వాక్యసందేశముPost Date:2013-09-19//No:23

నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు. ( పరమ :7:7 )
నీవు
తాళ వృక్షము అనగా ఖర్జూరవృక్షము. ప్రభువు ద్వారా విమోచింపబడిన ఇశ్రాయేలీయులలో ఏ వంకరతనము లేదని, తిన్నగా ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. తాళవృక్షము లేక ఖర్జూర వృక్షము ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేలీయులు తాళవృక్షముతో ఎందుకు పోల్చబడ్డారో ఈ క్రింది వచనాలలో వివరణ ఉంది.

 1. కీర్తన 92:13 -  '' యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుదురు''. ఈ కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని వ్రాయబడి ఉన్నది. విశ్రాంతి దినమనగా ప్రభువు ఆయన బిడ్డల పాపమును క్షమించి, వారికి విశ్రాంతిని ఇస్తాడని మొదటి అర్ధం. విశ్రాంతి దినమనగా వెయ్యేండ్ల పరిపాలన అని రెండవ అర్ధం. వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు తాళవృక్షము {లేక} ఖర్జూర వృక్షమువలె ఉంటారు. వారు దేవుని మందిరంలో నాటబడినవారై ఉంటారు. వారు దేవుని ఆవరణములో జీవిస్తారు. ప్రభువును ఘనపరచి ఆయనను కీర్తిస్తారు. ప్రభువును ఆరాధిస్తారు. ఈ ప్రవచనం వెయ్యేండ్ల పరిపాలనకు సంబంధించినది. అయితే నేటి దినాలలో అనగా సంఘకాలంలో ప్రభువు బిడ్డలు ఆయన సంఘాన్ని ప్రేమించాలి. ఆయన సంఘములో నాటబడిన మొక్కలవలె తిన్నగా ఎదగాలి, ఫలించాలి.

 2. 1 రాజులు 6:29 - ''మరియు మందిరపు గోడలన్నింటి మీద లోపలనేమి, వెలుపలనేమి... తమాల వృక్షములను... చెక్కించెను''. ఇది సొలొమొను యొక్క మందిరం, మందిరపుగోడ మందిరాన్ని లోకానికి మరుగుజేస్తుంది. మందిరమును లోకానికి వేరుచేస్తుంది ఈ గోడ. గోడలోపల, గోడవెలుపల ఖర్జూరపు చెట్లు సొలొమొను చెక్కించాడు. గోడలోపల మందిరంలో ఉన్నా, గోడవెలుపల లోకంలో జీవించినా, దేవుని ప్రజలు తాళవృక్షము అనగా ఖర్జూరపు మొక్కలవలె దేవుని మహిమపరచేవారుగా ఉండాలి. మందిరంలో ఉన్నప్పుడు ఒక ప్రవర్తన, మందిరం బయట ఉన్నప్పుడు ఒక ప్రవర్తన దేవుని ప్రజలకు ఉండకూడదు. ఎక్కడ ఉన్నా ఖర్జూరపు మొక్కవలె ప్రభువు బిడ్డలు ప్రభుని ఘనపరుస్తూ జీవించాలి.

 3. రాజులు 6:32 -''రెండు తలపులను... వాటిమీద... తమాల వృక్షములను... చెక్కించి''. తలుపు మందిర ప్రవేశానికి సాదృశ్యం. తలపులను తీసినపుడు గుమ్మముల ద్వారా ప్రవేశిస్తాము. సొలొమొను మందిరపు తలుపులపై కూడా తాళవృక్షములను చెక్కించాడు. ప్రభువు 'నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను' అన్నాడు. తలుపు తీసి ప్రభువును చేర్చుకోవాలని ఆయన కోరుతున్నాడు. హృదయపు తలుపులు తెరచి, ప్రభువును హృదయాలలో సింహాసనాసీనునిగా చేయాలని ఈ తమాలవృక్షములు సూచిస్తున్నాయి. ప్రభువునకు మన హృదయపు తలుపులు తెరచి, ఆయన ప్రవేశానికి ఏదీ అడ్డులేకుండా చెయ్యాలి. క్రీస్తుప్రభువు ఆయన వాక్యం ఎల్లప్పుడూ మన హృదయంలో సమృద్దిగా జీవించునట్లు మన హృదయపు ద్వారాలు ప్రభువు కొరకు తెరచి ఉంచాలి.

4. నిర్గమ 15:27 - ''అంతట వారు ఏలీమునకు వచ్చిరి, అక్కడ పన్నెండు నీటి బుగ్గలు, డెబ్బది యీతచెట్లును ఉండెను''. ఖర్జూరవృక్షము, యీతచెట్లు, వీటినన్నింటినీ తాళవృక్షములని పిలుస్తారు. యాత్రలో ఉన్న ఇశ్రాయేలీయులకు పన్నెండు నీటిబుగ్గలు కనిపించాయి. పన్నెండు నీటిబుగ్గలు పన్నెండుమంది అపొస్తలులకు సాదృశ్యం. డెబ్బది యీతచెట్లు, ప్రభువు ఏర్పరచుకొన్న డెబ్బదిమంది శిష్యులకు సాదృశ్యం. లూకా 9:1; లూకా 10:1, ప్రభువు డెబ్బదిమంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. కోత విస్తారంగా ఉందని చెప్పాడు. ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించాలని వారికి సెలవిచ్చాడు. తోడేళ్ళమధ్య గొర్రెలవలె యుక్తమైన ప్రవర్తన కలిగి జీవించాలని సెలవిచ్చాడు. సంచివైనను, జోలైనను, చెప్పులనైనను తీసుకొని పోవద్దన్నాడు. అనగా లోకసంబంధమైనవి విశ్వాసయాత్రకు అడ్డుగా ఉండకూడదన్నాడు. దేవుని ప్రజలు అన్నింటిలో మితంగా ఉండి, ఆయన నామమును ఘనపరచాలని ప్రభువు సెలవిస్తున్నాడు. ఖర్జూరపుచెట్టు ఫలాన్ని యిస్తుంది. అలాగే దేవుని ప్రజల పనులవలన లోకం ఫలభరితం కావాలని దేవుడు కోరుతున్నాడు.

5. ద్వితీ 34:3 -''సోయరువరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ...'' ఇక్కడ ఈతచెట్లు, ఖర్జూరపు చెట్లకు, తాళవృక్షములకు సమానమైనవి. ఈ చెట్లు యెరికో మైదానంలో ఉన్నట్లు మనం గమనిస్తాం. యెరికో శాపగ్రస్తమైనది. అలాంటి శాపగ్రస్తమైన మైదానంలో ఖర్జూరపు మొక్కలు మొలిచాయి. అదేవిధంగా ఖర్జూరపు మట్టలవంటి దేవుని బిడ్డలు శాపగ్రస్తమైన  యెరికోవంటి ఈ పాపలోకంలో ఉంటున్నారు. ఖర్జూరపుపంట యెరికో ప్రజలు తింటున్నారు. అదేవిధంగా శాపగ్రస్తమైన ఈలోకము, దేవుని ప్రజలనుండి ఆత్మ సంబంధమైన పంట తిని ఆశీర్వాదం పొందాలి. అందువల్ల ప్రభువు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొన్నానని సెలవిస్తున్నాడు. దేవుని ప్రజలు బహుగా ఫలించి యెరికో అనే పాపలోకమును ఫలభరితం చేయాలి. 

 6. యోవేలు 1:12 -''అంజూరపు చెట్లు వాడిపోయెను''. ఈ వచనంలో అంజూరపు చెట్లవంటి విస్వాసులైన వారి ఆత్మీయ జీవితమును దేవుడు తెలియజేస్తున్నాడు. అంజూరపు చెట్లు వాడిపోయెనని దేవుడు సెలవిస్తున్నాడు. వాడుటకు ముఖ్య కారణమేమనగా దేవుని ప్రజలయొక్క చెడుజీవితం. పాపపు మత్తులో పడి దేవుని ప్రజలు, దేవుని అశ్రద్దచేశారు. దేవుని ప్రజలు పాడైపోయారు. లోక సంబంధమైన అపవిత్రత మత్తులో మనం ఉండకూడదు. భక్తుడు ప్రార్దించినట్లు ఏపాపమూ మనలను ఏలకుండ మనం జాగ్రత్తపడాలి. ఈ లోక సంబంధమైనవి వేటిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. మన జీవితాలలో మనం ఎండిపోకూడదు, వాడిపోకూడదు. తమాల వృక్షమువలె ఏ వాతావరణంలో అయినా ఫలించేవారుగా ఉండాలి.

M.ఇమ్మానుయేలు