నిధిలో కూర్చుంటారు. ఇలా చేయకూడదు. మరి కొంతమంది స్త్రీలు దేవుని సన్నిధిలో ముసుగు వేసుకొనకుండా ప్రార్ధన చేస్తారు, పాటలు పాడతారు. ఇది మంచి పధ్ధతి కాదు. పురుషులైనా, స్త్రీలైనా క్రమమైన పద్ధతిలో నిండు వస్త్రాలు ధరించి ప్రార్ధనలో ఉండాలి. 

(04) ప్రార్ధనలో నిద్ర పోకూడదు : 
                   కొంతమందికి ప్రార్ధనకు రాగానే నిద్ర వస్తుంది. వారు నిద్ర మత్తుతో ఉండి దేవుని ఆశీర్వాదములు పోగొట్టుకుంటారు. దేవుడు దర్శించే సమయములో అబ్రహాము నిద్రపోయినందున అతనికి శాపము వచ్చినది. అదేమనగా అతని వంశస్థులు 400 సంవత్సరములు పరాయి దేశంలో బానిసలుగా ఉండవలసి వచ్చినది. చూచినారా, దేవుని సన్నిధిలో నిద్రపోయినందుకు అబ్రహామునకు ఎంత శాపము వచ్చినదో !                     నిద్ర మత్తు పుట్టించునది దురాత్మ. మనము ప్రార్ధనలో ఉన్నపుడు మనకు దురాత్మ నిద్రమత్తును కలుగజేస్తాడు. నిద్రమత్తులో ఉన్నవారు ప్రార్ధన చేయలేరు, దేవుని వాక్యము వినలేరు. దేవుని ఆశీర్వాదములు పొందుకోలేరు. చివరికి శాపము తెచ్చుకుంటారు. ప్రార్ధనలో నిద్రమత్తు రాకుండా వుండాలంటే నిద్ర ఆత్మను జయించాలి. దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి, ఆయన స్వరము కొరకు ఆయన యిచ్చు దర్శనముల కొరకు, ఆయన ప్రత్యక్షతల కొరకు, ఆయన ఆత్మను పొందుకొనే దాని కొరకు కనిపెట్టాలి. ప్రార్ధనలో కొంతమంది నిద్రపోయి వారి మీద, వీరి మీద తూలిపడతారు. ఒకరికి నిద్ర వస్తే ఆ నిద్రాత్మ మిగిలిన వారందరికీ అలుముకుంటుంది. అందువలన ప్రార్ధనలో ఎవరు నిద్రపోకూడదు. ఎవరికైనా నిద్ర వస్తే వారిని లేపాలి. నిద్రను బలవంతముగా 5 నిముషాలు ఆపితే మరలా రాదు. కొంతమందికి ఇంటి వద్ద నిద్రరాదు. దేవుని సన్నిధికి రాగానే నిద్ర వస్తుంది. ఇలాంటి వారు బాగా ప్రార్ధన చేసుకొని నిద్రను జయించాలి.

(05) ప్రార్ధనలో ఏకీభవించాలి :
                   కొంతమంది కలసి ప్రార్ధన చేయునపుడు వారిలో ఒకరు ప్రార్ధన చేయుచుండగా మిగిలిన వారందరూ మౌనముగా వుండి అతనితో ఏకీభవించాలి. అంతేగాని అటు ఇటు తిరుగుతూ ప్రార్ధనలో మాట్లాడుకొనుట కండ్లు తెరచి చూచుట మంచిది కాదు. ఒకరు ప్రార్ధన చేసి ముగించినపుడు అందరు కలసి ఆమెన్ అని చెప్పవలెను, కొందరు కలసి ఏకీభవించి చేసే ప్రార్ధన బలమైనదిగా వుండి కార్యములు సాధించును మత్తయి - 18:20. 

(06) ప్రార్ధనలో క్రమముగా కూర్చొనవలయును :
                    మనము ప్రార్ధన చేయునపుడు వచ్చిన వారందరూ క్రమముగా కూర్చునునట్లు చూచుకొనవలెను. కొందరు ముందు, కొందరు వెనుక, కొందరు గోడలకు ఆనుకొని, కొందరు చాపుకొని, కొందరు బోర్లా పడుకొని ప్రార్ధన చేస్తారు. ఇది మంచిది కాదు. ప్రార్ధనలో సరిగా కూర్చుని మోకరించి ప్రార్ధన చేయవలెను. మన ఇష్టానుసారముగా కూర్చొని ప్రార్ధన చేస్తే దేవుని ఆత్మ అక్కడ ఉండదు. 

(07)స్వార్ధముతో ప్రార్ధన చేయకూడదు :
                     మనము ప్రార్ధన చేయునపుడు పవిత్రముగాను, యదార్ధము గాను ఉండవలెనుగాని మనలో స్వార్ధము ఉండకూడదు కొంతమంది స్వార్ధపూరితమైన ప్రార్ధనలు చేస్తారు నన్ను కాపాడు, నా పిల్లలను కాపాడు, నా కుటుంబమును కాపాడు, అంతా నేను, నన్ను, నాకు, నాది అనే పదాలే వారి ప్రార్ధనలో ఉంటాయి. వారు ఇతరుల కొరకు ప్రార్ధన చేయరు. ఇది ఆత్మీయ జీవితములో లోతైన మెట్టుకాదు. మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్ధన చేసుకొనవలసిన బాధ్యులమై యున్నాము. 

(08)ప్రార్ధనలో దురుద్దేశాలు ఉండకూడదు :
                      యాకోబు 43లో ఇలా ఉన్నది. మీరడిగినను మీ భోగముల నిమిత్తము, దురుద్దేశములతో అడుగుదురు గనుక మీ కేమియు దొరుకుటలేదు కొందరు ప్రార్ధన చేయునపుడు వారి సుఖభోగముల కొరకు, విలాసముల కొరకు, చెడు కోరికల కొరకు, అపవిత్రమైన కార్యముల కొరకు, లోక సంబంధమైన విషయముల కొరకు ప్రార్ధన చేస్తారు. ఇవన్నియు దురుద్దేశాలు. మన ప్రార్ధనలో దురుద్దేశాలు ఉండకూడదు. 

(09) ప్రార్ధనలో ఇతరులను శపించకూడదు :
                      మనము ప్రార్ధన చేయునపుడు ఇతరులను దీవించమని కోరాలి గాని, శపించమని కోరకూడదు. కొందరు తమ ప్రార్ధనలో ఇతరులను దూషిస్తారు, నిందిస్తారు, శపిస్తారు, వారికి కీడు జరగాలని కోరుకుంటారు. వారు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని వారి విషయమై అభ్యంతరముగా వుంటారు. మన ప్రార్ధన వలన ఇతరులకు మేలే జరగాలి గాని కీడు జరగకూడదు. ద్వేషించిన వారిని ప్రేమించాలి. దూషించిన వారిని దీవించాలి మనలను శిక్షించిన వారిని రక్షించమని ప్రార్ధన చేయాలి అదే దేవునికి ఇష్టమైన ప్రార్ధన.

 (10) ప్రార్ధనలో శత్రువులను క్షమించాలి : 
                      యేసు ఇలా చెప్పెను ''మీరు ప్రార్ధన చేయునపుడెల్లా మీకు విరోధము ఉన్నవారు గుర్తుకు వస్తే వారిని అక్కడ మీ ప్రార్ధనలో క్షమించుడి'' అనగా మనము ప్రార్ధన చేయునపుడు మన ప్రార్ధనలో శత్రువులను క్షమించాలి. నీవు ఇతరులను క్షమించినపుడు దేవుడు నిన్ను క్షమించును. నీవు ఇతరులను క్షమించని యెడల దేవుడు నిన్నును క్షమించడు కొంతమంది పరిస్థితి ఇలా ఉంటుంది. దేవుడు వారి పాపములను క్షమించాలి గాని వారు మాత్రం ఇతరులను క్షమించరు. ఇది విపరీతబుద్ధి, నీవు ఇతరులను క్షమించినపుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు గనుక మన ప్రార్ధనలో క్షమాపణ ఉండవలెను. 

(11) ప్రార్ధనలో షరతులు ఉండకూడదు :
                      కొంతమంది ప్రార్ధన చేసేటప్పుడు దేవునికి షరతులు విధిస్తుంటారు. ఉదా :- నీవు నాకు ఉద్యోగము ఇస్తే నేను నిన్ను నమ్ముకుంటాను. నాకు కుమారుడు పుడితే నీవు దేవుడవని నమ్ముతాను, నీవు ఈ రోగమును స్వస్థిపరిస్తే నీలో శక్తి వుందని నమ్ముతాను. నీవు ఇది చేసిన నేను అది చేస్తాను అని అంటారు. దేవునికి మనము షరతులు పెట్టవలసిన పనిలేదు, దేవునిని పరీక్షించవలసిన పనిలేదు. మనము స్వచ్చందముగా ఆయనకు లోబడి ప్రార్ధన చేయాలి.

 (12)ప్రార్ధనలో దేవునికి సలహాలు ఇవ్వకూడదు : 
                      మనము ప్రార్ధన చేయునపుడు మన మనవులు ఆయన చిత్తమునకు అప్పగించుకోవాలి అంతేగాని ఆయనకు మనము సలహాలు చెప్పవలసిన పనిలేదు. కొంతమంది తమ ప్రార్ధనలో ప్రభువా ఇలాగ ఉంటే బాగుండును, అలాగుంటే బాగుండును, ప్రభువా ఇది మంచిది అది మంచిది కాదు అని దేవునికి సలహాలు ఇస్తారు. మనము ఆయనకు సలహాలు ఇవ్వవలసిన పనిలేదు ఆయనకు అన్నీ తెలుసు. ఆయన అన్నింటా జ్ఞానియైన దేవుడు మనము దేవుని చిత్తము జరుగునట్లు కోరుకొని ప్రార్ధించుట మంచిది. 


 రెవ. డా॥జి. ఐజయ్య