వాక్యసందేశముPost Date:2013-09-12//No:15

ఆయనతో నడక సాధ్యమాఆయనతో
ఆయనతో కలిసి నడవటానికి మనకు కావలసింది సంపూర్ణ విధేయత. ఇదే మనలను దేవునితో సహవాసం కలిగి ఉండేట్లు, మనం పరిశుద్దతలో కొనసాగేలాగా చేస్తుంది. ఆది 5:22 - "హనోకు దేవునితో నడిచేను" అనే మాట మనం చదివిన ప్రతి సారి మనలో యేవో ఆలోచనలు..... బిగ్గరగా ఊపిరి పీల్చుకుని..... ప్చ్..... అంటూ శబ్దం చేసి, కుర్చీలో వెనక్కి వాలి, శూన్యంలోకి చూస్తుండిపోతాము. ఈ వచనమే గాదు ఏ వచనమైనా మనలను నిరాశపరచేందుకు కాదు, బలపర్చెందుకే వ్రాయబడిందని మర్చిపోవద్దు. వాక్యం ఆహారం కదా! నడక అనే మాట..... మనల్ని ఎంతో ఆలోచింపచేస్తుంది గాని అది స్వతహాగా.... సహవాసాన్ని చూపిస్తుంది. అంటే కలిసి నడవటం అంటే సహవాసం కాక ఇంకేమిటో మీరే చెప్పండి? మీరు ఎదురు దాడికి దిగారు. గానీ దీనినేలా సమర్ధిస్తారు? సర్, నా మాట వినండి,మనం కలిసి నడుస్తున్నాం అంటే మనం ఇద్దరం, అవునా? అంటే కలిసి నడిస్తే.... ఒకటిగా నడవటం కదా? కలిసి ఒకటిగా ఉండగలగటాన్ని ఏమంటాం? మీరే చెప్పండి? సహవాసం కాదా? హనోకు దేవునితో సహవాసం చేసాడు, అర్ధం తప్పిపోయిందా? పరిస్థితులు ఎలా ఉన్నా దేవునితో సహవాసం చేసాడు. అంటే నడిచాడనే గదా. ఇది మనకెంతో ప్రోత్సాహాన్ని, ఆదరణను, దైర్యాన్ని ఇస్తుంది. ఏలీయా మనవంటి మానవుడే అయినప్పుడు హనోకు సహితమ మనవంటి వాడే గదా? హెబ్రి 11:5 - మనలో ఉన్నది.... పరిశుద్దాత్మ దేవుడు అనుగ్రహించిన విశ్వాసమే. 1 కొరింథీ 12:9 హనోకు కలిగి ఉన్నది అదే విశ్వాసం. హనోకు విశ్వాసం వలన దేవునికి ఇష్టుడయ్యాడు. మరి మనలో గల విశ్వాసం వల్లనే మనమూ దేవునికి ఇష్టులం అయ్యాం. మనకు హనోకుకు తేడా లేదంటారా? విశ్వాసం ఒక్కటే. దేవుని వద్దకు వచ్చిన వారికీ, హనోకుకు ఉన్నది ఒక్కటేనని ఈ వచనం స్పష్టంగా చెబుతుంది. "ఆయన ఉన్నాడని" వెదకినవానికి ఫలం దయచేస్తాడని నమ్మాలి కదా? ఇది సామాన్యమైన విశ్వాసాన్ని గురించే చెబుతుంది గానీ విశ్వాసాల్లో గల వ్యత్యాసాన్ని గురించి చెప్పడం లేదు. అందుచేత విశ్వాస విషయం లో ఏ తేడా లేదు. మరి? అదే చెబుతున్నాను. ఆమోసు 3:3 - సమ్మతింపక ఇద్దరు కూడి నడతురా? సహవాసానికి, కలిసి నడవటానికి (సహవాసాన్ని కొనసాగించడానికి) కావలసింది ఇదే. ఇక్కడే మనకు హనోకుకు వ్యత్యాసం ఉంది. కొంచెం స్పష్టంగా చెబితే బాగుంటుందేమో? అపొ॥ 15:36 -39 ఉదాహరణకు పౌలు, బర్నబాలు కలిసి సేవ చేసారు, కలిసి ఉన్నారు, ఒక్కటే సహవాసం అంటే కలిసి నడిచారు, అవునా? కాని మార్క ను వెంట తీసుకువెళ్ళే దగ్గర? ఏం జరిగింది? ఇద్దరికీ అభిప్రాయ బేధం వచ్చింది. సమ్మతి కుదరలేదు, ఇద్దరి నడక వేరు అయింది. అనేక విషయాల్లో లేఖనం యొక్కఆదేశాలను మనం ఒప్పుకుంటాం కానీ నెరవేర్చే దగ్గర కాదన్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది. ఇద్దరం మనుష్యులమే అయితే గుర్తించలేకపోవచ్చు. పరిస్థితి తీవ్రమయ్యాక.... అప్పుడు గుర్తిచటం.... కానీ ఈ సహవాసం దేవునితో గదా. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు, ఆయనతో కలిసి నడవటానికి మనకు కావలసింది సంపూర్ణ విధేయత. ఇదే మనలను దేవునితో సహవాసం కల్గి ఉండేట్లు, మనం పరిసుద్ధతలో కొనసాగేలా చేస్తుంది. హనోకు వలన మనకు లభించే ధైర్యం ఏమిటి? మొదటి ధైర్యం - మానవుడు దేవునితో సహవాసం చెయ్యగలడు. ఇది సాధ్యమౌతుంది అనే యదార్ధత మానవాళికి ధైర్యమిస్తుంది. మనం ఇతరులకు పనికి రాకపోవచ్చు, మనలను ఇతరులు అంగీకరించకపోనూవచ్చు కానీ విశ్వాసం వలన దేవునికి ఇష్టులమైన మనం, ప్రార్ధనా సహవాసంలో ఆయనతో కొనసాగగలం. ఆయన మనతో సహవాసం చేసేందుకు మన వద్దకు వస్తారు, ఇదెంతటి ఆదరణ. అయ్యో మోషే మేము ఆయన స్వరము వినిన యెడల చనిపోయేదమేమో, నీవే మాతో మాట్లాడుము అనే మధ్యవర్తిత్వపు సహవాసం కాక, నేరుగా ప్రతి మానవునితో సహవాసం చేస్తారనే అమూల్యమైన యదార్ధత, యదార్ధ సహవాసం మనకు హనోకు జీవితంలో కనిపిస్తుంది. మన జీవితాల్లో లేనిది ఇదే గదా? మనం దేవునితో సహవాసం చేయటం కరువైంది, మన దృష్టి మనుష్యులపైనే ఉంది. పరిస్థితులపైనా ఉంది, ధనం వచ్చే దారులపై ఉంది, అన్నింటినీ సమకూర్చే దేవునితో సహవాసం చెయ్యటంపై లేకపోవడం ఆధునిక క్రైస్తవుని దుస్థితి. అయ్యో! ప్రభువా! క్షమించు, మరలా నీతో సహవాసం చేసేందుకు నాలో ఆకలి పుట్టించు. నాతో కలిసి నడిచేందుకు నీవు ఇష్టంగానే ఉన్నావు, ఇందుకు నాలోని సామాన్య విశ్వాసమే కారణం అంటూ మనం ప్రభువు పాదాల వద్దకు వెళదాం. రెండవ ధైర్యం - ఆది 5:22. మానవుని సహజ అభిప్రాయం,కుటుంబంతో దైవికంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చును, అని. అనేకమంది -వివాహం చేసుకోకపోతే ఎంత బాగుండును? హాయిగా దేవునితో, దేవుని సేవలో ఉండేవాడ్ని. నన్నెవరు ప్రశ్నిస్తారు, ఎవరు అడ్డగిస్తారు? అని..... అనుకుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. వివాహం లేనివాళ్లకు వాళ్లకుండే అడ్డంకులు, శరీర సంబధమైన, మానసిక సంబంధమైన అడ్డంకులు వాళ్లకూ ఉంటాయి. దేవునితో నడిచేందుకు సంసారం, సంసారిక జీవితం అడ్డంకి కాదని, అతడు దేవునితో నడుచుచూ కుమారులను, కుమార్తెలను కనెను {ఆది 5:22} అనే వచనం ధైర్యాన్ని, బలాన్ని కలిగిస్తుంది. కుహనా ఆలోచనాపరులు సంసారం చేసి ప్రార్ధన చెయ్యటం... వాక్యం చెప్పటం.... మంచిది కాదనే అభిప్రాయాలను విడిచిపెట్టుకోవాలనీ, అది తప్పు అభిప్రాయం మాత్రమేనని స్పష్టంగా బోధపడుతుంది. ఉపవాసం విషయంలోనే పౌలుగారు నియమం చెప్పారు, అంతవరకే. మూడవ ధైర్యం - ఎవ్వరూ లేకపోయినా అధైర్యపడనవసరం లేదనీ, నీతో దేవుడుంటాడని, ఆయన నిన్ను విడువని వాడనీ, పరిసుద్ధతను నీవు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడని, ఆయనతోడు సదా నీతో ఉంటుందని, అంతరంగంలో యదార్ధతను ఆయన కోరుకుంటాడు గనుక యదార్ధత ఇద్దరినీ సమ్మతి పరుస్తుందని, స్పష్టంగా అర్ధమై ధైర్యం లభిస్తుంది. లేఖనం ఇంకా వ్రాయబడలేదు అంటే వ్రాయబడిన వాక్యం ఆయన చూడలేదు. నేను చదువలేను ఎలా? నాకు చదువురాదు గదా? అనే వాళ్లందరికీ ధైర్యాన్నిచ్చే సందర్భం కూడా ఇది. చదువు హనోకుకు రాదని కాదు సుమా! చదవటం ఎంతైనా అవసరం. ప్రార్ధనకు వాక్యం ఆధారం అయినా దేవుని గురించి చెప్పే ఆదాము, షేతుల అనుభవాలు, చరిత్ర నేర్పిన పాఠం.... ఇవి హనూకుకున్నాయి. అపొ॥ 14:17- ప్రతి తరంలోనూ ఆయన తన నిమిత్తమై సాక్ష్యం అట్టిపెట్టుకోకుండా లేడు. హెబ్రీ 11:6- నేటికీ ఆయనను వెదికే వారికి సమీపంగా ఉండే దేవుడు, బయలుపర్చుకునే దేవుడు కూడా. ఇదెంతటి ధైర్యాన్నిస్తుంది. నాల్గవ ధైర్యం - యూదా 14,15. ప్రపంచం నిండా భక్తిహీనతే తాండవించినా, దేవుని గురించిన స్పృహ గలవారు ఒక్కరు కూడా లేకపోయినా, దేవుని ఉనికిని ప్రశ్నించే హేతువాద సంఘాలు విస్తరించినా, దేవునితో సహవాసం చెయ్యటం సాధ్యమే. ఎన్ని ప్రతికూలతలున్నా, ఎందరు విరోధంగా మాట్లాడినా, ఆయన అందరికీ కనబడకపోయినా, అందరితో మాట్లాడకపోయినా, విశ్వాసముంచిన నీతో సహవాసం తప్పక చేస్తారని, భూమ్మీద నిన్ను ఆయన తన సహవాసిగా కోరుకున్నారని అర్ధం అవుతుంది గదా, ఇది మన ధైర్యం. అందరికీ ఆయన కనిపిస్తే మంచిదే గదా? ఒకసారి సాధు సుందర సింగ ప్రభువుతో ప్రభూ! నీవు అందరికీ కనిపిస్తే, మాట్లాడితే వాళ్లంతా నమ్ముతారు కదా? అని ప్రశ్నించానని..... అయితే ప్రభువేం అన్నారు? ముప్ఫై మూడున్నర సంవత్సరాలు నేను అందరికీ కనిపించాను, అందరితో మాట్లాడాను గదా, ఎందరు నమ్ముకున్నారు? అని బదులు ప్రశ్నించారని, తానేం మాట్లాడక మౌనినయ్యానని తన అనుభవాన్ని చెప్పాడు. దేవునితో వ్యక్తిగత సహవాసం అన్ని పరిస్థితుల్లో సాధ్యమౌతుందని, మనకు ఆయనతో మాట్లాడే మనస్సుంటే ప్రార్ధనలో, వాక్య ధ్యానంలో మనం ఆయనతో చక్కటి సహవాసం చెయ్యటం వీలవుతుందనే ధైర్యం హనోకు జీవితం ద్వారా మనకు లభ్యమౌతుంది. ఐదవ ధైర్యం - మనుష్యుల వైపు చుస్తే.... నిరాశపడవలసి వస్తుంది. ఇది చారిత్రక సత్యం. భక్తిహీనత, భక్తిహీన క్రియలు, దేవునికి విరోధంగా మాట్లాడేవాళ్లు. యూదా 14,15 తమ తమ దురాశల చొప్పున నడుచుకునేవాళ్లు, మనుష్యులను ముఖస్తుతి చేసేవాళ్లు, సనిగేవాళ్ళు, తమ పరిస్థితికి దేవుని నిందించేవాళ్లు, డంబమైన మాటలు పలికేవాళ్ళు.... హనోకు నివశిస్తున్న ప్రాంతంలో బహుగా విస్తరించి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అయినా హనోకు భవిష్యత్తులోనికి దృష్టి సారించి ఆయన వైపే చూడటం ద్వారా వీటన్నింటి ప్రభావం నుండి బయటపడి, ఆయనతో అమూల్యమైన సహవాసాన్ని చేసాడు. ఏకదృష్టి గలవాడై.... మనకు నేటి తరంలో వర్తమానమయ్యాడు. హెబ్రీ 12:2 - మనం కూడా విశ్వాసమునకు కర్తయూ, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూస్తూ, లోక ప్రభావం నుండి విడిపించబడుతూ, ఆయన సన్నిధిని అనుభవిస్తూ..... ఆయనతో నడిచే కృపను కొనసాగించుకొందుము గాక, ఆమెన !